బుకర్‌ప్రైజ్ విన్నర్, భారత సంతతికి చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటనను ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. 75 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా(ముంబైలో పుట్టారు కాబట్టి) ఘనత దక్కించుకున్నారు. అందుకే పలు దేశాల నేతలు, అధినేతలతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఇరాన్‌లో పండుగ వాతావరణం నెలకొనడం విశేషం.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో మాజీ అధినేత అయతోల్లా రుహోల్లా ఖోమెయినీ(దివంగత) ఫొటోలు.. బ్యానర్లు, ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు తన నవల(నిషేధిత)తో ఇస్లాంను అవహేళన చేసినందుకు సరైన శిక్ష పడిందంటూ అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం ఇస్లాంను అవమానించాడన్న ఆరోపణపైనే ఆయనపై దాడిని కొందరు ఇరానీయన్లు సమర్థించడం గమనార్హం.
► ఇక అదే గడ్డపై మరోరకమైన వాతావరణమూ కనిపిస్తోంది కూడా. ఇప్పటికే న్యూక్లియర్ ఒప్పందాల విషయంలో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై గుర్రుగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని ఆధారంగా చేసుకుని మరిన్ని ఆంక్షలు విధించొచ్చన్న ఆందోళన ఇరాన్‌లో నెలకొంది.
► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా నిర్ధారించారు. అతను ఉద్దేశం ఏంటన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు.
► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్‌లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు.
► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి.
► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన.
► మిడ్‌నైట్ చిల్డ్రన్‌కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్‌కు నామినేట్ అయ్యారు.
► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది.
► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు.
► పాక్ ప్రపంచంలో పాతికకు పైగా దేశాలు.. ఇస్లాంను కించపరిచేలా ఉందంటూ ఈ నవలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. సల్మాన్ రష్డీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అందులో కొన్ని బ్యాన్ చేశాయి కూడా. భారత్ కూడా నవల పబ్లిష్ అయిన నెల రోజుల తర్వాత నిషేధించింది. ఎవరైనా ఆ నవలను దగ్గర ఉంచుకున్నా సరే అప్పట్లో కఠినంగా శిక్షించేవి ఇస్లాం దేశాలు.
► ముంబైలో 1989 ఫిబ్రవరిలో రష్డీకి వ్యతిరేకంగా మొదలైన ర్యాలీ కాస్త అల్లర్ల మలుపు తీసుకుంది. ఏకంగా 12 మంది మృతి చెందారు.
► ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయిన ఏడాది తర్వాత.. అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు.
► 80వ దశకం నుంచి ఇరాన్ ఆయనను చంపి తీరుతామని ప్రకటలు చేస్తూ వచ్చాయి. అంతేకాదు ఒకానొక టైంలో.. ఆయనపై ప్రకటించిన రివార్డు 3 మిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా.
► 1989లో ఇరాన్ యూకేతో ది సాటానిక్ వెర్సెస్ నవల విషయంలో దౌత్యపరమైన సంబంధం నడిపింది.
► ఇప్పుడు సల్మాన్ రష్డీపై దాడి గురించి చూశారు కదా. అయితే గతంలోనూ ఈ నవలతో సంబంధం ఉన్నవాళ్లపైనా దాడులు జరిగాయి.
► ది సాటానిక్ వెర్సెస్ జపనీస్ వెర్సన్‌లో రష్డీకి సాయం చేసిన హితోషి ఇగరషి అనే ట్రాన్స్‌లేటర్.. 1991, జులై 13న ఘోరంగా కత్తిపోట్లకు గురై హత్య గావించబడ్డాడు.
► ఇగరషి కంటే పదిరోజుల ముందుగా జరిగిన ఓ దాడిలో.. రష్డీకి ది సాటానిక్ వెర్సెస్ విషయంలో ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ఎట్టోరే క్యాప్రివోలో.. మిలన్(ఇటలీ)లోని తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇతనూ కత్తి పోట్లకే గురికావడం గమనార్హం.
► ది సాటానిక్ వెర్సెస్ నార్వేరియన్ పబ్లిషర్ విలియం నైగార్డ్‌ను ఓస్లోలో అక్టోబర్ 11, 1993లో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు.
► టర్కీస్ ట్రాన్స్‌లేటర్ అజిజ్ నాసిన్‌ను లక్ష్యంగా చేసుకుని.. జులై 2, 1993లో ఓ గుంపు దాడి చేసింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మడిమక్ హోటల్‌కు నిప్పటించడంతో.. 37 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చాలామంది కళాకారులు కావడం విశేషం.
► అగష్టు 12, 2022.. శుక్రవారం వెస్ట్రన్ న్యూయార్క్‌లో ఉపన్యాసం కోసం సిద్ధమైన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై.. వెనుక నుంచి ఓ దుండగుడు కంఠంలో విచక్షణంగా పొడిచి దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి.. సర్జరీలు చేశారు. ఆయన ప్రధాన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, ఒక కంటికి చూపును సైతం కోల్పోవచ్చని వైద్యులు చెప్తున్నారు.
► కొంతకాలం దాకా ఆయనకు భారీ భద్రతే ఉండేది. అయితే ఆ భద్రతా సిబ్బందితోనూ తనకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆయన విజ్ఞప్తి చేయడంతో.. కొంత వెనక్కి తీసుకున్నారు.
► చావు బెదిరింపులకు భయపడి.. ఇంతకాలం భయం భయంగా గడిపాను. ఇప్పుడు సాధారణంగా మారిందనే నమ్ముతున్నా.. దాడికి కొన్నివారాల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ రష్టీ చేసిన వ్యాఖ్యలు.
► ఇరాన్ మీడియా ఇండో-బ్రిటీష్ సంతతికి చెందిన సల్మాన్ రష్డీపై దాడిని హైలైట్ చేస్తూ.. సానుకూల కథనాలు ప్రసారం చేసుకుంది. ముఖ్యంగా అయతోల్ల స్థాపించిన ‘కేహన్’.. దాడికి పాల్పడిన దుండగుడిని ఆకాశానికి ఎత్తేసింది.
► ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సల్మాన్ రష్డీ.. ఒకేఒక్క నవల(ది సాటానిక్ వెర్సెస్)తో తన జీవితానికి భయంభయంగా గడిపారు. అదీ 30 ఏళ్లకు పైనే.
► ప్రాథమిక విచారణలో హాది మతార్ సోషల్ మీడియా అకౌంట్‌లు అన్నీ.. షియా ఎక్స్‌ట్రీమిజం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్(IRGC)సానుభూతి పరుడిగా ఉంది.
► అయితే హాది మతార్‌కు.. ఐఆర్‌జీసీకి నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
► 2020లో హత్యకు గురైన ఐఆర్‌జీసీ కమాండర్ ఖాసీం సోలెమని.. ఫొటోలు మాత్రం హాది మతార్ మొబైల్‌లో ఉన్నాయి.
► స్టేజీ మీదకు దూకి మరీ హాది మతార్ దాడికి పాల్పడ్డాడు. సల్మాన్ రష్డీని ఇంటర్వ్యూ చేయాలనుకున్న హెన్రీ రెస్సీ సైతం ఈ దాడిలో గాయపడ్డారు.
► ఒంటరిగానే అతను ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నా.. లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు.
► హదీ మాతర్ ప్రస్తుతం న్యూజెర్సీ.. ఫెయిర్‌వ్యూవ్‌లో ఉంటున్నాడు. అతను ఏ దేశ పౌరుడు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది.
ఇదీ చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
Comments
Please login to add a commentAdd a comment