లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
‘ఐఏఎంసీ’పిల్‌పై కౌంటర్ వేయనందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ట్రస్టుకు రూ.300 కోట్ల విలువైన 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించినా వేయకపోవడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, కౌంటర్ దాఖలు చేసే వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నం.83/1లో 3.70 ఎకరాలను ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021, డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది.
అలాగే నిర్వహణ ఖర్చుల కింద రూ.3 కోట్ల సాయం చేస్తూ మరో జీవో ఇచ్చింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, కోటి రఘునాథరావు 2023లో హైకోర్టులో వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. గత నవంబర్‌లో విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. ఉచితంగా భూమి, ఆర్థిక సాయంపై ప్రభుత్వ జీవోలు చట్టవిరుద్ధమన్నారు. ఈ జీవోలను రద్దు చేసి, ఇప్పటికే చెల్లించిన సొమ్మును తిరిగి వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వాదనలను విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ కార్యదర్శి, ఐఏఎంసీ సీఈవోలకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ పిల్‌లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ కౌంటర్ వేసే వరకు టీఎస్‌ఎల్‌ఎస్‌ఏకి రోజుకు రూ.వెయ్యి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment