పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు | Clarity in thought pattern when man is stable | Sakshi
Sakshi News home page

పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు

Published Mon, Nov 22 2021 5:22 AM | Last Updated on Mon, Nov 22 2021 5:22 AM

Clarity in thought pattern when man is stable - Sakshi

స్థిమితమైన, స్థిరమైన ఆలోచన కలిగిన సాధకుడు తన సాధనతో ఏది కాగోరితే, అది కాగలడు. తాను అత్యంత బలవంతుడనని భావించి, కార్యరంగాన విజయాన్ని సాధించగల ఆత్మవిశ్వాసంతో తన గమనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తాడు. అనుకూలంగా కాలం సాగిపోతున్నప్పుడు నన్ను మించినవాడు లేడని మానవుడు విర్రవీగడం సాధారణమైన విషయం. కానీ, తనకు సంప్రాప్తించిన విజయాన్ని సైతం దైనందిన జీవికలో సంభవించిన సాధారణమైన అంశంగానే భావించిన వాడే క్లిష్టపరిస్థితుల్లోనూ తన మానసిక స్థైర్యాన్ని అచంచలమైన తీరులో ప్రదర్శించగలుగుతాడు.

కష్టం లేదా ఆపద లేకుండా సాధారణంగా ఏ పనీ పూర్తికాదన్నది వాస్తవం. ఆపద ఎదురైనప్పుడు దానినుంచి పారిపోవడం సముచితమైన విషయం కాదు. అలాగని, ఆ ఆపదలో చిక్కుకుని బాధపడడమూ వివేకి లక్షణం కాదు. ఈ సందర్భంలో స్వామి వివేకానంద బోధించిన వాక్యాలు నిజమైన తెలివిని విజ్ఞతతో అన్నివేళలా ప్రదర్శించవలసిన ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ‘‘మనమంతా వేటగాడికి భయపడిన కుందేళ్ళలా ఆపద వచ్చినప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం. ఇది సరియైన పద్ధతి కాదు. ఎంతటి ఆపదనైనా సరే, ఎదుర్కొని పోరాటాన్ని సాగించడమే నిజమైన ప్రజ్ఞ. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడ్డామంటే చాలు, కష్టాలు, భయాలు అన్నీ దూరంగా తొలగిపోతాయి.’’ అన్న అద్భుతమైన వాక్యాలు ఎప్పటికీ గుర్తుంచుకోతగ్గవే..!!

‘‘మనిషి స్థిరత్వంతో ఉన్నప్పుడు ఆలోచనా సరళిలో స్పష్టత మరింతగా పెరిగి, సాధనకు మార్గం సుగమమవుతుంది. గజిబిజిగా ఉండే యోచనలన్నీ ఒక కొలిక్కివచ్చి, సజావుగా పురోగమించేందుకూ, గమ్యాన్ని చేరేటందుకూ ద్వారాలు తెరుచుకుంటాయి’’ అంటాడు పర్షియన్‌ మేధావి రూమి.

స్థిరత్వాన్ని ప్రదర్శించే ఇటువంటి ధీరుల లక్షణాలను స్వామి వివేకానంద తెలిపిన విధమూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ‘దిటవైన ఆలోచనా సరళి కలిగిన వ్యక్తి తన కార్యసాధనలో ఎటువంటి విమర్శలు ఎదురైనా నిరాశకూ, బాధకూ లోను కాడు. తన మార్గాన్ని అధర్మ వర్తనులు లేదా అసత్య ప్రేలాపనలు చేసేవాళ్ళు అడ్డుకున్నా, శాంతస్వభావంతో వాటిని ఎదుర్కొంటాడు. అనవసరమైన ప్రేలాపనలతో సాగే వారి ప్రేరేపణలూ ధీరుడైన ఇటువంటి వ్యక్తిని ఏమీ చేయలేవు. నిత్యమూ సంతృప్తితో, సంతుష్టితో ఉండడమే ఇటువంటివారి లక్షణం. ఫలితాలకోసం ఎప్పుడూ వీరు ఎదురు చూడరు. తమ లక్ష్యాన్ని చేరడానికి నిర్మల హృదయంతో శ్రమిస్తారు.’’ అంటారు వివేకానంద. ఎంతటి అద్భుతమైన వాక్యాలో కదా.. ప్రతివారూ గుర్తుంచుకుని, తమ వర్తనా సరళికి అనువుగా మలచుకోవలసిన వాక్యాలే యివి..!!

సమస్య ఎప్పుడైతే వస్తుందో, దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందనేది ఆర్యోక్తి. సమాధానం అనేది మన సందేహానికి సూటిగా దొరక్కపోయినా, దానిని దాటే మార్గం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇది వాస్తవం. మేరునగధీరులైన సాధకులు చాటిన జీవనసత్యం.


ఎటువంటి పరిస్థితులకూ చలించకుండా తన సహజ లక్షణంతో చరించడాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. సాధకునిలో ఉండవలసిన స్థిరమైన వర్తనాశైలిగా దీన్ని అభివర్ణించవచ్చు. భయం, అధైర్యం, అనుమానం, అసూయ. ద్వేషభావం వంటి అనవసర భావవికారాలు స్థితప్రజ్ఞునిలో అణుమాత్రమైనా ఉండవు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు.

తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొదలైన అన్ని అవయవాలనూ సాచి, మళ్ళీ డిప్పలోకి ముడుచుకున్నట్లుగా ఈ తరహా వ్యక్తులు సర్వేంద్రియాలనూ సర్వావస్థల్లో నిగ్రహించుకో గలుగుతారు. తన కనుల ముందు జరిగే సంఘటనలను చూసి కూడా చలించకుండా, స్థిరమైన ఆలోచన తో ముందుకు సాగుతాడు. అంటే మనసును నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే వీరి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణ ం.  

ముఖ్యంగా ఆటంకాలూ, అవరోధాలూ ఎదురైనప్పుడే స్థితప్రజ్ఞుల సుగుణాలు జగతికి తేటతెల్లమవుతాయి. తాను పడిపోయానని తెలిసినా, కుంగక, అపజయమనే మాటకు లొంగక ధైర్యంగా లేచి నిలబడే ధీరత్వం వీరిలో కనబడుతుంది. తనకు ఎదురైన ఓటమికి వేరేవారిని నిందించరు. కారణాలను అన్యులకు ఆపాదించరు. సంభవించిన పరాజయ క్రమంలో అవమానానికి, తృణీకరణకు గురైనా, చిరునవ్వుతోనే సాగుతూ వినమ్రంగా మసలుకోవడం ఉత్తములైన వీరి సహజ లక్షణం. ఈ అపజయం తమ గమ్యంలో ఒక మామూలు విషయమేనని తలుస్తూ, కార్యాన్ని సాధించగలిగిన బలం తనలో ఉందని అపారమైన నమ్మికతో ముందుకు సాగే తత్త్వం వీరి సొంతం. ఇలాంటి వారే అపూర్వమైన ఆ శక్తితో, ఆసక్తితో, అనురక్తితో ఆసాంతం పరిశ్రమించి విజయాన్ని చేజిక్కించుకోవడంలో చరితార్ధులవుతారు.

నిశ్చయాత్మకమైన ఆలోచన సొంతమైన ఇటువంటి వ్యక్తులు తమలో ఉన్న మంచిని నలుగురికీ పంచడం ఒక ఉన్నతమైన సుగుణమైతే, తాము ఆ మంచిని చేశామని చెప్పుకోకపోవడం వీరిలో ఎంచదగిన ప్రత్యేకమైన అంశం. ఫలాలు ఎలాగైతే పక్వానికి వచ్చినప్పుడే పండుతాయో, అదేవిధంగా ఫలితం కూడా రావలసిన సమయంలోనే వస్తుందని వీరు నిశ్చల మానసంతో భావిస్తారు. కార్యసాఫల్యం మీద సహజంగా పిరికి వారికి కలిగే సందేహాలు, అపనమ్మకంవంటివి మచ్చుకైనా వీరిలో కానరావు. మనం తరచు మాట్లాడుకునే నూతన ఆవిష్కరణలకు కారణంగా, ప్రేరణగా నిలిచేది, వీరి కార్యసాధనా క్రమమనే అపూర్వరణమే..!! నవచేతనకు అర్థాన్నిచ్చేదీ, ఊతంగా నిలిచేదీ వీరి సుదృఢమైన చేతలే..!!

సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు.
 
– ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్‌ గరికపాటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement