
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లాలో రోజురోజుకు ఎండతీవ్రత పెరిగిపోతోంది. అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న సమయమిది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమను, తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి.. నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అసలు అగ్ని ప్రమాద శాఖ సిబ్బంది తదితర వివరాలతో ప్రత్యేక కథనం.
వేసవికాలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉన్నా కొన్ని సమయాలలో ప్రాణనష్టంతో పాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైగా ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుండడం కలవరపరిచే అంశం. అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. లీడింగ్ ఫైర్‌మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్ కమ్ ఆపరేటర్లు, సిబ్బంది కొరతతో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్నారు.
ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు గాను ఇద్దరే ఉన్నారు. ఇక స్టేషన్ ఫైర్ ఆఫీసరు రెండు స్టేషన్లలో లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్ పైర్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ కమ్ ఆపరేటర్ 31 మందికిగాను ప్రస్తుతం 26 మంది విధులు నిర్వహిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్‌మెన్ 102 మంది ఉండాల్సి ఉండగా కేవ లం 42 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నా రు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 211 మందికి గాను 142 మందే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో ఒకేసారి రెండుమూడు చోట్ల ప్రమాదాలు జరిగితే నష్టనివారణ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా 30 మంది హోంగార్డులతోనే విధులు నిర్వహిస్తున్నారు.
ముద్దనూరుకు ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లాలో 8 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాత భవనాలు కలిగి ఉన్న కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో నూతన భవనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ముద్దనూరులో ఫైర్ స్టేషను’ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభు త్వం ఆమోదం తెలిపింది.
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు..
జిల్లాలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల పరిధిల్లో 14 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. కడప ఫైర్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ఈ వారోత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది అగ్నిమాపక శాఖ వారు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ‘అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. అలాగే అవకాశం ఉన్నపుడల్లా... స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, కడప నగర శివార్లలోని ఐఓసి గ్యాస్ ప్లాంట్, కర్మాగారాలలో అగి్నమాపక అధికారులు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.
సిద్ధంగా ఉన్నాం
ఎటువంటి అగ్ని ప్రమాదాలు, విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వాహనాలకు చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ మరమ్మతులు చేయించా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డుల కు కూడా రెస్క్యూ ఆపరేషన్‌పై శిక్షణ ఇచ్చాం –ధర్మారావు, జిల్లా అగి్నమాపక శాఖ అధికారి
అగ్ని ప్రమాదాల నివారణపై పాటించాల్సిన నియమాలు
👉: ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు.
👉: కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు.
👉: ఐ.ఎస్.ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి.
👉: పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌లోడ్ వేయకూడదు. ఎలక్ట్రికల్ సాకెట్ నందు దాని కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి.
👉: ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులకు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయడం ఉత్తమం.
👉: ప్రమాదవశాత్తు అగి్నప్రమాదం జరిగితే ఆర్పటానికి ఎళ్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ చేయాలి.
👉: గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్‌్వను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయరాదు.
👉: స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లలో ఆర్‌సిసి లేదా కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి.
👉: ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్‌లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్‌లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్‌లు ఉపయోగించాలి.
👉: గోడౌన్‌లలో వస్తువులను నిల్వ ఉంచేటపుడు స్టాక్‌లకు మధ్య ఖాళీస్థలం ఉంచాలి.
👉: గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేసి, వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
👉: కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్‌పై శిక్షణ ఇవ్వాలి.
👉: విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.
👉: పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ గోడౌన్‌లలో వాహనదారులు, బంక్‌ల యందు డీజల్‌గాని, పెట్రోల్‌గాని నింపుకొన్నపుడు వాహనం ఇంజను పూర్తిగా ఆఫ్ చేయాలి.
వాహనదారులు ఇంధన నింపుకున్న తరువాత కొద్ది దూరం వెళ్లిన తరువాత బండి స్టార్ట్ చేయాలి. వాహనదారులు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిగానీ పెట్రోల్ బంక్ ఉన్న ప్రదేశంలో బీడీగాని, సిగరెట్‌గాని కాల్పరాదు. సెల్‌ఫోన్ ద్వారా సంభాషించరాదు. నీటివసతి అందుబాటులో ఉండాలి.
(చదవండి: పర్యావరణ స్పృహతో రైతు సృష్టిస్తున్న అద్భుతం..! దాంతో ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..!)