
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్!
ఎడమచేతి వాటం ఉన్నవారి చేతలన్నీ హృదయపూర్వకంగా ఉంటాయట. వాళ్లు ఏ పని చేసినా గుండెనిండుగా చేస్తారట. వాళ్ల చేయి హృదయానికి దగ్గరగా ఉండటమే దీనికి కారణమట. ఈ మాటలు ఎడమచేతి వాటం ఉన్న మహానటి సావిత్రివి. ఎడమచేతి వాటం ఉన్నవారు ఎన్నోచోట్ల తమదైన ప్రత్యేకత చాటుకుంటారు. పైగా వాళ్లలో తెలివితేటలు కూడా ఎక్కువేనట. క్రికెట్‌లో ఎడమచేతి బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ సొగసుగా ఉంటుంది. డిగో మారడోనా ఎడమచేయి అడ్డం పెట్టడంతో అయిన గోల్‌ను ‘దేవుడి హస్తం’గా అభివర్ణించారు సాకర్ అభిమానులు. ఈ నెల 13 (అంటే రేపు) లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా శరీర నిర్మాణంలో ఎడమచేతి వాటానికి ఉన్న ప్రత్యేకతలను తెలిపే కథనమిది.
మనలోని అత్యధికుల్లో కుడిచేతి వాటం ఉన్నా.... కొందరికి ఎడమచేతి వాటమూ ఉంటుంది. జనాభాలో 5% నుంచి 26% మందిలో ఎడమచేతి వాటం ఉంటుంది. ఇది మహిళల్లో కంటే పురుషుల్లో మరింత ఎక్కువ.
ఎలా వస్తుంది..?
మెదడులో రెండు అర్ధభాగాలుంటాయి. దేహంలోని కుడివైపున ఉండే అవయవాల కదలికలను మెదడులోని ఎడమ అర్ధభాగం నియంత్రిస్తుంది. అదే... ఎడమవైపున ఉండే శరీర భాగాలన్నింటినీ కుడి అర్ధభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధభాగం బలంగా ఉంటే వాళ్లకు ఎడమచేతి వాటం వస్తుందన్నమాట. మెదడులోని ఏ భాగం బలంగా మారి, అది కుడిచేతి వాటం వస్తుందా, లేక ఎడమచేతి వాటం అలవడుతుందా అన్నది బిడ్డలోని జన్యువులపై ఆధారపడి ఉంటుంది. ఒకరికి ఏ చేతి వాటం వస్తుందన్నది చాలావరకు అమ్మ తరఫువారి జన్యువులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇలా ఎడమచేతి వాటం వచ్చినవారిలో కొన్ని ముఖ్యమైన పనులు (అన్నం తినడం, రాయడం వంటివి) కుడిచేత్తోనే చేసేలా అలవాటు చేస్తారు కాబట్టి, వీళ్లు రెండు చేతుల్తోనూ చాలావరకు అన్నిరకాల పనులు చేయగల సామర్థ్యం (యాంటీడెక్స్‌ట్రస్‌నెస్) వస్తుంది. ఇలా యాంటీడెక్స్‌ట్రస్ మన జనాభాలో రెండు శాతం కంటే తక్కువే. ఇక కుడి చేతి వాటం కంటే ఎడమచేతి వాటం ఉన్నవారి సంఖ్య తక్కువే అన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తికి ఎడమచేతి వాటం వస్తుందా లేక కుడిచేతివాటమా అన్నది గర్భసంచిలో ఉన్న పిండదశలోనే తెలిసిపోతుంది.
మన మెదడు రెండు సగభాగాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎడమ సగభాగం (లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్) ఎదుగుదల. కుడి సగభాగం (రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్)తో పోలిస్తే కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఈ క్రమంలో మన కదలికలను నియంత్రించే భాగాలు కుడివైపునకు జరుగుతాయి. ఇక మన కదలికలను నియంత్రించే భాగాలు కుడివైపునకు జరగడంతో ఎడమచేతి వాటం అలవడుతుంది. ఇలా ఎడమచేతి వాటం వస్తుందన్నమాట.
ఎడమచేతి వాటం వారి ప్రత్యేకతలెన్నో...
శరీర నిర్మాణశాస్త్రం ప్రకారం చూస్తే ఎడమచేతి వాటం ఉన్నవాళ్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని...
మన మెదడులోని కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే బాధ్యతను ‘కార్పస్ కొలోజమ్’ అనే భాగం నిర్వహిస్తుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిలో ఈ కార్పస్ కొలోజమ్ పెద్దగా ఉంటుంది. దాంతో మన మెదడులోని కుడి, ఎడమ భాగాలమధ్య సమన్వయం మరింత చురుగ్గా, సమర్థంగా జరుగుతుంటుంది. ఈ కారణంగానే ఎడమచేతి వాటం ఉన్నవారిలో మాట్లాడే శక్తి, వేగం, సామర్థ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత బాగుంటాయి. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారిలో తెలివితేటలు (ఐక్యూ) కూడా ఎక్కువే. ఈ కారణంగానే మిగతావారితో పోలిస్తే వాళ్లలో లెక్కలుచేసే సామర్థ్యం (మ్యాథమెటికల్ ఎబిలిటీస్) ఎక్కువగా ఉంటాయి. సంగీతకారులు, కళాకారులు, క్రీడాకారుల్లో ఎడమచేతి వాటం ఉన్నవారు ఎక్కువే. అయితే వాళ్లలో ఎడమచేతి వాటం ఉన్న కారణంగా దానితో పాటు కుడిచేతినీ ఎక్కువగా ఉపయోగిస్తుండటం వల్ల చాలామంది క్రీడాకారుల్లో రెండు చేతులతోనూ పనులుచేసే సామర్థ్యం పెరిగి, రెండింటినీ సమానంగా ఉపయోగించగల నేర్పు అలవడుతుంది.
తప్పని తిప్పలు...
మన సమాజంలో కుడిచేతి వాటం ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కావడంతో ఉపకరణాలన్నీ కుడిచేతి వాటం ఉన్నవారికి అనుకూలంగా తయారుచేస్తుంటారు. దాంతో ఎడమచేతి వాటం ఉన్నవారికి అవి అంతగా అనుగుణంగా లేక వారు పనిచేసే చోట ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అంతెందుకు... మన టైలర్లు బట్టలు కుట్టినప్పుడు బటన్స్ పెట్టడం, జేబును కుట్టడం కూడా కుడిచేతి వాటం వాటికి అనుగుణంగానే చేస్తారు. ఇలాంటి సమయాల్లో ఎడమచేతి వాటం వారు కాస్త ఇబ్బందులకు లోనవుతుంటారు. ఈ కారణంగానే ఎడమచేతి వాటం పిల్లలు కుడిచేతివాటం ఉన్నవారికి అనుగుణంగా తయారయ్యే వస్తువులనే ఉపయోగించాల్సి రావడంతో వారి వికాసం కాస్త ఆలస్యం కావడం, అరుదుగా కొందరిలో ఆటిజమ్, స్కిజోఫ్రీనియా వంటి జబ్బులకు గురికావడం కూడా జరుగుతుంది.
చేతివాటం సరే... మరి కాలివాటమో...?
మనది ఎడమచేతివాటమా లేక కుడిచేతి వాటమా అన్నది చాలా సులభంగా తెలిసిపోతుంది. మరి ఎడమకాలి వాటమా లేక కుడికాలి వాటమా తెలియడం ఎలా? సాధారణంగా కుడిచేతి వాటం ఉన్నవారిలో కుడికాలి వాటమే ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్లు తన్నాల్సివచ్చినా లేదా వాహనం కిక్ కొట్టాల్సి వచ్చినా కుడి కాలినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారన్నమాట. అలాగే కుడిచేతి వాటం ఉన్నవారిలో కన్ను కూడా కుడి కన్నువాటమే ఎక్కుగా ఉంటుంది. అంటే టెలిస్కోప్ వంటి వాటిలో చూడాల్సి వచ్చినా లేదా ఏదైనా ఆయుధాన్ని పట్టుకుని గురి చూడాల్సివచ్చినా కుడిచేతి వాటం ఉన్నవారు గబుక్కున (అంటే అసంకల్పితంగా) కుడికన్నునే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే కుడిచేతి వాటం ఉన్నవారిలో రుచిచూడటం, వాసన చూడటం, వినడం అన్నీ కుడివైపు భాగాలతోనే సౌకర్యంగా చేస్తారు. అంతెందుకు ఎవరైనా ముద్దుపెట్టుకోబోతే గబుక్కున తల తిప్పేయడం అన్నది కుడివైపునకే ఎక్కువగా చేస్తుంటారు. ఇవే సూత్రాలు ఎడమచేతి వాటం వారికీ దాదాపుగా వర్తిస్తాయి. (ఏవో కొన్ని సందర్భాల్లో కొన్ని మినహాయింపులతో).
కుడి ఎడమయ్యే సందర్భాలు ఉంటాయా?
మన కవుల ప్రాప్తకాలజ్ఞత గొప్పది. ‘కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్...!’ అని పాటలతో జీవితసత్యాన్ని ఆవిష్కరించిన విషయం అక్షర సత్యం. కుడి ఎడమయ్యే అవకాశాలు ఉంటాయనే అంటున్నారు వైద్యులు, వైద్యవిజ్ఞాన శాస్త్రంలో కృషిచేస్తున్న పరిశోధకులు. ఎలా అన్నదానికి మన జాతిపిత మహాత్మాగాంధీ మంచి ఉదాహరణ. మహాత్మాగాంధీది పుట్టుకతో కుడిచేతి వాటం. కానీ ఆయన జీవితకాలంలో చాలా పనులు ఎడమచేతితో చేయడాన్ని అభ్యాసం చేశారు. ఒక దశలో ఆయన రైటర్స్ క్రాంప్ అనే ప్రతిబంధకం ఎదురుకావడంతో ఎడమచేత్తో రాయడాన్ని ప్రాక్టీస్ చేశారు. అలా ఎడమచేత్తోనూ అంతే సమర్థంగా రాయడంలో నైపుణ్యాన్ని సాధించారు.
ఎడమచేతి వాటం మంచిదేనా...?
ఏ చేతి వాటం మంచిదనే అంశంపై చాలా వాదనలు ఉన్నాయి. ఎడమచేతి వాటం ఉన్నవారి విషయంలో ‘పుర్రచేతి వాటం’ అంటూ సమాజం కాస్తంత వివక్షతోనే ఉంటుంది. కొన్ని సమాజాల్లో ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు... ఆ చేత్తో పనులు చేయడాన్ని మిగతావారు ఆక్షేపిస్తూ ఉంటారు.
ఎందరో (ఎడమచేతి వాటం) మహానుభావులు...
ఎడమచేతి వాటం ఉన్నవారిలో ప్రతిభావంతులు, ప్రముఖులు చాలామంది ఉన్నారు. ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్, జూలియస్ సీజర్, ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, భౌతిక శాస్త్రవేత్త న్యూటన్, ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ బోనపార్టే, సంగీతకారుడు బిథోవెన్, క్వీన్ విక్టోరియా, ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్, బిల్‌గేట్స్, బరాక్ ఒబామా, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వంటి వారెందరో ఎడమచేతి వాటం వారే.
ఎడమచేతి వాటం ఉన్న పిల్లలకు అడ్డు చెప్పకండి...
పిల్లలు తమకు జన్యుపరంగా సంక్రమించిన చేతి వాటాన్ని ప్రదర్శించడం సాధారణం. పిల్లలెవరైనా సరే... చిన్నప్పుడు రాత వంటివి అభ్యాసం చేసే సమయంలో ఎడమచేతితో చేస్తుంటే పెద్దలు అడ్డుచెప్పడం సరికాదు. అలా చేస్తే, అది వారిలో న్యూనతను పెంచడం వంటి దుష్పరిణామాలకు దారితీయవచ్చు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో కొందరు పిల్లల్లో అది మానసికమైన సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అందుకే పిల్లలు ఎడమచేత్తో రాయడం, వస్తువులను ఉపయోగించడం వంటివి ఏదైనా చేస్తుంటే పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు చెప్పకూడదు. పైగా వారికి ఏ చేతితో చేస్తే సౌకర్యంగా ఉంటే, ఆ చేత్తోనే పనులు చేయమంటూ ప్రోత్సహించాలి. అది వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు వారి సర్వతోముఖ వికాసానికి దోహదపడుతుంది.
- నిర్వహణ: యాసీన్
డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి
చీఫ్ న్యూరో ఫిజీషియన్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
జంతువుల్లో, పక్షుల్లోనూ ఉంటుందీ ‘ఎడమ’ వాటం...
మెదడు పక్షుల్లోను, జంతువుల్లోనూ ఉంటుంది. ఇలా రెండు అర్ధభాగాల్లో ఒకటి కాస్త బలంగా, డామినెంట్‌గా ఉండటం అన్నది జంతువుల్లో, పక్షుల్లోనూ ఉంటుంది. కాబట్టి కొన్ని పక్షుల్లో కుడివైపునవి కంటే ఎడమవైపు రెక్కలు బలంగా ఉంటాయి. ఇక మన పెంపుడు జంతువులైన కుక్కల్లోనూ కొన్నింటికి ఎడమవైపుకాళ్లు బలంగా ఉంటాయి. చింపాంజీలు, గుర్రాలు, ఆఖరికి సముద్రపు క్షీరదాలైన తిమింగలాల్లోనూ (వేల్స్‌లోనూ) జన్యుపరంగా ఎడమ వాటం వస్తే... ఎడమవైపు శరీర భాగాలు కుడివైపు కంటే బలంగా ఉంటాయి.