ఆ రైల్వే క్వార్టర్స్‌ శిథిలావస్థలో.. | Lallaguda Railway Quarters Dilapidation In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ రైల్వే క్వార్టర్స్‌ శిథిలావస్థలో..

Published Sat, Nov 23 2019 8:30 AM | Last Updated on Sat, Nov 23 2019 8:43 AM

Lallaguda Railway Quarters Dilapidation In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే అభివృద్ధిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నిజాం రాజులు ‘నిజాం గ్యారెంటీడ్‌ రైల్వేస్‌’లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక నివాస సముదాయాలను ఏర్పాటు చేశారు. రైల్వే పరిపాలన భవనాలు, వర్క్‌షాపులు, స్టేషన్‌లు, నివాసాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాలు కేటాయించారు. లాలాగూడలోని రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు కూడా ఇలా నిర్మించినవే. కానీ అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలామంది ఉద్యోగులు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎలాంటి ఆలనాపాలనా లేకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మందుబాబులకు నిలయాలయ్యాయి. పేకాట రాయుళ్ల నివాసాలయ్యాయి. చీకటైతే చాలు ఆ మార్గంలో  వెళ్లడం కష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ శిథిల భవనాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం  ఆర్‌పీఎఫ్‌ పోలీసులను ఏర్పాటు చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతో లాలాగూడ భూముల పరిరక్షణ  దక్షిణమధ్య రైల్వేకు సవాల్‌గా మారింది. ఒకవైపు రైల్వే స్థలాల అభివృద్ధి కోసం ప్రత్యేక సంస్థ ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు రూ.వందల కోట్ల విలువైన ఈ స్థలాల అభివృద్ధి, పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 

పెండింగ్‌లో ప్రతిపాదనలు...
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మరిన్ని స్టేషన్లను విస్తరించాలని, సదుపాయాలను మెరుగుపర్చాలని గతంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారు. నగరంలోనే అందుబాటులో ఉన్న స్థలాలపై అప్పట్లో అధికారులు దృష్టిసారించారు. నార్త్‌ లాలాగూడ స్టేషన్‌కు ఆనుకొని ఉండే విధంగా ఇక్కడ రైల్వే సదుపాయాలను అభివృద్ధి చేయొచ్చని... దీంతో పడమటి వైపు లింగంపల్లి స్టేషన్‌ తరహాలో తూర్పు వైపు లాలాగూడ వినియోగంలోకి వస్తుందని భావించారు. కానీ అది ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతమున్న లాలాగూడ కొత్త బ్రిడ్జి నుంచి లాలాపేట్, మిర్జాలగూడ వరకు దక్షిణమధ్య రైల్వేకు సుమారు 50ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇక్కడ నిజాం నవాబుల కాలంలో రైల్వే ఉద్యోగుల కోసం కట్టించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ నివాసమున్న కుటుంబాలను గతంలోనే  మౌలాలీలోని క్వార్టర్లకు తరలించారు. కొన్ని కుటుంబాలు ఇంకా ఇక్కడే ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని కూడా ఇతర క్వార్టర్లలోకి తరలించి స్థలాలను వినియోగంలోకి తేవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ దానికి తగిన ఆచరణ, చిత్తశుద్ధి లేకపోవడం, పైగా ఏ విధంగా ఆ భూమిని వినియోగంలోకి తేవాలనే అంశంలోనూ స్పష్టత  లేకపోవడంతో ఆ ప్రతిపాదన పెండింగ్‌ జాబితాలో చేరింది.

కమర్షియల్‌గానూ అవకాశం.. 
ఒకవేళ తూర్పు వైపున చర్లపల్లి స్టేషన్‌ విస్తరణకు భూమి లభిస్తే లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌ స్థలాల్లో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. లేదా మౌలాలీలోని రైల్వే స్థలంలో ప్రతిపాదించినట్లుగా బిల్డర్లకు లీజుకు ఇవ్వడం ద్వారా బహుళ అంతస్తుళ నివాస సముదాయాలను ఏర్పాటు చేయొచ్చు. ప్రస్తుతం మెట్టుగూడలోని రైల్‌ కళారంగ్‌ ప్రాంతంలోని 2.36 ఎకరాల మిలీనియం పార్కు స్థలాన్ని 99 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించారు. రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. ఇదే తరహాలో లాలాగూడ స్థలాల వినియోగంపై దృష్టిసారించొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement