Clients
-
ఐఐఎఫ్‌ఎల్‌పై సెబీ కొరడా.. కొత్త క్లయింట్ల చేరికపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గతంలో ఇండియా ఇన్ఫోలైన్గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీపై క్లయింట్ నిధుల అక్రమ వినియోగం కేసులో సెబీ తాజాగా చర్యలు చేపట్టింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 జనవరి మధ్య కంపెనీ ఖాతా పుస్తకాలను పలుమార్లు పరిశీలించాక సెబీ క్లయింట్ల చేరికపై నిషేధం విధించింది. 2011 ఏప్రిల్– 2014 జూన్ మధ్య కాలంలో క్లయింట్ల క్రెడిట్, డెబిట్ బ్యాలన్స్‌లను అక్రమంగా వినియోగించినట్లు దర్యాప్తులో సెబీ గుర్తించింది. ఇదే విధంగా 2015–16, 2016–17 మధ్య కాలంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ పేర్కొంది. వెరసి స్టాక్ బ్రోకర్‌గా రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ సెబీ ఆదేశించింది. క్లయింట్ నిధుల అక్రమ వినియోగంపై 2022 మే నెలలో కంపెనీపై సెబీ రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫీ నుంచి ప్రైవేట్ ‘5జీ సర్వీసులు’
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్ 5జీ–యాజ్–ఎ–సర్వీస్‌ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీ, విశ్వసనీయ వైర్లెస్ కనెక్టివిటీ లభించగలదని సంస్థ తెలిపింది. డేటా ప్రాసెసింగ్‌కు పట్టే వ్యవధిని కుదించడం ద్వారా నెట్‌వర్క్‌లో జాప్యాన్ని తగ్గించగలిగే మల్టీ–యాక్సెస్ ఎడ్జ్ కంప్యూటింగ్ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నట్లు ఇన్ఫీ తెలిపింది. -
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
నా సక్సెస్ సీక్రెట్ వాళ్లే
ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీనటులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్ కంపెనీ ‘‘సెలబ్రిటీస్ సీక్రెట్’’ అన్నారు డాక్టర్ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్మెంట్ చేసేముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాక అది సక్సెస్ అయితేనే ఆ ట్రీట్మెంట్ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్ గురించి చెప్పటం వల్ల మౌత్ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్’’ ఎండి డాక్టర్ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్. ఈ సందర్భంగా దా. మాధవి వెంకట్ మాట్లాడుతూ–‘‘ ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
న్యూఢిల్లీ: కోర్టులిచ్చే తీర్పులు సకారణంగా, కక్షిదారులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు కోర్టులో ఎందుకు ఓడిపోయిందో, లేక ఎందుకు గెలిచిందనే విషయం కక్షిదారులకు తెలిసేలా తీర్పులుండాలని సూచించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోర్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005–06 కాలానికి గాను తమ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయలేదు. బాధితులు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ను ఆశ్రయించగా వెంటనే రూ.87,204 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంపోజిట్ కంపెనీ ఈపీఎఫ్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. పరిశీలించిన ట్రిబ్యునల్ బోర్డ్ ఆదేశాలను పక్కన బెట్టింది. దీంతో ట్రస్టీస్ బోర్డ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పరిశీలించిన ఇండోర్ బెంచ్.. బోర్డ్ పిటిషన్‌ను కొట్టి వేయడంతోపాటు ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈ తీర్పుపై ఈపీఎఫ్ బోర్డ్ సుప్రీంకు వెళ్లింది. విచా రణ చేపట్టిన జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్.. ‘ఆ తీర్పు కక్షిదారుల పట్ల పక్ష పాతం చూపినట్లుంది. కేసులో కక్షిదారులు తామెందుకు ఓడామో లేక గెలిచామనే విష యం తెలియకుండాపోయింది’ అని పేర్కొంది. -
అయోధ్య కేసులో మిగిలింది ప్రధాన కక్షిదారులే
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూ కేటాయింపు కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ సున్నిత కేసులో కక్షిదారులుగా చేరడానికి సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాడ్, శ్యామ్ బెనగల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రధాన కక్షిదారులే ఇకపై విచారణలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూ వివాదానికి సంబంధించిన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అన్న అంశంపై తొలుత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ‘మధ్యంతర జోక్యంపై కక్షిదారుల లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి పిటిషన్లతో ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తూ వాటిని తిరస్కరిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ఇకపై కూడా అలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హిందూ, ముస్లిం సంస్థలు, వ్యక్తులే కక్షిదారులుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. -
నా కేసు విచారించాల్సిందే.. లేకుంటే ఉరేసుకుంటా..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల కొరత.. కేసులు సత్వర విచారణకు నోచుకోలేని పరిస్థితులు.. ఈ నేపథ్యంలో కక్షిదారుల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. విచారణ జాబితాలో కేసులు ఉంటున్నా.. అవి ఎప్పుడు విచారణకు నోచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కక్షిదారులు రకరకాలుగా తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. లాయర్ల ద్వారా కేసులు దాఖలు చేసిన కొందరు తమ న్యాయవాదులపై అసహనాన్ని చూపుతుంటే.. న్యాయవాదితో నిమిత్తం లేకుండా సొంతం(పార్టీ ఇన్ పర్సన్)గా వాదనలు వినిపించుకునే కక్షిదారుల్లో కొందరు ఏకంగా న్యాయమూర్తులపైనే అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా కక్షిదారుడొకరు ఓ అడుగు ముందుకేసి, తన కేసు విచారించకుంటే ఇక్కడే ఉరేసుకుంటానంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనాన్నే బెదిరించడం సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కోర్టులో తాను ధరించిన బెల్టు తీసి మెడకు బిగించుకుని ఇక్కడే ఉరివేసుకుని చచ్చిపోతానంటూ బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆ కక్షిదారుడు కేసు విచారణకు సంబంధించి ధర్మాసనాన్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కక్షిదారుడి అనుచిత ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునేలా అతను వ్యవహరించారని, అతని చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తెలిపింది. కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ ఆ వ్యక్తికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అతను దాఖలు చేసిన కేసు విచారణకు వచ్చిన రోజు తప్ప, మిగిలిన రోజుల్లో తమ అనుమతి లేకుండా ఆ వ్యక్తిని కోర్టులోకి అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులకు ప్రతిభ ఆధారంగా కాక సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇచ్చారని, ఇది సరికాదంటూ ఆర్వీఎన్ఎస్ మూర్తి హైకోర్టులో గత ఏడాది ఫిబ్రవరిలో పార్టీ ఇన్ పర్సన్‌గా పిటిషన్ దాఖలు చేశారు. తనను రిజిస్ట్రార్/కంట్రోలర్‌గా తిరిగి నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం వర్సిటీ అధికారులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. తర్వాత ఈ వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో వస్తున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదు. ఔట్ ఆఫ్ టర్న్ విచారించాల్సిందే.. ఈ నేపథ్యంలో మూర్తి పలు సందర్భాల్లో ఔట్ ఆఫ్ టర్న్(కేసును ప్రత్యేకంగా విచారించడం)గా తన కేసును విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ధర్మాసనం అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. 2001లో దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అప్పటి నుంచి 2015 వరకు పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ పక్కన పెట్టి 2016లో దాఖలై న కేసును ప్రత్యేకంగా విచారించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. బుధవారం మూర్తి దాఖలు చేసిన వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో ఉంది. ఈ వ్యాజ్యాన్ని ఔట్ ఆఫ్ టర్న్‌గా విచారించాలని మూర్తి మరోసారి కోరారు. అది సాధ్యం కాదని ధర్మాసనం చెప్ప గా, విచారించాల్సిందేనని, లేనిపక్షంలో ఉరేసుకుంటానని బెదిరిస్తూ తన బెల్టును తీసి మెడకు బిగించుకున్నారు. తన కేసుతో ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అరవడం ప్రారంభించారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. దీంతో ధర్మాసనంతో పాటు కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులందరూ బిత్తరపోయారు. కోర్టు హాలులో అరవడం, బెల్టు తీసి మెడకు బిగించుకోవడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటి మూర్తి చర్యలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, అతని తీరు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. ఇది కోర్టు ధిక్కారమేనని తెలిపింది. పోలీసులను పిలిచి అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులను అతను అందుకునేంత వరకు అతన్ని అదుపులోనే ఉంచుకోవాలని రిజిస్ట్రార్ (జుడీషియల్)ను ఆదేశించింది. నోటీసు అతనికి ఇచ్చిన తర్వాత పోలీసుల సాయంతో అతన్ని కోర్టు బయట విడిచిపెట్టాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ బుధవారం సాయంత్రం అతనికి నోటీసులు అందజేశారు. అనంతరం పోలీసులు అతన్ని కోర్టు బయట విడిచిపెట్టారు. ఇటువంటి ప్రవర్తన పునరావృత్తం కాకూడదన్న ఉద్దేశంతో మూర్తిని అతని కేసు విచారణ ఉన్న రోజు తప్ప, మిగిలిన రోజుల్లో కోర్టు ప్రాంగణంలోకి అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో 61 న్యాయమూర్తులకు గానూ కేవలం 33 మందే ఉన్నారు. ఇటీవల ఆరుగురు న్యాయమూర్తుల నియామకం జరగడంతో ఈ సంఖ్య 33కు చేరింది. -
కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు
ముంబై: ఇన్ఫోసిస్ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో తీవ్ర అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇన్ఫీ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన కమెంట్లు ఐటీ షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ లో భారీ పుంజుకున్న ఐటీ దిగ్గజ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తమ క్లయింట్స్ ఐటీ వ్యయాలను చూస్తున్నారంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. తమ అంతర్జాతీయ ఖాతాదారులు బిల్లింగ్ రేటును దాదాపు 50శాతం తగ్గించాలని చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల దేశీయ పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందని చెప్పారు. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ఐటీ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ సహా ఇతర టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మిడ్‌సెషన్ తరువాత ప్రధానంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి. అటు సీవోవో ప్రవీణ్‌రావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రైస్‌కట్ గురించి తాను చెప్పలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరణ ఇచ్చారు. -
బాదుడుకు రెడీ!
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో రుసుముల మోత భారీగా పెరగనున్న లావాదేవీల చార్జీలు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడంపై ఖాతాదారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చిత్తూరు: పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులు లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవా ల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. జిల్లాలో సుమా రు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. అంటే 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిం దే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భా గంగానే ఏప్రిల్ ఒకటి నుంచి లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయబ్యాంకులు ప్రస్తుతం ఉన్న లావాదేవీల చార్జీ లను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త చార్జీల వివరాలు పంపాయి. ఈపెంపుపై జాతీయ మీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెం పునకు వ్యతిరేకంగా నెటిజన్లు ఏప్రిల్ 6ను లావాదేవీల రహిత దినంగా ప్రకటించారు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్నిరకాల బ్యాంకు లావాదేవీలను నిలి పేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు 754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుం పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు లావాదేవీలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. హెచ్డీఎఫ్సీ ప్రతి నెలా నాలుగు లావాదేవీలు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి లావాదేవీపై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కోరోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోం బ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ చార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుం ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర లావా దేవీల చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుం చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జి ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి లావాదేవీలు చేస్తే ప్రతి లావాదేవీకి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడుసార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవీపై సర్వీస్ టాక్స్, రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ.100 పెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతిరోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. -
డబ్బు మీది.. మోత మాది..
ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా చార్జీల మోత మోగించడానికి రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండంపై ఖాతాదారులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్యులు. ఇప్పుడు బ్యాంకులు ట్రాన్సాక్షన్ చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. చిత్తూరు : జిల్లాలో సుమారు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జిల్లా జనాభాలో 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి నుంచి పై స్థాయి వరకు దాదాపుగా అందరికీ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ప్రస్తుతం ఉన్న ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త ఛార్జీల వివరాలు పంపాయి. ఈ పెంపుపై జాతీయమీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా నో బ్యాంక్ ట్రాన్సాక్షన్డేగా ఏప్రిల్ 6ను ప్రకటించారు నెటిజన్లు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్ని రకాల బ్యాంకు ట్రాన్సాక్షన్లను నిలేపేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుములు పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడు సార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవిపై సర్వీస్ టాక్స్, రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ. 100 ఫెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు సార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతి రోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. హెచ్డీఎఫ్సీ.. ప్రతి నెలా నాలుగు ట్రాన్సాక్షన్లకు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కో రోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోబ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ ఛార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ.. నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుము ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సి బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుము చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జీ ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు ఖాతాదారుల నుంచి. -
కొత్త ఏడాదిలోనూ.. అదే వరుస
నగదు కోసం బ్యాంకులో బారులు తీరిన ఖాతాదారులు పనిచేయని ఏటీఎంలు తప్పని వేతన యాతన మంచిర్యాల అగ్రికల్చర్ :ఎంతో సంబరంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికినా.. సోమవారం ఎంతో ఆశతో బ్యాంకులకు చేరుకున్న ఖాతాదారులకు మాత్రం కష్టాలు తప్పలేదు. కొత్త ఏడాదిలో అయినా ఇబ్బందులు తప్పుతాయనుకుంటే బారులు తీరాల్సిన పరిస్థితే వచ్చింది. అందులోనూ వేతనాలు డ్రా చేసుకునే సమయం.. ఇంకేముంది ఇటు ఉద్యోగులు, అటు ఖాతా దారులు వందలాదిగా తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. గత నెల ఒకటో తారీ ఖున ఎదుర్కొన్న ఇబ్బందులనే సోమవారం పడ్డారు. రూ.4 వేలతో సరి.. ఉద్యోగులకు వేతనాలు వచ్చే రోజు కావడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలవారీ నగదు చెల్లింపులు ఉండటంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్దకు పరుగులు తీశా రు. శనివారం మధ్యాహ్నం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయడం.. ఆదివారం సెలవు కావడంతో సోమవారం బ్యాంకులు తెరుచుకున్నాయి. ఒకటో తారీఖు నుంచి ఏటీఎంలలో రూ.4500 తీసుకునేందుకు వెసులుబాటు కల్పించినా.. ఏ ఏటీఎంలలో కూడా నగదు కనిపించలేదు. 90 శాతం ఏటీఎంలలో నగదు పెట్టలేదు. జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు, పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బారులు తీరాల్సి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచే క్యూలో ఉన్నా.. రూ.4 వేలే ఇవ్వడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎస్బీహెచ్, ఎస్బీఐ పలు బ్యాంకులు నాలుగు వేల నగదు చెల్లింపులు చేయగా.. పలు ఆంధ్రా బ్యాంకుల్లో సరిపడా నగదు రాలేదని రూ.2 వేలతో సరిపెట్టారు. ఏటీఎంలదీ అదే పరిస్థితి.. కనీసం ఏటీఎంలోనైనా నగదు తీసుకోవాలన్న ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఏటీఎంలో విత్‌డ్రా పరిమితి రూ.4,500 పెంచడంతో వీటి ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. శనివారం పెట్టిన క్యాష్ అయిపోవడంతో సోమవారం బ్యాంకులు పనిచేసే సమయంలోనై క్యాష్ పెడుతారని ఏటీఎం కేంద్రాల ఎదుట పెద్దఎత్తున క్యూ కట్టారు. ప్రధాన్ బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో నగదు పెట్టగా.. మిగితా ఆయా కూడళ్ల వద్ద ఏటీఎంలో క్యాష్ కనిపించలేదు. నరకం చూపిస్తున్న పింఛన్లు.. ప్రతినెలా ఒకటో తారీఖున వచ్చే పింఛన్లు పొందేందుకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులేమో పింఛన్ సొమ్ము బ్యాంకుల్లో జమ అవుతుందని అంటున్నారు. బ్యాంకులకు వెళ్తే గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అయినా.. చేతికి నగదు అందుతుందా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. కనీసం అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో కూడా చూసుకునే పరిస్థితి బ్యాంకు వారు కల్పించడం లేదు. దీనికితోడు రూ.500 నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో పింఛన్ సొమ్ము చెల్లించేందుకు బ్యాంకు వారు తలలు పట్టుకుంటున్నారు. రెండు వేల నోట్లే అధికంగా వస్తుం డడంతో.. వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధాప్యంలో ఉండి.. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారు బ్యాంకులకు వెళ్లి పింఛన్ ఎలా తీసుకోగలరని.. ప్రత్యేక వెసులుబాటు ఏదైనా ఇవ్వాలని వృద్ధులు అంటున్నారు. మరింత పెరగనున్న రద్దీ జిల్లాలో 1వ తారీఖు నుంచి వారం రోజులపాటు ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కోట్లల్లో నగదు చెల్లింపు ఉంటుంది. దీనికితోడు సింగరేణి కార్మికులు కూడా రూ.33 కోట్లను బ్యాంకుల ద్వారా తీసుకోనున్నారు. అయితే.. 1వ తేదీ సెలవు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు 2వ నుంచి వేతనాలు బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్నాయి. సింగరేణి కార్మికులకు ప్రతినెలా 3వ తేదీ నుంచి బ్యాంకుల్లో జమ అవుతాయి. నెల మొదటి వారం నుంచి నెలవారి అప్పులు చెల్లింపులు, ఫీజులు, చీటీలు, తదితర ఇంటి అవసరాల ఖర్చులు ఉంటాయి. దీంతో వేతనాలు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్మికుల రద్దీ మరింత పెరుగుతుంది. -
ఇంకా తిప్పలే..
రాయపర్తి : పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారుు. సోమవారం బ్యాంకులకు సెలవు రావడంతో జిల్లాలోని పలు మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వారు క్యూలో నిల్చోగా.. తమ వంతు వచ్చే సరికి ఆలస్యం కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టినా.. కొద్దిసేపటల్లోనే అవి ఖాళీ అయ్యారుు. దీంతో లైన్లో నిల్చున్న వారు ఉస్సూరుమంటూ వెనుతిరిగారు. కాగా, రాయపర్తికి చెందిన పలువురు తమ పిల్లలను పాఠశాలలకు పంపించకుండా ఎస్బీహెచ్లో లైన్లో నిల్చోబెట్టడం కనిపించింది. -
మా క్లయింట్లు వెనక్కు తగ్గుతున్నారు
టీసీఎస్ ప్రకటన... • ఐదు శాతానికి పైగా నష్టపోయిన షేరు • ఇతర ఐటీ కౌంటర్లలోనూ అమ్మకాలు న్యూఢిల్లీ: అమెరికాలో ఆర్థిక సేవల రంగానికి చెందిన తమ క్లయింట్లు స్వేచ్ఛాయుత వ్యయం విషయంలో వెనక్కి తగ్గుతున్నారంటూ టీసీఎస్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేరును షేక్ చేసింది. బీఎస్ఈలో ఐదు శాతానికిపైగా నష్టపోయింది. ఐటీ రంగంలోని మిగిలిన షేర్లనూ నష్టపోయేలా చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి (బీఎఫ్ఎస్ఐ) చెందిన క్లయింట్లు అప్రమతతో వ్యవహరిస్తున్నారని... ఫలితంగా ఆదాయాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందంటూ టీసీఎస్ పేర్కొంది. ఈ ఒక్క ప్రకటనతో టీసీఎస్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 6.5 శాతం వరకు కుంగిన షేరు చివరికి బీఎస్ఈలో 5.14 శాతం నష్టంతో రూ.2,321 వద్ద క్లోజ్ అయింది. రూ.126 రూపాయలు నష్టపోయింది. ఎన్ఎస్ఈలోనూ 4.8 శాతం కోల్పోయి రూ.2,322.10 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.24,797 కోట్లు తరిగిపోయింది. బ్లూచిప్ కంపెనీల్లో అత్యధికంగా నష్టాల పాలయ్యింది ఈ కంపెనీ షేరే. ఇన్ఫోసిస్ 1.62 శాతం, విప్రో 1.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.70 శాతం, టెక్ మహీంద్రా 2.61 శాతం నష్టపోయాయి. ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు దేశీయ ఐటీ రంగానికి అమెరికా కీలక మార్కెట్. 150 బిలియన్ డాలర్ల ఐటీ ఎగుమతుల్లో సింహ భాగం అమెరికాకు వెళ్లేవే. ఆ తర్వాత యూరోప్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. మరో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఆదాయాలు తక్కువగా ఉండవచ్చంటూ ఇటీవలే వెల్లడించింది. కరెన్సీ మారకాల్లో మార్పులు, ప్రాజెక్టుల రద్దు, భిన్న విభాగాలకు చెందిన పెద్ద క్లయింట్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాలను పేర్కొంది. వీటిని 2016-17 ఏడాదిలో దేశీ ఐటీకి గడ్డు పరిస్థితులుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్టుల్లో మందగమనం నెలకొందని ఇన్ఫీ, విప్రోలు క్యూ1 ఫలితాల సందర్భంగా పేర్కొనడం తెలిసిందే. -
భద్రత లేని బ్యాంకులను మూసివేయిస్తాం..
సిటీబ్యూరో: ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పిస్తామంటూ వ్యాపారం చేసే బ్యాంక్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం భద్రత నియమాలను బ్యాంక్‌లు, ఏటీఎంలు తూ.చ తప్పకుండా పాటించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. మార్చి ఒకటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులను మూసి వేస్తామని హెచ్చరించారు. ఘట్కేసర్లోని ఆంధ్రా బ్యాంక్‌లో దోపిడీ జరిగిన తీరు, అక్కడ భద్రత పరంగా సరైన చర్యలు తీసుకోలేదని నిర్ధారణైన నేపథ్యంలో వివిధ బ్యాంకులకు చెందిన 215 మంది ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఆనంద్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ...బ్యాంక్, ఏటీఎం కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటిని ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని, ఇలా చేయడం వల్ల ఏదైనా చోరీలు జరిగినప్పుడు సీసీటీవీలను ధ్వంసం చేసినా ఆ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. ఇది నిందితులను సులభంగా పట్టుకోవడానికి ఉపయోగపడటంతో పాటు ఖాతాదారుల సొమ్మును త్వరగా రికవరీ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రకటనలే కాదు...భద్రత కల్పించాలి రెండు షిఫ్ట్‌ల్లో సెక్యూరిటీ గార్డులు ఉండేలా చూసుకోవాలని, సంస్థ తరఫున దరఖాస్తు చేసుకుంటే వీరికి ఆర్మ్డ్ గన్ లెసైన్స్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ ఆనంద్ తెలిపా రు. భద్రత విషయంలో ఆర్బీఐతో పాటు బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాలను మీరే అతిక్రమిస్తే ఎలా అని నిలదీశారు. బ్యాంకుల భద్రతపై నిర్లక్ష్యం చేస్తే ప్రజాభద్రత చట్టంతో పాటు సిటీ పోలీసు యాక్ట్ కింద బాధ్యులైన బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ...బ్యాంక్ మేనేజర్ల గదిలో సీసీటీవీని పర్యవేక్షించే సిస్టమ్ ఉండటం వల్ల లాభం లేదన్నారు. పని ఒత్తిడి తక్కువగా ఉండే ఇతర సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బ్యాంక్‌కు వచ్చే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించి, చోరీలు నివారించే అవకాశముంటుందన్నారు. తస్మాత్ జాగ్రత్త..! ఉత్తర భారతదేశంలో బ్యాంక్ దోపిడీలు, ఏటీఎంలలో చోరీలు పెరిగాయని క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ అన్నారు. ఘట్కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ ఘటనను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఆయా ముఠాలు రెచ్చిపోయే అవకాశం కనబడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీఐ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్. సుబ్బయ్య మాట్లాడుతూ..అన్ని బ్యాంక్‌లు, ఏటీఎంలు భద్రతా నియమాలు పాటించాలని, లేకపోతే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, కార్తీకేయ, తఫ్సీర్ ఇక్బల్, రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అడుగడుగునా నిర్లక్ష్యమే... సిటీబ్యూరో: ఘట్కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో అధికారుల నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, మాగ్నటిక్ లాక్స్, స్ట్రాంగ్ రూమ్ సౌకర్యం లేకపోవడం, అలారమ్ సిస్టమ్ వర్కింగ్ మోడ్‌లో లేకపోవడం, బ్యాంక్లోపల, బయటా సీసీటీవీలు కూడా లేకపోవడం బ్యాంక్ భద్రతనే ప్రశ్నిస్తున్నాయి. పోలీసు విచారణలో తేలిన ఈ నిజాలు ఖాతాదారులను మోసం చేసేలా ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 41 సీఆర్పీసీ ప్రకారం బ్యాంక్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...గురువారం వారు ఇచ్చే సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు విచారణలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో చార్జిషీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. తెలిసిన వారి స్కెచ్చే? అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని మల్కాజిగిరి ఏసీపీ రవిచ్రందన్ రెడ్డి తెలిపారు. ‘ఆ కార్యాలయంలో సెన్సార్ ఆఫ్ చేసి ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. తెలిసిన వారే ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉండొచ్చు. ఆ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంకు శని, ఆదివారాల్లో కూడా పోలీసులు తనిఖీలకు వెళ్లారు. వెనుకాల నుంచి బ్యాంక్‌లో ప్రవేశించేందుకు టాయిలెట్ వెంటిలేటర్ ఉంటుందని ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు. వెంటిలేటర్‌కు ఉన్న ఇనుపరాడ్లతో చేసిన గ్రిల్స్ కూడా సాధారణమైనవే. బాత్రూమ్ తలుపులు కూడా ప్లాస్టిక్‌తో చేసినవే. ఇవన్నీ చూస్తుంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతోంద’ని ఆయన చెప్పారు. భద్రత పాటించలేదనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు రివార్డు పాయింట్లు
ముంబై: వివిధ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ విషయంలో ఖాతాదారులకు ప్రోత్సాహక పాయింట్లు ఇవ్వనున్నట్లు ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ ప్రోగ్రాం కింద ... డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మాధ్యమాలతో లావాదేవీలు నిర్వహించే వారికి రివార్డ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించేవారికి, డీమ్యాట్ పెయిడ్ అకౌంట్లు, ఆన్లైన్లో సేవింగ్స్ ఖాతాలు తెరిచే వారికి కూడా పాయింట్లు ఉంటాయని వివరించారు. 100 రివార్డు పాయింట్లు.. రూ. 25కి సమానమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పేరిట మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు. -
బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు
ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కల్పిస్తోంది. ఇందుకోసం ‘మై ఐటీ రిటర్న్ డాట్ కామ్’ అనే సంస్థతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేకుండా ఉద్యోగులు, ఖాతాదారులు ఈ వెబ్సైట్ ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బీవోఐ జీఎం ఎస్ఆర్ మీనా తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ట్యాక్స్ కాలిక్యులేషన్, ట్యాక్స్ స్టేటస్, రిటర్నులు వంటి సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా కూడా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.