కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను ప్రతి ఒక్కరూ గుర్తించండి’’ అంటాడు చాణుక్యుడు. చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.
జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధిగా పాటించడం, లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.
ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైనలక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే , అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది.
కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.
‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్పసాధ్యమే మానవున కిలాచక్రమందు‘ అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.
ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రభాసమానంగా ఉంటుంది. ‘‘యువతీయువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్య సాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. మిమ్మల్ని వెనుకకు నెట్టే ఒకే ఒక్క గుణం సోమరితనం.
కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్దకాన్ని వదలండి.’’ అంటూ పలికిన సందేశం అత్యంత విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారి లాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది . ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏమాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలోసార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.
జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. ఇందులో ఎంతో సందేశం ఉంది. కాలం విలువ తెలుసుకుని, ప్రగతినిసాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. – వెంకట్ గరికపాటి వ్యాఖ్యాన విశారద
‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయా. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!
‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరుబాట కావడం కష్టమైన విషయమేమీ కాదు. కాలానికి గాలం వేయడం కష్టమే. కానీ, దాని విలువను తెలుసుకుని, విహితమైన ఆలోచనకు ఆలవాలం చేసి, సద్వినియోగపరచిన ప్రతివ్యక్తీ చేయగలిగేది సుగతితో, ప్రగతితో కూడిన మహేంద్రజాలమే.
Comments
Please login to add a commentAdd a comment