మా క్లయింట్లు వెనక్కు తగ్గుతున్నారు
టీసీఎస్ ప్రకటన...
• ఐదు శాతానికి పైగా నష్టపోయిన షేరు
• ఇతర ఐటీ కౌంటర్లలోనూ అమ్మకాలు
న్యూఢిల్లీ: అమెరికాలో ఆర్థిక సేవల రంగానికి చెందిన తమ క్లయింట్లు స్వేచ్ఛాయుత వ్యయం విషయంలో వెనక్కి తగ్గుతున్నారంటూ టీసీఎస్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేరును షేక్ చేసింది. బీఎస్‌ఈలో ఐదు శాతానికిపైగా నష్టపోయింది. ఐటీ రంగంలోని మిగిలిన షేర్లనూ నష్టపోయేలా చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి (బీఎఫ్‌ఎస్‌ఐ) చెందిన క్లయింట్లు అప్రమతతో వ్యవహరిస్తున్నారని... ఫలితంగా ఆదాయాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందంటూ టీసీఎస్ పేర్కొంది. ఈ ఒక్క ప్రకటనతో టీసీఎస్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఇంట్రాడేలో 6.5 శాతం వరకు కుంగిన షేరు చివరికి బీఎస్‌ఈలో 5.14 శాతం నష్టంతో రూ.2,321 వద్ద క్లోజ్ అయింది. రూ.126 రూపాయలు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 4.8 శాతం కోల్పోయి రూ.2,322.10 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.24,797 కోట్లు తరిగిపోయింది. బ్లూచిప్ కంపెనీల్లో అత్యధికంగా నష్టాల పాలయ్యింది ఈ కంపెనీ షేరే. ఇన్ఫోసిస్ 1.62 శాతం, విప్రో 1.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.70 శాతం, టెక్ మహీంద్రా 2.61 శాతం నష్టపోయాయి.
ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు
దేశీయ ఐటీ రంగానికి అమెరికా కీలక మార్కెట్. 150 బిలియన్ డాలర్ల ఐటీ ఎగుమతుల్లో సింహ భాగం అమెరికాకు వెళ్లేవే. ఆ తర్వాత యూరోప్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. మరో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఆదాయాలు తక్కువగా ఉండవచ్చంటూ ఇటీవలే వెల్లడించింది. కరెన్సీ మారకాల్లో మార్పులు, ప్రాజెక్టుల రద్దు, భిన్న విభాగాలకు చెందిన పెద్ద క్లయింట్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాలను పేర్కొంది. వీటిని 2016-17 ఏడాదిలో దేశీ ఐటీకి గడ్డు పరిస్థితులుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్టుల్లో మందగమనం నెలకొందని ఇన్ఫీ, విప్రోలు క్యూ1 ఫలితాల సందర్భంగా పేర్కొనడం తెలిసిందే.