దేహవింతలు | Body Wonders in world wide | Sakshi
Sakshi News home page

దేహవింతలు

Published Mon, Apr 17 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

దేహవింతలు

దేహవింతలు

పదిశోధన

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఏడు వింతలు ఎప్పటికీ మనకో వండర్‌. అయితే.. అంతకంటే విడ్డూరమైన, విచిత్రమైన నిర్మాణాలు మన ఒంట్లోనే ఉన్నాయని మీకు తెలుసా? ఉదాహరణకు గుండెనే తీసుకోండి! దేహం మొత్తం మీద కష్టపడి పనిచేసే కార్మికురాలు గుండె ఒక్కటే. ప్రతిరోజూ ఈ కండరం... ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్లు నడపగలిగేంత శక్తిని (ఎనర్జీని) ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడి పైకి వెళ్లి రావచ్చు! గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయంచోదక విద్యుత్‌ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది.

ఇక మెదడు! అది మీరీ వండర్‌. మెదడులో 60 శాతం కొవ్వే ఉంటుంది. ఏ సమయంలోనైనా మన మెదడు 25 వాట్‌ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. ఒక బల్బు వెలగడానికి ఇది చాలు. అంతేకాదు, 50 వేల రకాల వాసనలను మెదడు పసికట్టగలదు. ఏ వయసులోనూ ఉండనన్ని మెదడు కణాలు అత్యధికంగా రెండేళ్ల వయసులో ఉంటాయి. అయినా సరే మెదడు పూర్తిగా పరిణతి చెందడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. ఇవి కాక... మన బాడీలో ఇంకా ఏయే వండర్స్‌ ఉన్నాయో చూడండి.

చర్మం: మానవ దేహంలోని అతి విస్తారమైన భాగం ఇది. నిరంతరం తనని తను పునర్నవీకరించుకుంటూనే ఉంటుంది! ప్రతి నిముషం 50 వేల చర్మకణాలు రాలిపోతుంటాయి. ఇలా జీవితకాలం మొత్తం రాలిన కణాల బరువు 18 కిలోలు ఉంటుంది.

మెదడు: మనం మేల్కొని ఉన్నప్పటి కంటే, నిద్ర పోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మన బ్రెయిన్‌ ఎంత గొప్పదంటే... అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకు 70 వేల ఆలోచనలు చేయిస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే... బ్రెయిన్‌ వల్ల మనం నొప్పిని గుర్తించగలం కానీ, బ్రెయిన్‌కి వచ్చే నొప్పిని గ్రహించలేం!

ఎముకలు: మనం 300 కు పైగా ఎముకలతో పుడతాం. పెద్దవాళ్లం అయ్యేనాటికి వాటి సంఖ్య తగ్గి, 206కి చేరుకుంటాయి! కారణం కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమే.

జ్ఞాపకశక్తి: గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8 వేల కొత్త కణాలతో వృద్ధి చెందుతుంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది.

వెంట్రుకలు: ప్రతి నాలుగు వారాలకు అంగుళంలో నాలుగో వంతు పెరుగుతాయి. అంటే 6 మిల్లీమీటర్లు. అలా ఒక్కో వెంట్రుకా ఆరేళ్ల వరకు పెరుగుతుంది. తర్వాత రాలిపోతుంది. అదేచోట కొత్త వెంట్రుక మొలుస్తుంది.

ఇనుము: మన దేహంలో ఉండే ఇనుము మొత్తంతో మూడంగుళాల పొడవైన మేకును తయారుచెయ్యొచ్చు.

కన్ను: మానవ నేత్రం 576 మెగాపిక్సెల్‌ సామర్థ్యం గల  డిజిటల్‌ కెమెరా వంటిది! అది కోటి రకాల వేర్వేరు రంగుల ఛాయల్ని గుర్తించగలదు.

నీరు: మనిషి తన జీవితకాలంలో 75 వేల లీటర్ల నీరు తాగుతాడు. దేహం అంత నీటిని పీల్చేస్తుందన్నమాట.

ముక్కు, చెవులు: మనిషి ముక్కు, చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుదల ఒక్కొక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో కనిపించదు.

తుమ్ము: ఒక బలమైన తుమ్ము మన ముక్కులోంచి, నోట్లోంచి గంటకు 64 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement