కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్! | Careers with Architecture Engineering | Sakshi
Sakshi News home page

కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్!

Published Sun, May 11 2014 10:54 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్! - Sakshi

కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్!

ఆకాశహర్మ్యాలు.. అందమైన భవంతులు.. ప్రఖ్యాత కట్టడాలు.. చరిత్ర గతిని మార్చిన భారీవంతెనలు, డ్యామ్స్‌కు చిరునామా.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్! నిర్మాణాలనుప్రణాళికాబద్ధంగా.. మానవ అవసరాలకు అనుగుణంగా.. ఆకర్షణీయమైన రూపునిచ్చి నిర్మించడంలో శిక్షణనిచ్చే కోర్సు.. ఆర్కిటెక్చర్!! నాటి ఈజిప్టు పిరమిడ్‌ల నుంచి నేటి ఆధునిక డ్యామ్‌లు, విల్లాలు, అపార్ట్‌మెంట్స్ వరకూ.. ఎన్నో అద్భుత నిర్మాణాలకు రూపమిచ్చింది ఆర్కిటెక్చర్లే. వందల ఏళ్ల క్రితమే ఆవిష్కృతమైన ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్.. కాలానుగుణంగా రూపుమార్చుకుంటూ ఆధునికత సంతరించుకుంటోంది. కెరీర్ పరంగానూ నేటి యువతకు ఎన్నో అవకాశాలు అందిస్తోంది. ఉజ్వల కెరీర్‌కు బాటలు వేస్తున్న ఆర్కిటెక్చర్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై  ఈ వారం కవర్ స్టోరీ..
 
 ఆర్కిటెక్చర్.. నిర్మాణాలకు అందమైన ఆకృతినిచ్చే విభాగం. కట్టడాలు, నిర్మాణాలకు సంబంధించి శాస్త్రీయ అవగాహనతోపాటు సాంకేతిక నైపుణ్యాలను అందించే కోర్సు.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. ఈ కోర్సు పూర్తిచేసిన వారే ఆర్కిటెక్ట్‌లు. ప్రపంచీకరణ, ఆధునికీకరణల నేపథ్యంలో.. మౌలిక సదుపాయాల రంగం ముఖ్యంగా నిర్మాణరంగం శరవేగంగా పురోగతి సాధిస్తోంది. దీంతో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అకడెమిక్ అర్హతలతోపాటు సృజనాత్మకత కీలకపాత్ర పోషించే ఈ విభాగంలో అడుగుపెడితే కలర్‌ఫుల్ కెరీర్ ఖాయం.
 
 డిమాండ్‌కు కారణాలివే
 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌కు శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ.. గత దశాబ్ద కాలంగా ఈ విభాగానికి, నిపుణులకు భారీగా డిమాండ్ ఉంటోంది. మన దేశంలో గత దశాబ్ద కాలంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు భారీగా విస్తరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. జాతీయ రహదారులు, భారీ ఆనకట్టలు, వంతెనల నిర్మాణాలు చేపడుతున్నాయి. వీటిని కూడా సదరు ప్రాంతీయ పరిస్థితులు, భౌగోళిక సామర్థ్యాలకు అనుగుణంగా నిర్మించాలంటే ఆర్కిటెక్ట్‌ల అవసరం తప్పనిసరి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు కూడా నిర్మాణ రంగంలోకి ప్రధానంగా గ్రూప్ హౌసింగ్ నిర్మాణ విభాగంలో అడుగుపెడుతున్నాయి. దాంతో ఆయా అవసరాలకు అనువైన రీతిలో నిర్మాణాలు చేపట్టాలంటే.. నిపుణులైన ఆర్కిటెక్ట్‌ల అవసరం ఏర్పడుతోంది. ఈ రంగంలోని నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం- మన దేశంలో ఏటా సుమారు పదివేల మంది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుల అవసరం ఉంది. కానీ సర్టిఫికెట్లు అందుకుంటున్న విద్యార్థులు రెండు వేల లోపే ఉంటున్నారు.
 
 అంటే.. మానవ వనరుల డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం 80 నుంచి 85శాతం మధ్యలో ఉంది. రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ రూపొందించిన ‘రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా బై 2020’ నివేదిక ప్రకారం.. భారత నిర్మాణ రంగ అవసరాలు, వనరుల దృష్ట్యా వచ్చే దశాబ్దంలో దాదాపు నాలుగు లక్షల మంది ఆర్కిటెక్ట్‌ల అవసరం ఉంటుంది. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరికీ కొలువు ఖాయం అని చెప్పొచ్చు.
 
 బ్యాచిలర్ డిగ్రీ నుంచే కోర్సులు
 ప్రస్తుతం మన దేశంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సు అందుబాటులో ఉంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు మొదలు.. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు సైతం బీఆర్క్ కోర్సును అందిస్తున్నాయి. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.
 
 పీజీలో పలు స్పెషలైజేషన్లు

 ఉన్నత విద్య విషయానికి వస్తే.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎంఆర్క్) కోర్సులో చేరొచ్చు. ఈ విభాగంలో పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ డిజైనింగ్, రీజనల్ ప్లానింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, నావల్ ఆర్కిటెక్చర్ వంటి స్పెషలైజేషన్లను పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. అర్బన్ డిజైనింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లకు డిమాండ్ ఉంది. ఇవే విభాగాల్లో పీహెచ్‌డీ చేసే అవకాశమూ ఉంది.
 
 ఇన్‌స్టిట్యూట్‌లు- అర్హతలు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశ నిబంధనలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఐఐటీల్లో బీఆర్క్‌లో చేరాలనుకునే విద్యార్థులు జేఈఈ-మెయిన్‌లో రెండో పేపర్ (బీఆర్క్/బీప్లానింగ్)తోపాటు, జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను జూన్ 26న నిర్వహించనున్నారు. దీనికోసం అడ్వాన్స్‌డ్ తర్వాత జూన్ 20 నుంచి 24 తేదీల మధ్యలో అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్ రెండో పేపర్‌లో ఉత్తీర్ణత సరి పోతుంది.
 
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్‌లో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో, రాష్ట స్థాయి యూనివర్సిటీలు-అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). మన రాష్ట్రంలో ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) క్యాంపస్ కళాశాల సహా మొత్తం 15 కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు.
     
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్), ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ర్యాంకు సాధించాలి.
 
 ఆర్కిటెక్చర్‌లో స్పెషల్.. PA
 ఆర్కిటెక్చర్ కోర్సులను అందించడంలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఇన్‌స్టిట్యూట్... స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ రంగంలో నిపుణుల అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు మాదిరిగానే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోసం ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు రూపకల్పన చేసింది. ప్రస్తుతం దేశంలో మూడు క్యాంపస్‌లు(న్యూఢిల్లీ, విజయవాడ, భోపాల్) ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ప్లానింగ్, పీజీ కోర్సులు, పీహెచ్‌డీ అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సుల్లో సీట్లను జేఈఈ-మెయిన్ పేపర్-2లో ర్యాంకు ఆధారంగా నిర్వహించే సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ద్వారా; పీజీ కోర్సుల్లో సీట్లను గేట్ స్కోర్ ఆధారంగా సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎం.ప్లాన్/ఎం.ఆర్క్ (సీసీఎంటీ)ద్వారా భర్తీ చేస్తారు.
 
SPA విజయవాడ పీజీ నోటిఫికేషన్
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - విజయవాడ క్యాంపస్‌లో ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్,  అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఒక్కో స్పెషలైజేషన్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు పలు విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ పీజీ స్పెషలైజేషన్లలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను సీసీఎంటీ ద్వారా భర్తీ చేస్తారు. మరో 50 శాతం సీట్లకు జాగ్రఫీ/ఎకనామిక్స్/సోషియాలజీల్లో 60 శాతం మార్కు లతో పీజీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
 దరఖాస్తులకు చివరి తేదీ: మే 30, 2014
 ఇంటర్వ్యూ, పరీక్ష తేదీ: జూలై 7-8, 2014
 వెబ్‌సైట్: www.spav.ac.in
 
 అవకాశాలు.. హోదాలు

 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఖాయం. ప్రారంభంలోనే ట్రైనీ ఆర్కిటెక్ట్ లేదా జూనియర్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్‌గా నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.60 వేల జీతం అందుకోవచ్చు. వీటితోపాటు ఈ రంగంలో సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు (క్యాడ్, క్యామ్ తదితర) సొంతం చేసుకుంటే అవకాశాలు, ఆదాయం ఇంకా ఎక్కువగా లభిస్తాయి.  అంతేకాకుండా సొంతంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినవారికి ప్రైవేటు రంగంలో.. రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలు, ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీలు ముఖ్యమైన ఉపాధి వేదికలు. ప్రభు త్వ రంగంలో పురాతత్వ శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, రైల్వేశాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసోసియేషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ వంటి పలు విభాగాల్లో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి.
 
 రాణించాలంటే ఈ నైపుణ్యాలు కావాలి
 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ విభాగంలో రాణించి ఉన్నత స్థానాలు అందుకోవాలంటే.. సదరు అకడెమిక్ సర్టిఫికెట్‌తోపాటు స్వీయ లక్షణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో సృజనాత్మకత, పరిశీలన, విశ్లేషణ, మ్యాథమెటికల్ నైపుణ్యా లు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అవసరం. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే కెరీర్ అంత ఉన్నతంగా ఉంటుంది. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఎంతో ప్రధానం.
 
 దేశంలో ప్రముఖ ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్‌లు
 
* స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (న్యూఢిల్లీ,
విజయవాడ, భోపాల్ క్యాంపస్‌లు)
* జేఎన్‌ఏఎఫ్‌ఏయూ క్యాంపస్ కళాశాల-హైదరాబాద్
* ఎన్‌ఐటీ-పాట్నా
* ఎన్‌ఐటీ-రాయ్‌పూర్
* సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ
* ఎన్‌ఐటీ- కాలికట్
* విశ్వేశరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- నాగ్‌పూర్
* ఎన్‌ఐటీ- తిరుచిరాపల్లి
* ఐఐటీ-ఖరగ్‌పూర్, రూర్కీ
 ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్‌లు, సీట్ల వివరాలకు వెబ్‌సైట్: www.coa.gov.in
 
 అద్భుత కెరీర్‌కు సోపానం
 
దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో.. కెరీర్‌పరంగా ఉజ్వల భవిష్యత్తును అందించే కోర్సు.. ఆర్కిటెక్చర్. ప్రస్తుత అవసరాల దృష్ట్యా వేల సంఖ్యలో ఆర్కిటెక్చర్ కోర్సు ఉత్తీర్ణుల అవసరముంది. ప్రస్తుతం మానవ వనరుల డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం భారీగా ఉంది. దాంతో ఐఐటీలు, ఐఐఎంల మాదిరిగా మరిన్ని జాతీయస్థాయి ప్రాముఖ్యమున్న ఆర్కిటెక్చర్ కళాశాలలు ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకునేముందు వాటి ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించాలి.

బోధన, శిక్షణ, మౌలిక సదుపాయాల గురించి తెలుసుకొని మంచి కళాశాలను ఎంచుకోవాలి. మిగతా ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లతో పోల్చితే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వినూత్నమైంది. అకడెమిక్ స్థాయిలోనే నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాలి. అప్పుడే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ క్యాంపస్‌లో ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేసేలా బోధన సాగిస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు అందేవిధంగా విదేశీ యూనివర్సిటీలతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు కూడా రూపకల్పన చేశాం. ఈ విభాగంలో ఉన్నత విద్యకు కూడా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనలు చేయడం వల్ల మరిన్ని ఫలితాలు లభిస్తాయి.
                    
 -ప్రొఫెసర్ ఎన్.శ్రీధరన్, డెరైక్టర్,
 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement