కలం.. కలం.. నిరసన గళం
సాహిత్య అవార్డులను వెనక్కిచ్చిన 12 మంది రచయితలు
♦ 21కి పెరిగిన జాబితా.. బాసటగా నిలిచిన సల్మాన్ రష్దీ..
న్యూఢిల్లీ: దేశంలో మత అసహన సంస్కృతి పెరిగిపోతోందని నిరసిస్తూ కేంద్ర సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న వారి జాబితా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే 12 మంది రచయితలు నిరసన గళం విప్పారు. దీంతో సాహిత్య పురస్కారాలను వాపసు చేస్తామన్న వారి సంఖ్య 21కి పెరిగింది. వీరికి బుకర్ ప్రైజ్ రచయిత సల్మాన్ రష్దీ బాసటగా నిలిచారు. తమ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు కశ్మీర్ రచయిత గులాం నబీ ఖాయల్, కన్నడ రచయిత, అనువాదకుడు డీఎన్ శ్రీనాథ్, హిందీ రచయితలు మంగళేశ్ దబ్రాల్, రాజేశ్ జోషి, కన్నడ అనువాదకుడు జీఎన్ రంగనాథరావ్, పంజాబ్ రచయితలు వార్యం సంధు, సుర్జీత్ పత్తార్, బల్‌దేవ్ సింగ్, సదక్‌నామ, జశ్వీందర్, దర్శన్ బుట్టర్ చెప్పారు. ఢిల్లీ రంగస్థల నటి మాయా క్రిష్ణారావ్ సంగీత నాటక అకాడమీ అవార్డును సోమవారం వెనక్కిచ్చారు.
‘దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు. భవిష్యత్ అంధకారమని వారు భయపడుతున్నారు’ అని ఖాయల్ చెప్పారు. అవార్డుతోపాటు దానికింద వచ్చిన నగదును కూడా వెనక్కి ఇస్తానని జోషీ తెలిపారు. ఇటీవలి పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ, ఇప్పుడు కలం స్థానం నుంచి బుల్లెట్లు వస్తున్నాయని శ్రీనాథ్ అన్నారు. హేతువాద రచయిత కల్బుర్గి హత్యపై అకాడమీ స్పందించకుండా మౌనంగా ఉండటాన్ని నిరసిస్తున్నామని దబ్రాల్, జోషీ తెలిపారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని రష్దీ పేర్కొన్నారు.
అవార్డుల వాపసు నేపథ్యంలో అకాడమీ ఈనెల 23న ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీ నిర్వహించనుంది. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు లౌకిక విలువలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న రచయితల తీరుపై అనుమానం కలుగుతోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు.