టైం.. మన జీవితంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చూసుకోవడానికే కాదు.. ఏది మాట్లాడినా.. దీన్ని ప్రస్తావించకుండా ఉండలేము కూడా.. అందుకే.. వాడి టైం మొదలైందిరా.. అన్నా.. వీడి టైం బ్యాడ్ నడుస్తోంది రా అన్నా.. ఏదైనా టైం కలసి రావాలి అన్నా.. ప్రతి విషయంలోనూ దానికున్న ప్రాధాన్యతే వేరు.. మరి అలాంటి ‘టైం’ను ఎప్పుడు సెట్ చేశారు? నిజానికి భూమి తిరుగుతున్న కొద్దీ ఒక్కో ప్రాంతంలో సూర్యోదయం అవుతూ వస్తుంది. అలా దేశాలు దాటుతున్న కొద్దీ.. కొన్నిచోట్ల అప్పుడే తెల్లవారుతుంటే, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం, ఇంకొన్ని చోట్ల సాయంత్రం, రాత్రి అవుతుంటాయి. అంటే ఒక్కో చోట ఒక్కో టైం.. తొలినాళ్లలో ఇదంతా పెద్ద గందరగోళంగా ఉండేది.. సరిగ్గా చెప్పాలంటే.. 118 ఏళ్ల కింద ఈ ‘టైం జోన్ల’ను నిర్ధారించి, ఇబ్బందులను సెట్ చేశారు. అందుకే ఆ స్టోరీతోపాటు మరికొన్ని డిఫరెంటు సంగతులనూ తెలుసుకుందామా..
మొదట్లో ఎక్కడి టైం అక్కడే
మొదట్లో ప్రపంచవ్యాప్తంగా సమయం విషయంగా తీవ్ర గందరగోళం ఉండేది. ఎక్కడికక్కడ స్థానికంగానే.. పగలు సూర్యోదయం, అస్తమయం, సూర్యుడి నీడ కదలికలతో.. రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాల ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. అప్పట్లో వేగవంతమైన రవాణా లేదు. ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఎక్కువసేపు పట్టడంతో.. సమయాల్లో తేడా తెలిసేది కాదు. వేగవంతమైన రవాణా వచ్చాక సమయం విషయంగా ఇబ్బందులు పెరిగిపోయాయి.
కెనడా ఇంజనీర్ ఆలోచనతో..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ వేర్వేరు సమయాల సమస్యను తొలగించేందుకు కెనడాకు చెందిన ఇంజనీర్ సర్ శాండ్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ ఓ ప్రతిపాదన చేశాడు. భూమి అంతటినీ గంటకో టైం జోన్ వచ్చేలా.. 24 టైం జోన్లుగా విభజించాలని సూచించాడు. ప్రతి 15 డిగ్రీల రేఖాంశం వద్ద ఒక టైం జోన్ పెడితే సరిపోతుందన్నాడు.
►శాండ్‌ఫోర్డ్ సూచనతో 1884లో ఇంగ్లండ్‌లోని గ్రీన్‌విచ్ ఆధారం గా (జీరో డిగ్రీగా) తీసుకుని 24 టైం జోన్లను నిర్ధారించారు. దీనిని గ్రీన్‌విచ్ మీన్ టైం (జీఎంటీ)గా పేర్కొంటారు. తర్వాత 1967లో మరింత స్పష్టంగా, కచ్చితమైన అణు గడియారాలతో కూడిన ‘ది కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం (యూటీసీ)’ మొదలైంది. టైం జోన్లన్నింటినీ.. యూటీసీ ప్లస్, మైనస్ (బేస్ టైంజోన్‌కు ముందు, వెనుక ఉన్న ప్రాంతాలు)గా లింక్ చేసి చెప్తారు.
మన టైం ఎప్పుడొచ్చింది?
వైశాల్యం పరంగా ప్రపంచంలోనే ఏడో పెద్ద దేశం ఇండియా. బ్రిటిష్ వారి హయాంలో బాంబే, కలకత్తా, మద్రాస్.. మూడు టైంజోన్లు పాటించేవారు. అయితే 1906లో దేశంలో ఎక్కువ ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేలా ఒకే ‘ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్‌టీ)’ని అమల్లోకి తెచ్చారు. మన సమయం ‘యూటీసీ+ 5.30’ గంటలుగా ఉంటుంది.
►మన దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ముందే సూర్యోదయం అవు తుంది. అందువల్ల అస్సాం టీ తోటల్లో పనుల కోసం సమయాన్ని గంట ముందు కు జరిపి.. ‘టీ గార్డెన్ టైం’గా పాటిస్తుంటారు.
►ఇండియా టైంజోన్‌లోనే శ్రీలంక మన సమ యాన్నే పాటిస్తుంది. నేపాల్ తమకో ప్రత్యేకత ఉండా లంటూ.. 15 నిమిషాలు ముందుండే ‘యూటీసీ+5.45’ టైంజోన్‌ను వాడుతోంది.
చైనాలో టైం గోల!
ప్రపంచంలో వైశాల్యంలో నాలుగో పెద్ద దేశం చైనా ‘బీజింగ్’ పట్టణం కేంద్రంగా ఒకే టైం జోన్ పాటిస్తుంది. దీనితో ఇప్పటికీ గందరగోళమే. బీజింగ్ చైనాలో తూర్పు కొసన .. క్సింజియాంగ్ వంటి ప్రాంతాలు పడమర చివరన ఉంటాయి. ఒకే టైం పాటించడంతో బీజింగ్‌లో ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళితే.. క్సింజియాంగ్‌లో పొద్దున ఆరు గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది.
►ప్రపంచంలో అతిపెద్ద దేశం అయిన రష్యాలో అయితే తూర్పు, పడమర చివర్లలోని ప్రాంతాల మధ్య తేడా పది గంటలకుపైనే ఉంటుంది. కానీ అక్కడ వేర్వేరు టైంజోన్లు పాటిస్తుండటంతో ఇబ్బంది కాస్త తక్కువగా ఉంది.
►ఇక 1940లో అయితే స్పానిష్ నియంత ఫ్రాంకో కేవలం హిట్లర్‌కు సంఘీభావం తెలిపేందుకు తమ దేశ టైం జోన్‌ను జీఎంటీ నుంచి జర్మనీ పాటించే సెంట్రల్ యూరోపియన్ టైంకు మార్చేశారు.
గౌరవం కోసం ఒకరు.. పొదుపు కోసం మరొకరు
►ప్రపంచంలో రెండు దేశాలు ఇటీవల తమ సమయాన్ని మార్చేసుకున్నాయి. తమ సమయాన్ని అరగంట ముందుకు జరిపేసుకున్నాయి. అందులో ఒకటి ఉత్తర కొరియా, మరొకటి వెనెజువెలా.
►ఉత్తర కొరియా వాస్తవానికి ‘యూటీసీ+8.30’ టైం జోన్‌లో ఉంటుంది. వందేళ్ల కింద తమ ఆక్రమణలో ఉన్న కొరియా టైంజోన్‌ను జపాన్ ‘యూటీసీ+9.00’కు మార్చేసింది. 2015లో ఉత్తర కొరియా తమ ఆత్మగౌరవం కోసమంటూ.. సమయాన్ని అర గంట ముందుకు జరుపుకొని, పాత టైంజోన్‌కు మారింది. తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాల్లో ఏకత్వం పేరిట ‘యూటీసీ+9.00’కి మార్చారు.
►విద్యుత్ పొదుపు కోసం వెనెజువెలా తమ దేశంలో టైమ్‌ను అరగంట పెంచి ‘యూటీసీ+4.30 నుంచి యూటీసీ+4.00’ టైంజోన్‌కు మారింది. దీనివల్ల పొద్దున లేటుగా నిద్రలేస్తారని, సాయంత్రం ఆలస్యంగా ఇళ్లకు వెళ్తారని.. విద్యుత్ బల్బులు, ఉపకరణాల వినియోగం తగ్గుతుందని ఇలా చేసింది.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment