ముంబై: ఇటీవల టీమిండియా ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కని అజింక్యా రహానే కౌంటీ క్రికెట్ ఆడేందుకు సన‍్నద్ధమవుతున్నాడు. వచ్చే నెల నుంచి జూలై మధ్య వరకూ జరుగనున్న ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. దీనిలో భాగంగా తనకు కౌంటీల్లో హాంప్‌షైర్ తరఫున ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి లేఖ ద్వారా విన్నవించాడు. దీన్ని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ)కు పంపిన విషయాన్ని రాహుల్ జోహ్రి ధృవీకరించాడు.
దీనిపై ఒక సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. గతంలో పలువురు క్రికెట్లరకు కౌంటీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన బోర్దు.. రహానే విషయంలో కూడా సానుకూలంగానే స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ గతేడాది విరాట్ కోహ్లి సర్రే తరఫున ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇచ‍్చింది. అలాగే చతేశ్వర్ పుజారా, ఇషాంత శర్మలు కూడా కౌంటీ క్రికెట్ ఆడారు. అటువంటప్పుడు రహానేకు అనుమతి కచ్చితంగా వస్తుంది. అందులోనే రహానే వరల్డ్‌కప్ జట్టులో కూడా లేడు. ఇక వేరే అంతర్జాతీయ ఒప్పందాలు కూడా రహానాకు లేవు. దాంతో రహానేకు బీసీసీఐ అనుమతి ఇచ్చి అతని టెస్టు క్రికెట్ మరింత మెరుగుపడటానికి సహకరిస్తుందనే అనుకుంటున్నా’ అని సదరు అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment