‘జీవితంలో ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’.. అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే అంత కష్టం మరీ. ఇక హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే కత్తి మీద సామే. కేవలం స్థలం కొనాలంటేనే కోట్లు కావాలి. ఈ సమస్య ఒక హైదరాబాద్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ విషయాన్నే గ్రహించిన ఓ ఆర్కిటెక్ట్ ఓ వినూత్నఇళ్లు డిజైన్‌కు శ్రీకారం చుట్టారు. 90 చదరపు మీటర్లోనే పూర్తయ్యే ఈ ఇంటికి కేవలం 30వేల యూఎస్ డాలర్లు(రూ. 22లక్షలు) ఖర్చవుతుందట!
ఒకే గదిలా ఉండే ఈ ఇంటిలో కిచన్, బెడ్ రూం, వాష్‌రూమ్ వంటి సకల వసతులున్నాయి. ఒకే గదిలో ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటాన్నారే ఇక్కడే ఉంది ట్విస్ట్. బెడ్‌ను మడత బెట్టినట్టు కిచన్, బెడ్‌రూమ్, వాష్‌రూమ్‌లను మడతబెట్టుకోవచ్చు. అవసరమైన వాటిని వాడుకొని, మిగతావీ మూసేయడమే. అంతే కాదండోయ్ ట్రక్కులా ఉండే ఈ ఇల్లును ఏ ప్రాంతానికైనా సులభంగా తరలించవచ్చు. ఈ వినూత్న ఆలోచనను లియోనార్డో డి చియారా అనే ఆర్కిటెక్ట్ టినీ హౌజ్ యూనివర్సిటీ సహకారంతో రూపొందించారు. దీనికి అవాయిడ్ అని నామకరణం చేశారు. ఈ డిజైన్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది.
తన చిన్నప్పుడు తల్లితండ్రులతో కలిసి చిన్న ఇంటిలో నివసించిన అనుభవమే ఈ ఆలోచనను తట్టేలా చేసిందని లియోనార్డో చెప్పుకొచ్చారు. ఈ ప్రస్తుత డిజైన్ బెర్లిన్‌లోని బహస్-ఆర్కివ్ మ్యూజియం గార్డెన్‌లో ఉందని, మరిన్నీ సూచనలతో మరింత మెరుగుపరుస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment