ఎస్.రాజమహేంద్రారెడ్డి
మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్‌లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి.
2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం...
మాంద్యం... ముంచుకొస్తోంది!
రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది.
అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది!
యుద్ధం... వెన్ను విరుస్తోంది!
నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది.
ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్‌లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది.
క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్‌స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్‌స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు.
దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది.
కరోనా... వణికిస్తోంది!
గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్‌లో చైనా మళ్లీ కొత్త వేరియంట్‌తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్‌కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment