COVID-19: Xbb. 1. 5 Omicron Variant Accounts for Nearly Half of Us COVID Cases - Sakshi
Sakshi News home page

అమెరికాలో ఒమిక్రాన్‌ కొత్త సబ్‌ వేరియెంట్‌!! మనమెందుకు పట్టించుకోవాలంటే?

Published Sun, Jan 22 2023 6:21 AM | Last Updated on Sun, Jan 22 2023 10:36 AM

COVID-19: XBB.1. 5 Omicron variant accounts for nearly half of US Covid cases - Sakshi

చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ వస్తూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆల్ఫా, డెల్టా అంటూ తీవ్రమైన వేరియెంట్ల రూపంలో అనేక మంది ఉసురు తీశాయి. మూడో వేవ్‌గా వచ్చిన ఒమిక్రాన్‌ తీవ్రత అంతగా లేదుగానీ ఇంతలోనే ఒమిక్రాన్‌ తాలూకు మరో సబ్‌–వేరియెంట్‌ అయిన ఎక్స్‌బీబీ 1.5 వచ్చి  అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లోని ఇంటికొకరు చొప్పున  అమెరికాలో నివాసముంటూ... రోజూ కొన్ని లక్షల మంది యూఎస్‌ నుంచి ఇండియాకీ, ఇక్కణ్ణుంచి మళ్లీ యూఎస్‌కు వెళ్తూ వస్తూ, పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న  నేపథ్యంలో మన దగ్గర ఈ సబ్‌ వేరియెంట్‌ ప్రమేయం (రెలవెన్స్‌) ఏమిటీ, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

ప్రతి జీవీ తన మనుగడ కోసం కొత్త మ్యూటేషన్స్‌తో ముందుకంటే మరింత సమర్థమైన జీవిగా పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఒమిక్రాన్‌ సబ్‌–వేరియెంట్‌ కూడా జన్యుపరమైన మార్పులను చేసుకుంటూ 500 కంటే ఎక్కువ రూపాలను సంతరించుకుంది. ఈ ఎక్స్‌బీబీ 1.5 కూడా ఇలాంటి ఓ కొత్త సబ్‌–వేరియెంటే!

ఎక్స్‌బీబీ 1.5 అనే ఈ తాజా సబ్‌–వేరియెంట్‌... రెండు రకాల వేరియంట్స్‌ కలిసినందువల్ల, మరో కొత్త వేరియంట్‌ గా మారింది. అంటే... బీజే–1 (బీఏ.2.10.1.1) అనే ఒక వేరియంటూ, అలాగే బీఏ.2.75 (బీఏ.2.75.3.1.1.1) మరో వేరియెంట్ల కలయిక వల్ల ‘ఎక్స్‌బీబీ’ అనే ఈ సబ్‌–వేరియంట్‌ పుట్టుకొచ్చింది. అది మరొక మ్యుటేషన్‌కి గురికావడంతో తాజాగా తన ప్రభావం చూపిస్తున్న ఈ ‘ఎక్స్‌బీబీ – 1.5’ తయారయింది. ఈ సబ్‌–వేరియెంట్‌ పుట్టుకకు కారణమైన మ్యుటేషన్‌ని ‘ఎఫ్‌486పీ’ అని పిలుస్తున్నారు.

దీనికి ఓ ముద్దుపేరూ ఉంది...
ఎక్స్‌బీబీ 1.5కి ఓ ముద్దు పేరూ ఉంది. ‘క్రాకాన్‌’ అన్నది దీని పెట్‌నేమ్‌. అంటే ‘సముద్ర భూతం’ అని అర్థం. అయితే... ఈ నిక్‌–నేమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇవ్వలేదు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనికా పేరు పెట్టారు. ఇందుకో కారణం కూడా ఉంది. అదేమిటంటే... ఒమిక్రాన్‌కు ఉన్న అనేక వేరియంట్ల కంటే కూడా... ఈ ‘ఎక్స్‌బీబీ–1.5’ అన్నది మానవ వ్యాధినిరోధక వ్యవస్థను (ఇమ్యూనిటీని)  తప్పించుకోవడంలో దిట్ట అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఎక్స్‌బీబీ 1.5’ సబ్‌–వేరియెంట్‌... మునుపటి వేరియంట్ల కంటే మరింత తేలిగ్గా, మరింత బలంగా ‘ఏసీఈ2 రిసెప్టార్‌’లతో అనుసంధానితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే వారు ఈ సబ్‌–వేరియంట్‌కు ‘క్రాకన్‌’ అనే నిక్‌–నేమ్‌ ఇచ్చారు.

మనదేశంలో ఎక్స్‌బిబి 1.5 వ్యాప్తికి అవకాశమెంత?
ఇప్పుడు ప్రపంచంలోని ఓ మూల నుంచి మరో మూల వరకు రాకపోకలు మామూలైపోయాయి. ప్రపంచమో పల్లెటూరుగా మారినందుకే ఇప్పుడు భూగోళాన్ని ‘గ్లోబల్‌ విలేజ్‌’ అంటూ అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల  ఈ కొత్త వేరియంట్‌ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలకూ, ఆ మాటకొస్తే మన దేశానికి సైతం పాకే అవకాశం ఖచ్చితంగా ఉంది.

అయితే ఒకసారి భారత్‌కు వచ్చాక మన దేశవాసులు ఈ ఎక్స్‌బిబి 1.5 తో ఎలాంటి ఇబ్బందులకు లోనవుతారనే విషయాన్ని అంచనా వేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఒమిక్రాన్‌ కారణంగా మన దేశవాసుల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా వచ్చింది. అందువల్ల వేగంగా విస్తరించినప్పటికీ ఈ ‘ఎక్స్‌ బి బి 1.5’ మన దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు. అందుకే  ఈ వేరియంట్‌ వల్ల మనదేశవాసులంతా భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ వ్యాధినిరోధక శక్తి కాస్తంత తక్కువగా ఉన్నవారు, ఇతరత్రా వ్యాధులతో ఇప్పటికీ బాధడుతున్నవారు మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
   
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?
అమెరికాలోని వ్యాధుల నిపుణురాలు (ఎపిడిమియాలజిస్టు) అయిన మేరియా వాన్‌ కెర్కోవ్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా వైరస్‌ల కన్నా ఈ ఎక్స్‌బీబీ 1.5 చాలా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు ప్రస్తుతం దీని ప్రభావం అమెరికాతో పాటు మరో 29 దేశాలలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘అందువల్ల అమెరికా మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజలతో పాటు అమెరికా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల ప్రజలూ, విమాన ప్రయాణీకులందరూ  మునపటిలాగే మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు చేపట్టడం అవసరం’’ అంటూ ఆమె (మేరియా) పేర్కొన్నారు. ఇక గతంలో వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సైతం  బూస్టరు డోసులు తీసుకోవాలంటూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచిస్తోంది.

నిర్ధారణ పరీక్షలు
గతంలో మాదిరిగానే ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో గాని రాపిడ్‌ టెస్టుల్లో గాని ఈ వేరియంట్‌ కూడా తక్కిన ఒమిక్రాన్‌ వేరియంట్లలా బయటపడుతుంది.

ఈ వేరియంట్‌ లక్షణాలేమిటి?  
మిగతా కరోనా వేరియెంట్లు, ఒమిక్రాన్‌ మాదిరిగానే ఎక్స్‌బిబి 1.5 కూడా...  జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు కలగజేస్తుంది. వృద్ధుల్లోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి (ఇమ్యూనో కాంప్రమైజ్‌డ్‌ పర్సన్స్‌)లోనూ, ఇప్పటికే ఇతరత్రా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న(కో–మార్బిడిటీ)వారిలో ఈ వేరియెంట్‌ కాస్తంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండవచ్చు. అంతే తప్ప మిగతా వారందరిలో ఇదో చిన్న  చిన్న వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లాగా వచ్చి తగ్గిపోయే అవకాశాలే చాలా ఎక్కువ.

మందులేమిటీ/ నివారణ ఏమిటి?   
ఈ వేరియెంట్‌కు ‘మోనోక్లోనల్‌ యాంటీ బాడీ’ ఇంజక్షన్లు పనిచేయవు. ఇప్పటికే భారతదేశంలో అనుమతి పొందిన ‘పాక్స్‌ లోవిడ్‌’ ట్యాబ్లెట్లు ఈ సబ్‌–వేరియంట్‌కి కాస్తంత సమర్థంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బై వాలెంట్‌ కరోనా వ్యాక్సిన్లు దీని నుంచి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గతంలో మాదిరిగానే మాస్కులు ధరించడం, సబ్బుతోగానీ, శ్యానిటైజర్లతోగానీ చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఇంటినీ, పరిసరాలను డిస్‌–ఇన్ఫెక్టెంట్లతో తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాల్లోకి, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వేళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలను  పాటిస్తే చాలు.

డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement