తెలంగాణ నలుదిక్కుల నుంచి వచ్చే పేద రోగుల పాలిట అది పెద్దాస్పత్రి... పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా బయటకు వెళతామనే ఓ నమ్మకం.. వైద్యంలో ఎన్నో ప్రయోగాలకు ఇదో వేదిక...అదే ఉస్మానియా ఆస్పత్రి. కానీ ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి భవనాలను చూస్తే...శిథిల చిత్రాలేకనిపిస్తున్నాయి. పెచ్చులూడిన పై కప్పులు, కూలిపోయిన గోడలు, ఎక్కడపడితే అక్కడ పగుళ్లు...చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్న వైనం..వైద్యం సంగతిమాటేమిటోగానీ...ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం నీడన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోగులు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బంది అనేకఇబ్బందులు పడుతున్నారు. అయితే పదేళ్ల క్రితం నుంచే ఉస్మానియా ఆస్పత్రి భవనాల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంకాగా, హెరిటేజ్‌కట్టడాలను కాపాడాలని కొన్ని సంస్థలు, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలోఒక్క అడుగూ ముందుకు పడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసినా, మరో పాతికేళ్లు అందుబాటులో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పటి ప్రాణదాత..లక్షలాది రోగుల ఆరోగ్య ప్రదాయిని, అక్కడికి వెళితే చాలు ప్రాణాలతో బయటపడవచ్చు అనే భరోసా..ఎన్నో ప్రయోగాలకు...మరెన్నో అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఒక వైపు గోడల పగుళ్లు.. మరో వైపు కుప్పకూలుతున్న పెచ్చులు...ఇంకో వైపు ముంచెత్తుతున్న మురుగు నీరు వెరసి..కనీస వైద్యాన్ని అందించలేని దుస్థితి. ఆస్పత్రికి వెళ్లితే రోగాలు తగ్గుతాయో లేదో కానీ..కొత్త రోగాలు ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. కనీస భద్రత లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతుండగా...పడకల మధ్యలో మోకాల లోతులో నిల్వ ఉన్న మురుగు నీటి మధ్య ఉండలేమని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పటి గోల్సావాడీ బస్తీ..ఇప్పుడు ఆస్పత్రి
గోల్సావాడి..వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యపద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటీష్ వైద్య చికిత్సలు చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయింది. 1866 నాటికి అది అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఈ వైద్యసేవలు అప్పటి నుంచి సామాన్యులకు కూడా చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరోనిజాం మీర్‌మహబూబ్ ఆలీఖాన్ పాలనా కాలంలో చోటు చేసుకున్న మహా విషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పగ్గాలు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి స్పూర్తిని బతికించాలని భావించిన ఆయన..సుమారు 27 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రస్తుతం ఉన్న ఈ భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది.
ఇండో పర్షియన్ శైలి..రూ.50 వేల ఖర్చు
1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లగ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేశారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించికట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తైన విశాలమైన డోమ్‌లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగాలను ప్రతిబింబించే ఆకతులను చిత్రీకరించారు. చార్మినార్‌లోని మినార్‌లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దష్టితోనే కాకుండా భవనంలోని గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది.
తొలి క్లోరోఫామ్ చికిత్స ఇక్కడే
ఆస్పత్రి అనేక అద్భుతాలు ఆవిష్కరణలకు వేదికైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతత్వంలోని వైద్యబందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ ఆరస్తు అఫ్జల్‌గంజ్ ఆసుపత్రిలో తొలి చికిత్స చేశారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీతభత్యాలు, పెన్షన్ మొత్తాన్ని ఆస్పత్రికే ఖర్చు చేశారు. తర్వాత డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు.
ప్రతిపాదించి పదేళ్లు దాటింది.. ఇప్పటికీ పునాది రాయి పడలే
చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారం లోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడంతస్తుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్తులకు కుదించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయికూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వంద రోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే ఒకటి, రెండో అంతస్తులను ఖాళీ చేశారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే చికిత్సలు అందిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షానికి మురుగు నీరు వార్డుల్లోకి చేరింది. ఒక వైపు ఊడిపడుతున్న పైకప్పు పెచ్చు లు...మరో వైపు వార్డుల్లో నిలిచిన మోకాలి లోతు మురుగు నీటి దుర్వాసన మధ్య రోగులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.
ఇదీ పాత భవనం దుస్థితి
ప్రస్తుతం ఉస్మానియా పాత భవనంలో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలు కొనసాగుతున్నాయి. 670 పడకల సామర్థ్యం..నాలుగు ఆపరేషన్ థియేటర్లు, 20 వార్డులు ఉండే ఈ భవనంలో పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేసి, కొన్ని పడకలను క్యాజువాలిటీ బ్లాక్‌కు, మరికొన్ని కులికుతుబ్‌షా బిల్డింగ్‌లోకి తరలించారు. మరో 350 పడకలను పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ సహా ఫస్ట్ ఫ్లోర్‌లలో సర్దుబాటు చేశారు. చారిత్రక ఈ భవనం నిర్వహణ లోపం వల్ల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ సహా గోడలపై చెట్లు మొలకెత్తడంతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు స్లాబ్ నుంచి వాటర్ లీకవుతోంది. దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించక పోవడం, గోడలకు ఏర్పడిన పగుళ్లను అలాగే వదిలేయడం వల్ల వర్షానికి పూర్తిగా తడిసి కూలేందుకు సిద్ధంగా ఉంది. భవనం పునరుద్ధరణ పనులను వదిలేసి..ఇటీవల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఈ రోడ్లు ఎత్తుగా ఉన్నాయి. దీనికి తోడు బేగంబజార్ నుంచి వచ్చే మురుగునీటి వ్య వస్థ ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం నుంచి మూసిలో కలుస్తుంటుంది. అయితే ఈ డ్రైనేజీ లైన్లు ఇటీవల మట్టితో పూడిపోవడం, వాటిని గుర్తించి క్లీన్ చేయక పోవడంతో బయటి నుంచి వచ్చిన వరద డోమ్‌గేటు వెనుక భాగంలోని ఆస్పత్రి ఆవరణలో పొంగిపొర్లి పాతభవనంలోని ఎంఎం2, ఎంఎం3 సహా సూపరింటిండెంట్ ఆఫీసు తదితర వార్డులకు చేరుతుంది. ఒక్కోవార్డులో వంద మంది వరకు చికిత్స పొందుతుంటారు. హటాత్తుగా ఆయా వార్డులను వరద నీరు ముంచెత్తడం తో రోగులను ఫస్ట్ ఫ్లోర్‌కు తరలించాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కిందే నీళ్లలో గడపాల్సి వచ్చింది.
పేగు బంధం ఉందన్న వాళ్లే నాశనం చేస్తున్నారు
ఇప్పటి వరకు హైదరాబాద్‌తో పేగు బంధం లేనివారే ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు కారణమైనట్లు చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం ఈ నగరంతో అనుబంధం ఉన్నట్లు చెప్పు కుంటున్న వారే పరోక్షంగా ఆస్పత్రిని ఉస్మాన్‌సాగర్‌ను తలపింపజేశారు. వందేళ్లలో ఎప్పుడు రానీ డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది? ప్రభుత్వ నిర్వహణ లోపమే ఇందుకు కారణం. రోగులను బతి కుండగానే తోడేళ్లకు, రాబంధులకు అప్ప జెప్పుతుంది. కొత్త భవనాల పేరుతో చారిత్రక భవనాలను కూల్చి వేస్తుంది. తెలంగాణ సంపదను కాంట్రాక్టర్లకు కట్టబెడుతోంది.
– పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు
ఆ సూచనలు పట్టించుకోలేదు
పురావస్తు కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ఉస్మానియా పాత భవనం నాణ్యతను పరిశీలించేందుకు 2014లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్(ఇంటాక్) బందం సందర్శించింది. నిర్వహణ లోపం వల్లే భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు ప్రకటించింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రి ప్రాంగణంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలోనే పాతభవనం విస్తరించి ఉంది. రోగుల అవసరాల దష్ట్యా కొత్త భవనం కట్టాలని ప్రభుత్వం భావిస్తే...ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కట్టొచ్చని సూచించింది. లేదంటే పాతభవనానికి మరమ్మతులు నిర్వహిస్తే మరో పాతికేళ్ల వరకు భవనాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చని సూచించింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆఘాఖాన్ ట్రస్ట్‌తో మరమ్మతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేశారు.
– అనురాధారెడ్డి, కో కన్వీనర్, ఇంటాక్ తెలంగాణ
కొత్తది కట్టాల్సిందే
ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలాస్థకు చేరింది. తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. ఇలాంటి భవనంలో చికిత్సలు అందించలేమని పేర్కొంటూ ఉస్మానియా ఆస్పత్రి వైద్య సిబ్బంది వంద రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికే ఫస్ట్ సహా సెకండ్ ఫ్లోర్‌లను ఖాళీ చేశాం. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రోగులకు చికిత్స అందిస్తున్నాం. వార్డుల్లోకి మోకాల్లోతు మురుగునీరు చేరింది. పడకలపై ఉన్న రోగుల వద్దకు వైద్యులు వెళ్లలేని దుస్థితి. ఈ భవనాన్ని వెంటనే కూల్చివేయాలి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనం కట్టాలి.
– డాక్టర్ బొంగు రమేష్, చైర్మన్, తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ
తాజా కామెంట్లు
♦ ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలి.
♦ వందేళ్లలో ఎప్పుడూ రాని డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది ?
♦ రోగులు బతికుండగానే తోడేళ్లు, రాబందులకు అప్పజెప్పినట్టుంది..!
♦ ఉన్న భవనాలను ఖాళీ చేసి కొత్త బిల్డింగులు కట్టాల్సిందే.
♦ పాత భవనాలకు మరమ్మతులు చేస్తే.. మరో పాతికేళ్ల వరకు భవనాన్నిచెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment