పంచభూతాల్లో ఒకటి.. మానవ పరిణామ క్రమంలో కీలకపాత్ర పోషించింది.. ప్రపంచ మనుగడకు అవసరమైంది.. అగ్ని. ఇంత కీలకమైన అగ్ని.. మానవ నిర్లక్ష్యం, పొరపాట్ల వల్ల ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని, తీరని ఆవేదనను కలిగిస్తుంది. చిన్న నిప్పురవ్వ కూడా పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది.
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: సాధారణంగా వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. రాష్ట్రంలో ఎక్కడ నిప్పు రాజుకున్నా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేస్తారు. నష్టాన్ని చాలావరకు తగ్గిస్తారు. బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు. ఎలాంటి ప్రమాదం జరిగినా 101కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే సిబ్బంది వాహనంతో వచ్చి సేవలు అందిస్తారు. 2014–15 నుంచి 2020–21 ఫిబ్రవరి నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 99,522 ప్రమాద ఘటనలు జరగ్గా.. ఇందులో 94,369 అగ్నిప్రమాదాలు. మిగిలిన 5,153 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, డ్రైనేజీల్లో జంతువులు, మనుషులు అనుకోకుండా ప్రమాదాలకు గురికావడం, వరదల్లో చిక్కుకుపోవడం వంటివి. అగ్నిమాపకశాఖ అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడమేగాక తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా వివరిస్తూ ఏటా వారోత్సవాలు నిర్వహిస్తుంది.
దహిస్తున్న నిర్లక్ష్యం
రాష్ట్రంలో అగ్నిప్రమాదాల వెనుక మానవ నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అగ్నిప్రమాదాల గణాంకాల్లో ఈ విషయం తెలుస్తోంది. అగ్ని ప్రమాదాల్లో 50 నుంచి 60 శాతం వరకు కేర్‌లెస్ స్మోకింగ్ (కాల్చి పారేసిన సిగరెట్ పీక) వల్ల జరుగుతున్నాయనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. 25 నుంచి 30 శాతం ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. ఇళ్లల్లో కాలం చెల్లిన వైరింగ్, నాసిరకం వైరింగ్, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ సక్రమంగా లేకవపోవడం వంటి అనేక కారణాలు మన కొంపను కాల్చేస్తున్నాయి. మన నిర్లక్ష్యం వల్ల పంట పొలాలు, గడ్డివాములు, అటవీ ప్రాంతాలు, ఇళ్లు కాలిపోతున్నాయి. రాష్ట్రంలో ఒక్క విశాఖపట్నంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో 118 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వీటిలో 67 ప్రమాదాలు కేర్‌లెస్ స్మోకింగ్ వల్ల, 35 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయంటే ఆందోళన కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 143 అగ్నిప్రమాదాల్లో.. 94 కేర్‌లెస్ స్మోకింగ్ వల్ల, 25 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయి.
అప్రమత్తతే మంటలకు మందు
అప్రమత్తతే మంటలకు సరైన మందు. చాలా అగ్నిప్రమాదాల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాల్చిన సిగరెట్ పీక అర్పకుండా విసిరేయడం. విద్యుత్ వైరింగ్, ఉపకరణాల నిర్వహణలో అవగాహణ లేకపోవడం, గ్యాస్ ఆఫ్ చేయకుండా వదిలేయండం వంటి చిన్న లోపాలు పెద్ద అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీనివల్ల ఎంతో విలువైన ఆస్తి, ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుకోని విధంగా అగ్నిప్రమాదం జరిగితే డయల్ 101కు సమాచారం ఇవ్వాలి. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలి.
–జి.శ్రీనివాసులు, రీజినల్ ఫైర్ ఆఫీసర్, ఈస్ట్రన్ రీజియన్
అందరూ జగ్రత్తగా ఉండాలి
వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అపార్ట్‌మెంటు వాసులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు టియర్ గ్యాస్ సిలిండర్లు ఏమేరకు వినియోగంలో ఉన్నాయో సరిచేసుకోవాలి.
– కె.జయరాంనాయక్, డైరెక్టర్, రాష్ట్ర అగ్నిమాపకశాఖ
అవగాహన అవసరం
ప్రమాదాల నివారణపై కనీస అవగాహన ఉంటే చాలావరకు ఆస్తి, ప్రాణ నష్టాలు నివారించవచ్చు. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రమాదం జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే స్పందిస్తున్నాం. అయినా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి.
– ఎం.శ్రీనివాసరెడ్డి, అగ్నిమాపక అధికారి, కృష్ణాజిల్లా
వారోత్సవాల్లో ఇలా..
రాష్ట్రంలో అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 1946 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్‌యార్డులోని ఓడలో అగ్నిప్రమాదం జరిగి 66 మంది అగ్నిమాపకదళ సిబ్బంది సజీవదహనం అయ్యారు. వారి స్మారకార్థం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు బుధవారం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించే కార్యక్రమంతో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం పార్కులు, రైల్వేస్టేషన్లు, మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్ యార్డుల్లో అవగాహన కల్పించారు. 16న అపార్ట్‌మెంట్లు, కాలనీలలో ఎల్‌పీజీ గ్యాస్, విద్యుత్తు ఉపరకరణాల వినియోగంపై ప్రదర్శనలు ఉంటాయి. 17న పెట్రోల్ బంకులు, ఎల్‌పీజీ స్టోర్స్, గోదాములు, వ్యాపార సముదాయాలు, ఫంక్షన్ హాళ్లలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తారు. 18న ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయి. 19న విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. 20వ తేదీన ముగింపు సభలు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment