భద్రత లేని బ్యాంకులను మూసివేయిస్తాం.. | unsafe banks closed | Sakshi
Sakshi News home page

భద్రత లేని బ్యాంకులను మూసివేయిస్తాం..

Published Thu, Feb 25 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

unsafe banks closed

సిటీబ్యూరో: ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పిస్తామంటూ వ్యాపారం చేసే బ్యాంక్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం భద్రత నియమాలను బ్యాంక్‌లు, ఏటీఎంలు తూ.చ తప్పకుండా పాటించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. మార్చి ఒకటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులను మూసి వేస్తామని హెచ్చరించారు.  ఘట్‌కేసర్‌లోని ఆంధ్రా బ్యాంక్‌లో దోపిడీ జరిగిన తీరు, అక్కడ భద్రత పరంగా సరైన చర్యలు తీసుకోలేదని నిర్ధారణైన నేపథ్యంలో వివిధ బ్యాంకులకు చెందిన 215 మంది ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఆనంద్ బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ...బ్యాంక్, ఏటీఎం కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటిని ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని, ఇలా చేయడం వల్ల ఏదైనా చోరీలు జరిగినప్పుడు సీసీటీవీలను ధ్వంసం చేసినా ఆ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. ఇది నిందితులను సులభంగా పట్టుకోవడానికి ఉపయోగపడటంతో పాటు ఖాతాదారుల సొమ్మును త్వరగా రికవరీ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
 
ప్రకటనలే కాదు...భద్రత కల్పించాలి
రెండు షిఫ్ట్‌ల్లో సెక్యూరిటీ గార్డులు ఉండేలా చూసుకోవాలని, సంస్థ తరఫున దరఖాస్తు చేసుకుంటే వీరికి ఆర్మ్‌డ్ గన్ లెసైన్స్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ ఆనంద్ తెలిపా రు. భద్రత విషయంలో ఆర్‌బీఐతో పాటు బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాలను మీరే అతిక్రమిస్తే ఎలా అని నిలదీశారు. బ్యాంకుల భద్రతపై నిర్లక్ష్యం చేస్తే ప్రజాభద్రత చట్టంతో పాటు సిటీ పోలీసు యాక్ట్ కింద బాధ్యులైన బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ...బ్యాంక్ మేనేజర్‌ల గదిలో సీసీటీవీని పర్యవేక్షించే సిస్టమ్ ఉండటం వల్ల లాభం లేదన్నారు. పని ఒత్తిడి తక్కువగా ఉండే ఇతర సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బ్యాంక్‌కు వచ్చే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించి, చోరీలు నివారించే అవకాశముంటుందన్నారు.
 
తస్మాత్ జాగ్రత్త..!
ఉత్తర భారతదేశంలో బ్యాంక్ దోపిడీలు, ఏటీఎంలలో చోరీలు పెరిగాయని క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్ అన్నారు. ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ ఘటనను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఆయా ముఠాలు రెచ్చిపోయే అవకాశం కనబడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్. సుబ్బయ్య మాట్లాడుతూ..అన్ని బ్యాంక్‌లు, ఏటీఎంలు భద్రతా నియమాలు పాటించాలని, లేకపోతే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, కార్తీకేయ, తఫ్సీర్ ఇక్బల్, రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
 
అడుగడుగునా నిర్లక్ష్యమే...
సిటీబ్యూరో:  ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసులో అధికారుల నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, మాగ్నటిక్ లాక్స్, స్ట్రాంగ్ రూమ్ సౌకర్యం లేకపోవడం, అలారమ్ సిస్టమ్ వర్కింగ్ మోడ్‌లో లేకపోవడం, బ్యాంక్‌లోపల, బయటా సీసీటీవీలు కూడా లేకపోవడం బ్యాంక్ భద్రతనే ప్రశ్నిస్తున్నాయి. పోలీసు విచారణలో తేలిన ఈ నిజాలు ఖాతాదారులను మోసం చేసేలా ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 41 సీఆర్‌పీసీ ప్రకారం బ్యాంక్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...గురువారం వారు ఇచ్చే సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు విచారణలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో చార్జిషీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

తెలిసిన వారి స్కెచ్చే?
అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని మల్కాజిగిరి ఏసీపీ రవిచ్రందన్ రెడ్డి తెలిపారు. ‘ఆ కార్యాలయంలో సెన్సార్ ఆఫ్ చేసి ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. తెలిసిన వారే ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉండొచ్చు. ఆ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంకు శని, ఆదివారాల్లో కూడా పోలీసులు తనిఖీలకు వెళ్లారు.  వెనుకాల నుంచి బ్యాంక్‌లో ప్రవేశించేందుకు టాయిలెట్ వెంటిలేటర్ ఉంటుందని ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు. వెంటిలేటర్‌కు ఉన్న ఇనుపరాడ్లతో చేసిన గ్రిల్స్ కూడా సాధారణమైనవే. బాత్‌రూమ్ తలుపులు కూడా ప్లాస్టిక్‌తో చేసినవే. ఇవన్నీ చూస్తుంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతోంద’ని ఆయన చెప్పారు. భద్రత పాటించలేదనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement