
కేన్సర్..కేన్సర్..కేన్సర్ ఈ మాట వింటుంటేనే గుండెలు గుభేలమంటున్నాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఈ మహమ్మారిపై చర్చిస్తున్నారు. గతంలో వందల్లో ఒకరికో..ఇద్దరికో కేన్సర్ సోకేది. ప్రస్తుతం ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, తినే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జన్యుపరమైన లోపాలు. ఇవన్నీ కేన్సర్ భూతం వికటాట్టహాసానికి దారితీస్తున్నాయి. గత మూడు దశాబ్దాలలో కేన్సర్ బాధితుల సంఖ్య 79 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వయసు మీరిన వారి వరకు అందరిని ఈ భూతం కబలిస్తోంది,
ఆ మూడు ఆసుపత్రుల్లో..
నగరంలోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, ఎంఎన్‌జే ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం సగటున ప్రతి లక్ష మందిలో 3,865 మంది కేన్సర్ బాధితులు ఉన్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణశయ, కాలేయ వంటివి దాదాపు వందుకు పైగా కేన్సర్ రకాలు ఉన్నాయి.
పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రాం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో 53,565 మందికి కేన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తునా‍్నరు. ఇందులో పురుషులు 24,857 మంది, మహిళలు 28,708 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మహిళలల్లో ముప్పు ఎక్కువ
మహిళల్లో ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. ఎన్‌సీఆర్‌పీ నివేదికల ప్రకారం ప్రతి లక్ష మంది మహిళల్లో 2,151 మంది మహిళలు కేన్సర్ బాధితలుగా ఉన్నారు. అదే సమయంలో పురుషులు 1,714 మంది వ్యాధి భారినపడుతున్నారు. బాధితుల్లో అత్యధికంగా 35.5 శాతం మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతున్నారు.
పురుషుల్లో నోటి కేన్సర్ 13.3 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ 10.9 శాతం మంది బాధపడుతున్నారు. 14 ఏళ్ల లోపు వయసు గల మిలియన్ మంది పిల్లల్లో ఏడాదికి సరాసరిన 94 మంది కేన్సర్ బారినపడుతున్నారు. ఇందులో అబ్బాయిలు 55 మంది ఉండగా, ఆడపిల్లలు 39 మంది ఉంటున్నారు.
పొగాకుతో ప్రాణ గండం..
కేన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల వ్యాధికి సోకిన వారు పురుషుల్లో 42 శాతం మంది ఉండగా అందులో నోటి కేన్సర్ 31 శాతం మంది, నాలుక 19 శాతం మంది, ఊపిరి తిత్తుల 26 శాతం ప్రధానంగా ఉన్నాయి. మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు పీల్చడం వల్ల కేన్సర్ వస్తుందని నిర్ధారించారు. ఇందులో 30 శాతం మంది ఊపిరితిత్తులు, 22 శాతం మంది నోరు, 17 శాతం మంది నాలుక కేన్సర్‌తో బాధపడుతున్నారు.
కేన్సర్ రావడానికి కారణాలు
శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. రేడియేషన్ ప్రభావం, పర్యావరణ కాలుష్యం కూడా కేన్సర్లకు దారితీస్తున్నాయి.
అందుబాటులో అత్యాధునిక చికిత్సలు..
కేన్సర్‌కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు (సీఎక్స్‌ఆర్, యూఎస్‌జీ, సీటీ, ఎమ్మారై, పీఈటి), బయాప్సీలు వంటి పరీక్షలతో కేన్సర్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చు.
పిల్లల్లో జెనిటిక్, పర్యావరణం, తినే ఆహారం, డీఎన్‌ఏ డిస్టర్బ్ కావడం వలన కేన్సర్ వస్తుంది. బ్లడ్, కిడ్నీ, లివర్, కన్ను, ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల్లో వెంట్రుక, గోరు తప్ప మిగతా అన్ని శరీర బాగాల్లోనూ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మం కందిపోవడం, మచ్చలు రావడం, జ్వరం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హెమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతులో బ్లీడింగ్ ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్ మొదటి రెండు దశల్లో ఉంటే 80 శాతం పైగా బాధితులకు నయం అవుతుంది.
--స్నేహ సాగర్, మెడికల్ అంకాలజిస్టు, జీవీకే హెల్త్ హబ్
(చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..)