ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు భయం | Chief KCR to the architecture of fear | Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు భయం

Feb 3 2015 12:16 AM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వాస్తు భయం వెంటాడడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను బేరం పెడుతున్నారని, ...

ప్రొఫెసర్ కంచ ఐలయ్య
 
బషీర్‌బాగ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వాస్తు భయం వెంటాడడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను బేరం పెడుతున్నారని, పరిపాలనపై దృష్టి పెట్టలేక పోతున్నారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శ్రీ రాపోలు రాములు అధ్యక్షతన తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ‘ముస్లిం -క్రైస్తవ మైనార్టీలు- రాజ్యాధికారం’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధాన వ్యక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వాస్తు భయంతో కొత్త భవంతుల నిర్మాణాల వైపు వెళుతున్నారన్నారు. మూఢ నమ్మకాలతో, శాస్త్రీయ పరిశీలనను కోల్పోయిన పాలకులు ప్రజలను ఎటువైపు తీసుకెళుతారని ఆయన ప్రశ్నించారు. నేడు డబ్బు కోసం ప్రభుత్వ స్థలాలను బేరం పెడుతున్నారని, భవిష్యత్తులో అసెంబ్లీతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలనూ బేరానికి పెట్టొచ్చని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కూడా వాస్తు భయం పట్టుకుందని, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రధాన కార్యదర్శి వి.జి.ఆర్.నారగోని మాట్లాడుతూ.. ముస్లింలు, క్రైస్తవులకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలన్నారు. మైనార్టీలపై జరుగుతున్న హింసాకాండ, ప్రాథమిక హక్కుల అణచివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయా కులాలకు కేవలం భవనాల నిర్మాణాలతో పొద్దు వెళ్లబుచ్చుతోందని, పరిపాలన అంటే  అగ్రకులాల సొమ్ముగా భావిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించాలని, బీసీల రిజర్వేషన్లు 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో ‘సియాసత్’ ఎడిటర్ అమీర్ అలీఖాన్, నేషనల్ అలయన్స్ దళిత ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి చార్లెస్ వెస్లీ మూసా, నాయకులు కె.చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement