చివర్లో అమ్మకాలు
105 పాయింట్లు నష్టం
28,458 వద్దకు సెన్సెక్స్
నిఫ్టీ 26 పాయింట్లు డౌన్
చివర్లో పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,458 వద్ద నిలవగా, 26 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,538 వద్ద స్థిరపడింది. దీంతో వారం మొత్తంగా కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఏడు వారాల తరువాత మళ్లీ సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయింది. కాగా, బీఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1.5% స్థాయిలో నష్టపోయాయి. మరోపక్క ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ ఇండెక్స్‌లు 1%పైగా బలపడ్డాయి.
ఏడు మాత్రమే...
సెన్సెక్స్ దిగ్గజాలలో ఏడు షేర్లు మాత్రమే లాభపడగా, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, సెసాస్టెరిలైట్ 2% స్థాయిలో పుంజుకున్నాయి. అయితే హెల్త్‌కేర్‌లో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, ఐటీ బ్లూచిప్స్‌లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1.5% మధ్య నీరసించాయి. ఇక బీఎస్‌ఈ-500 సూచీలో భాగమైన స్పైస్‌జెట్ 14% పతనమైంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రుణ సౌకర్యాన్ని రద్దు చేయడం ఇందుకు కారణమైంది.
ఈ బాటలో షసున్ ఫార్మా, కేశోరామ్, అలోక్, సుజ్లాన్, ఎల్జీ, సద్భావ్ ఇంజినీరింగ్, ఏపీఎల్, ఐడియా, వైభవ్ గ్లోబల్, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, హాట్సన్, త్రివేణీ, బీఎఫ్ యుటిలిటీస్, జెట్ ఎయిర్‌వేస్ తదితరాలు 5-3% మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ షేర్లలో డీఎల్‌ఎఫ్ 5% పుంజుకోగా, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్, యూనిటెక్ 1% చొప్పున లాభపడ్డాయి.