చెట్టు ఎక్కి ఇల్లు కట్టారు!
అహోరాత్రులు శ్రమించి 85 అడుగుల చెట్టు ఇంటిని నిర్మించారు ఇంగ్లండ్‌కు చెందిన ఎల్డెన్ కోన్లే, హారీ, హైనెస్ అనే కుర్రాళ్లు. విశేషం ఏమిటంటే ఈ వృక్షగృహాన్ని నిర్మించడానికి సుత్తులు, మేకులలాంటివి ఏవీ వాడలేదు.
‘‘ఒకవైపు ఎండ దంచేస్తోంది. మరోవైపు ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దాలనే తపన. మా తపన ముందు ఎండ చిన్న బోయింది’’ అని గుర్తు చేసుకున్నాడు హెనెస్. పందొమ్మిది సంవత్సరాల ఈ కుర్రాడు ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు.
ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ఒక వ్యవసాయక్షేత్రంలో ఈ చెట్టిల్లు కడుతున్న క్రమంలో చిన్నా చితకా గాయాలయ్యాయి. అయితే వాటిని లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఇదంతా ఒక ఎత్తయితే ఫామ్ యజమాని టిమ్ టేలర్ భయాలు మరో ఎత్తు!
‘‘అయ్యో..మీకు ఏమన్నా అవుతుందేమో. రిస్కు తీసుకుంటున్నారేమో’’
‘‘చెట్టు మీద నుంచి కింద పడతారేమో’’ ఇలా ఏవేవో ఊహించుకొని భయపడుతూ ఉండేవాడు. అతనికి నచ్చజెప్పి పనిలోకి వెళ్లడానికి తలప్రాణం తోకకు వచ్చేది. పనంతా పూర్తయిన తరువాత మాత్రం ముగ్గురు మిత్రులనూ తెగ మెచ్చుకున్నాడు ఆ వ్యవసాయక్షేత్ర యజమాని.
‘‘వాళ్ల పట్టుదల చూస్తే ముచ్చటేసేది’’ అని కుర్రాళ్ల పనితనం గురించి గొప్పగా చెబుతాడు టేలర్.
ఫేస్‌బుక్‌లో ‘బ్లూ ఫారెస్ట్ ట్రీ హౌజ్’ నిర్వహించిన ‘బెస్ట్ ట్రీ హౌజ్’ పోటీలో ఈ ముగ్గురు మిత్రుల ‘వృక్షగృహం’ మొదటి బహుమతి గెలుచుకుంది.
‘‘ఎప్పుడూ ఈ చెట్టింటిలోనే నివసించాలనేంత గొప్పగా ఉంది’’ అంటున్నారు న్యాయనిర్ణేతలు.