శ్రీనగర్‌లో హైకోర్టు కాంప్లెక్సు భవన శంకుస్థాపనలో లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు.
దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు.
న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే..
తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment