Sahitya award
-
జీవితం అంతుచూసిన కవి
పంతొమ్మిదో శతాబ్దపు జర్మన్ సాహిత్యంలో ఒక అలలా ఎగిసినవాడు హైనరిష్ వన్ క్లైస్ట్ (Heinrich von Kliest). నాటకకర్త, కవి, పాత్రికేయుడు అయిన క్లైస్ట్ను తదనంతరపు జర్మన్, ఫ్రెంచ్ కవులు ఒక నమూనాగా తీసుకున్నారు. 1777లో బెర్లిన్‌లో జన్మించిన క్లైస్ట్, కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. ‘ఏడు విలువైన సంవత్సరాలను కోల్పోయిన’ తర్వాత సైనికోద్యోగిగా రాజీనామా చేశాడు. ఉన్నత చదువులు ప్రారంభించినా, జ్ఞానం అనేది అర్థ రహితం అన్న అవగాహనతో వాటిని కొనసాగించలేదు. హేతువును పక్కనపెట్టి, ఉద్వేగానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చాడు. లోపలి అశాంతి దొరికిన ఉద్యోగంలో కుదురుకోనివ్వలేదు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు తిరిగాడు. గూఢచారి అన్న అనుమానాల మీద జైలులో కొంతకాలం నిర్బంధించబడినాడు. ఇక్కడే ‘ద ష్రోఫెన్స్టెయిన్ ఫ్యామిలీ’ నాటకం రాశాడు. మరో నాటకం ‘రాబర్ట్ గిస్కార్డ్’ రాతప్రతుల్ని కాల్చేశాడు. అత్యంత గాఢమైన కవిత్వంతో మాస్టర్‌పీస్‌గా ఇప్పుడు కొనియాడబడుతున్న ‘పెంథెసిలియా’కు సమకాలీన సాహితీ ప్రపంచం పెద్దగా స్పందించలేదు. ఎనిమిది నవలికలు రాశాడు. అందులో ‘ద అర్త్‌క్వేక్ ఇన్ చిలీ’ని ఇప్పుడు క్లాసిక్‌గా పరిగణిస్తున్నారు. ద ప్రిన్స్ ఆఫ్ హాంబర్గ్, ద బ్రోకెన్ జగ్ ఆయన ఇతర రచనలు. నెపోలియన్‌కు వ్యతిరేకంగా దేశాన్ని కూడగట్టడానికి ఒక రాజకీయ పత్రికను స్థాపించడానికి విఫలయత్నం చేశాడు. మరో పత్రికకు ఆరు నెలలు సంపాదకుడిగా ఉన్నాడు. ఇది మూతపడటంతో బతుకుతెరువు కోల్పోయాడు. వీటన్నింటిమధ్య అప్పటికే పెద్ద పేరున్న కవి గొథేతో నాటక ప్రదర్శన విషయంలో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. జీవితం పట్లా, సాహిత్యం పట్లా ఏ విధమైన ఆశ కనబడని దశలో– సంగీతంతో గాఢమైన పరిచయం ఉన్న యువతి హెన్రియెట్ వొగెల్ ఆయనకు పరిచయమైంది. అనారోగ్యంతో తన చివరి రోజులు గడుపుతున్న వొగెల్తోపాటు తాను కూడా జీవితం నుంచి సెలవు తీసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. 1811 నవంబర్ 21న ఇద్దరూ వాన్సీ తీరానికి చేరుకున్నారు. అంతకుముందే ఫేర్వెల్ లెటర్స్ రాశారు. ముందుగా వొగెల్‌ను కాల్చి, అదే పిస్టల్‌ను తనవైపు తిప్పుకున్నాడు క్లైస్ట్. జర్మనీలో అత్యున్నత సాహితీ పురస్కారం ‘క్లైస్ట్ ప్రైజ్’ను ఆయన పేరు మీదుగా ఇస్తున్నారు. -
కలం.. కలం.. నిరసన గళం
సాహిత్య అవార్డులను వెనక్కిచ్చిన 12 మంది రచయితలు ♦ 21కి పెరిగిన జాబితా.. బాసటగా నిలిచిన సల్మాన్ రష్దీ.. న్యూఢిల్లీ: దేశంలో మత అసహన సంస్కృతి పెరిగిపోతోందని నిరసిస్తూ కేంద్ర సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న వారి జాబితా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే 12 మంది రచయితలు నిరసన గళం విప్పారు. దీంతో సాహిత్య పురస్కారాలను వాపసు చేస్తామన్న వారి సంఖ్య 21కి పెరిగింది. వీరికి బుకర్ ప్రైజ్ రచయిత సల్మాన్ రష్దీ బాసటగా నిలిచారు. తమ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు కశ్మీర్ రచయిత గులాం నబీ ఖాయల్, కన్నడ రచయిత, అనువాదకుడు డీఎన్ శ్రీనాథ్, హిందీ రచయితలు మంగళేశ్ దబ్రాల్, రాజేశ్ జోషి, కన్నడ అనువాదకుడు జీఎన్ రంగనాథరావ్, పంజాబ్ రచయితలు వార్యం సంధు, సుర్జీత్ పత్తార్, బల్దేవ్ సింగ్, సదక్నామ, జశ్వీందర్, దర్శన్ బుట్టర్ చెప్పారు. ఢిల్లీ రంగస్థల నటి మాయా క్రిష్ణారావ్ సంగీత నాటక అకాడమీ అవార్డును సోమవారం వెనక్కిచ్చారు. ‘దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు. భవిష్యత్ అంధకారమని వారు భయపడుతున్నారు’ అని ఖాయల్ చెప్పారు. అవార్డుతోపాటు దానికింద వచ్చిన నగదును కూడా వెనక్కి ఇస్తానని జోషీ తెలిపారు. ఇటీవలి పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ, ఇప్పుడు కలం స్థానం నుంచి బుల్లెట్లు వస్తున్నాయని శ్రీనాథ్ అన్నారు. హేతువాద రచయిత కల్బుర్గి హత్యపై అకాడమీ స్పందించకుండా మౌనంగా ఉండటాన్ని నిరసిస్తున్నామని దబ్రాల్, జోషీ తెలిపారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని రష్దీ పేర్కొన్నారు. అవార్డుల వాపసు నేపథ్యంలో అకాడమీ ఈనెల 23న ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీ నిర్వహించనుంది. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు లౌకిక విలువలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న రచయితల తీరుపై అనుమానం కలుగుతోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. -
మేమూ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తాం
♦ సాహిత్య అవార్డును వెనక్కిచ్చేస్తా: మలయాళ రచయిత్రి సారా ♦ ఉర్దూ సాహిత్య అవార్డును వాపసు చేస్తా: రెహ్మాన్ అబ్బాస్ ♦ సాహిత్య అకాడమీ కమిటీల నుంచి తప్పుకున్న కె. సచ్చిదానందన్ తిరువనంతపురం/న్యూఢిల్లీ: దాద్రీ ఘటన, హేతువాదుల హత్యలపై మరికొందరు రచయితలు నిరసన గళం వినిపించారు. వీటికి, దేశంలో పెరుగుతున్న అసహన సంస్కృతికి నిరసనగా తనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రముఖ మలయాళ రచయిత్రి సారా జోసఫ్ శనివారం ప్రకటించారు. మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కరాన్ని తానూ వాపసు చేస్తానని ఉర్దూ నవలా రచయిత రెహ్మాన్ అబ్బాస్ ప్రకటించారు. మరోపక్క.. కన్నడ హేతువాది కల్బుర్గికి హత్యకు నిరసనగా ప్రముఖ మలయాళ కవి కె. సచ్చిదానందన్ సాహిత్య అకాడమీ కమిటీల్లోని తన పదవులన్నింటికి రాజీనామా చేశారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మలయాళ కథా రచయిత పీకే పరక్కడవు కూడా ప్రకటించారు. మతసామరస్యానికి పెను ముప్పు: సారా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని సారా జోసఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మతసామరస్యానికి, లౌకిక వాదానికి ఇదివరకెన్నడూ లేనంత ముప్పు ఏర్పడిందని త్రిస్సూర్ నుంచి పీటీఐతో చెప్పారు. అవార్డు కింద తనకిచ్చిన నగదు, జ్ఞాపికను కొరియర్లో అకాడమీకి పంపుతానన్నారు. ‘ఇప్పటికే ముగ్గురు రచయితలు హత్యకు గురయ్యారు. మరో రచయిత కేఎస్ భగవాన్‌కు మతతత్వ శక్తుల నుంచి ప్రాణహాని ఉంది. అయినప్పటికీ రచయితల, కార్యకర్తల, ఇతర వర్గాల భయాలను తొలగించేందుకు కేంద్రం ఏమీ చేయడం లేదు’ అని ఆమె మండిపడ్డారు. దాద్రీ ఘటన తర్వాత ఉర్దూ రచయితలు ఆందోళనపడుతున్నారని, అందుకే అవార్డు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు అబ్బాస్ ముంబైలో చెప్పారు. ‘ఈ రోజే అవార్డు వాపసు చేస్తానన్నా. అయితే అకాడమీ కార్యాలయ సమయం అయిపోయిందన్నారు. సోమవారం వాపసు చేస్తా’ అని తెలిపారు. రచయితలకు, భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలబడ్డంలో కేంద్ర సాహిత్య అకాడమీ విఫలమైందని సచ్చిదానందన్ ఆరోపించారు. అకాడమీ బెంగళూరులో కల్బుర్గి సంస్మరణ సభ జరిపిందని, అయితే జాతీయ స్థాయిలో ఏదో ఒకటి చేయాల్సి ఉండిందని పేర్కొన్నారు. ఒక తీర్మానం తేవాలని అకాడమీకి తాను విజ్ఞప్తి చేసినా స్పందన కరవైందన్నారు. అకాడమీ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఫైనాన్షియల్ కమిటీల్లోని తన పదవులకు ఆయన రాజీనామా చేశారు.