పండుగ పూట విషాదం | Four people lost their lives | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం

Published Thu, Oct 23 2014 2:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM

Four people lost their lives

* ప్రాణాలు కోల్పోయిన నలుగురు
* శోకసంద్రంలో నాలుగు కుటుంబాలు
* దీపావళికి ముందు రోజు దుస్సంఘటన
* క్రిమినల్ కేసుల నమోదుకు కలెక్టర్ ఆదేశం

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పండుగ పూట పెను విషాదం నెలకొంది. నాలుగు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బుధవారం సాయంత్రం నగరంలోని వినాయకనగర్ అశోకా టవర్స్‌లో జరిగిన దుస్సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో ముగ్గురు కూలీలు కాగా, ఒకరు ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్. సెంట్రింగ్ చెక్కలను బయటకు తీయడానికి, మూడు నెలల క్రితం నిర్మించిన ట్యాంకులోకి దిగిన వీరు ఊపిరాడక మృతి చెందారు. ట్యాంకు కొంతకాలం మూసి ఉంచడం వలన అందులో విష వాయువులు వ్యాపించాయని, అందుకే ప్రమాదం జరిగిందని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మధుసూదన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.

ట్యాంకులోపల ఆక్సిజన్ శాతం 15 నుంచి 20 వరకు పడిపోయిందని, కార్బన్ మోనాక్సైడ్ ఉద్భవించాయని పేర్కొన్నారు. పాడుబడిన బావులలోనూ, శుభ్రపరచని మురుగు కాల్వలలోనూ ఈ విషవాయు వులు ప్రబలుతాయన్నారు. ట్యాంకు 12 అడుగుల లోతు, 18 అడుగుల వెడల్పుతో ఉంది. మూత చిన్నగా ఉంది. దీంతో దిగినవారు దిగినట్టుగానే ముందుగా స్పృహ కో ల్పోయి, ఆ తరువాత ప్రాణాలు విడిచారు. ట్యాంకులోపల ఉన్న సెంట్రింగ్ చెక్కలు నీళ్లలో నానడంతో కుళ్లిపోయాయని, విషవాయువుల వ్యాప్తికి ఇది కూడా కారణమని భావిస్తున్నారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా జరిగిన ఈ సంఘటన అందరినీ కలిచివేసింది.

‘నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయావా అయ్యా’ అంటూ వాచ్‌మన్ శంకర్ భార్య రోదించడం, ‘అమ్మా నాన్నను లేపు’ అంటూ కొడుకు, కూతురుల రోదించడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు.శంకర్ స్వగ్రామం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెన గ్రామం. బతుకుదెరువు కోసం ఇందూరుకు వలస వచ్చాడు. కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్‌పీ చంద్రశేఖరరెడ్డి సంఘటనా స్థలాన్ని సం ద ర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అపార్టుమెంటు యజమాని, ఆర్కిటెక్చర్‌పైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, అ పార్టుమెంటు నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరి చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. వారు సరిగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement