newyork police
-
రక్తపు మడుగులో ఆయన్ని చూశాకే.. ఘోరం తెలిసొచ్చింది!
న్యూయార్క్: సుప్రసిద్ధ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని సాహిత్య లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఘోరమైన దాడి నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. అయితే పూర్తిస్థాయి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం చెప్పలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి, దాడిలో గాయపడ్డ హెన్రీ రెస్సే.. సల్మాన్ రష్డీపై దాడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. న్యూయార్క్‌లో గత శుక్రవారం ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరైన సల్మాన్ రష్డీపై దాడి జరిగింది. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న తరుణంలో.. దుండగుడు వేదికపైకి దూకి రష్డీపై విచక్షణా రహితంగా గొంతులో పొడిచి దాడి చేశాడు. ఆ సమయంలో ఆ ఈవెంట్ నిర్వాహకుడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్న సిటీ ఆఫ్ అసైలం ఎన్జీవో ప్రెసిడెంట్ హెన్రీ రెస్సే.. సైతం దాడిలో గాయపడి కోలుకున్నారు. ‘అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. సల్మాన్ రష్డీకి ప్రాణ హని ఉందన్న చర్చ గత కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలో మమ్మల్ని ఆటపట్టించేందుకు ప్రాంక్‌కు పాల్పడి ఉంటారని భావించాం. ఆ ఘటనను సైతం ప్రాంక్ స్టంట్ ఏమో అనుకున్నాం. కానీ, రక్తపు మడుగులో రష్డీగారిని చూశాకే.. అదొక వాస్తవ ఘటన అని అర్థమైంది. అప్పటికే అక్కడంతా గందరగోళం నెలకొంది. నాపైనా దాడి జరిగింది’ అని రెస్సే గుర్తు చేసుకున్నారు. సల్మాన్ రష్డీపై జరిగింది భౌతిక దాడి మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్య లోకం మీదే జరిగినట్లు లెక్క. దీనిని ముక్తకంఠంతో మేం ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. 1997లో ఆయన ప్రసంగం చూశాక.. మా ఎన్జీవో ఈవెంట్‌కు ఆయన అర్హుడని భావించాం. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఈ లోపే ఈ ఘటన జరగడం బాధాకరం. ఘటన జరిగిన సమయంలో దుండగులు సిబ్బందితో పాటు ఈవెంట్‌కు హాజరైన వాళ్లతో సైతం పెనుగులాడాడు. చివరికి సిబ్బందిని అతన్ని కట్టడి చేయగలిగింది అని రెస్సే తెలిపారు. పెన్సిల్వేనియాలోని ఓ ఆస్పత్రిలో సల్మాన్ రష్డీ చికిత్స పొందుతున్నారు. Full Video- Author Salman Rushdie was stabbed after taking stage at a Chautauqua Institute event.#SalmanRushdie #सलमान_रुश्दी #SarTanSeJuda #Rushdie #Iran #newyork #salmanrushdieattacked #salmanrushdiestabbed #Newyorkpic.twitter.com/6q1YDs6fb0 — Anil Kumar Verma (@AnilKumarVerma_) August 12, 2022 ఇదీ చదవండి: ఈ నవల రక్తాన్ని కళ్ల చూస్తోంది.. ఎందుకో తెలుసా? -
ఆ నవల జోలికి వెళ్తే.. అందరికీ ఇదే గతి!
బుకర్‌ప్రైజ్ విన్నర్, భారత సంతతికి చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటనను ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. 75 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా(ముంబైలో పుట్టారు కాబట్టి) ఘనత దక్కించుకున్నారు. అందుకే పలు దేశాల నేతలు, అధినేతలతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఇరాన్లో పండుగ వాతావరణం నెలకొనడం విశేషం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో మాజీ అధినేత అయతోల్లా రుహోల్లా ఖోమెయినీ(దివంగత) ఫొటోలు.. బ్యానర్లు, ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు తన నవల(నిషేధిత)తో ఇస్లాంను అవహేళన చేసినందుకు సరైన శిక్ష పడిందంటూ అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం ఇస్లాంను అవమానించాడన్న ఆరోపణపైనే ఆయనపై దాడిని కొందరు ఇరానీయన్లు సమర్థించడం గమనార్హం. ► ఇక అదే గడ్డపై మరోరకమైన వాతావరణమూ కనిపిస్తోంది కూడా. ఇప్పటికే న్యూక్లియర్ ఒప్పందాల విషయంలో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై గుర్రుగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని ఆధారంగా చేసుకుని మరిన్ని ఆంక్షలు విధించొచ్చన్న ఆందోళన ఇరాన్లో నెలకొంది. ► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా నిర్ధారించారు. అతను ఉద్దేశం ఏంటన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. ► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. ► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. ► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. ► మిడ్నైట్ చిల్డ్రన్కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్కు నామినేట్ అయ్యారు. ► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది. ► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. ► పాక్ ప్రపంచంలో పాతికకు పైగా దేశాలు.. ఇస్లాంను కించపరిచేలా ఉందంటూ ఈ నవలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. సల్మాన్ రష్డీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అందులో కొన్ని బ్యాన్ చేశాయి కూడా. భారత్ కూడా నవల పబ్లిష్ అయిన నెల రోజుల తర్వాత నిషేధించింది. ఎవరైనా ఆ నవలను దగ్గర ఉంచుకున్నా సరే అప్పట్లో కఠినంగా శిక్షించేవి ఇస్లాం దేశాలు. ► ముంబైలో 1989 ఫిబ్రవరిలో రష్డీకి వ్యతిరేకంగా మొదలైన ర్యాలీ కాస్త అల్లర్ల మలుపు తీసుకుంది. ఏకంగా 12 మంది మృతి చెందారు. ► ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయిన ఏడాది తర్వాత.. అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ► 80వ దశకం నుంచి ఇరాన్ ఆయనను చంపి తీరుతామని ప్రకటలు చేస్తూ వచ్చాయి. అంతేకాదు ఒకానొక టైంలో.. ఆయనపై ప్రకటించిన రివార్డు 3 మిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. ► 1989లో ఇరాన్ యూకేతో ది సాటానిక్ వెర్సెస్ నవల విషయంలో దౌత్యపరమైన సంబంధం నడిపింది. ► ఇప్పుడు సల్మాన్ రష్డీపై దాడి గురించి చూశారు కదా. అయితే గతంలోనూ ఈ నవలతో సంబంధం ఉన్నవాళ్లపైనా దాడులు జరిగాయి. ► ది సాటానిక్ వెర్సెస్ జపనీస్ వెర్సన్‌లో రష్డీకి సాయం చేసిన హితోషి ఇగరషి అనే ట్రాన్స్‌లేటర్.. 1991, జులై 13న ఘోరంగా కత్తిపోట్లకు గురై హత్య గావించబడ్డాడు. ► ఇగరషి కంటే పదిరోజుల ముందుగా జరిగిన ఓ దాడిలో.. రష్డీకి ది సాటానిక్ వెర్సెస్ విషయంలో ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ఎట్టోరే క్యాప్రివోలో.. మిలన్(ఇటలీ)లోని తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇతనూ కత్తి పోట్లకే గురికావడం గమనార్హం. ► ది సాటానిక్ వెర్సెస్ నార్వేరియన్ పబ్లిషర్ విలియం నైగార్డ్ను ఓస్లోలో అక్టోబర్ 11, 1993లో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ► టర్కీస్ ట్రాన్స్‌లేటర్ అజిజ్ నాసిన్‌ను లక్ష్యంగా చేసుకుని.. జులై 2, 1993లో ఓ గుంపు దాడి చేసింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మడిమక్ హోటల్‌కు నిప్పటించడంతో.. 37 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చాలామంది కళాకారులు కావడం విశేషం. ► అగష్టు 12, 2022.. శుక్రవారం వెస్ట్రన్ న్యూయార్క్‌లో ఉపన్యాసం కోసం సిద్ధమైన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై.. వెనుక నుంచి ఓ దుండగుడు కంఠంలో విచక్షణంగా పొడిచి దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి.. సర్జరీలు చేశారు. ఆయన ప్రధాన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, ఒక కంటికి చూపును సైతం కోల్పోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ► కొంతకాలం దాకా ఆయనకు భారీ భద్రతే ఉండేది. అయితే ఆ భద్రతా సిబ్బందితోనూ తనకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆయన విజ్ఞప్తి చేయడంతో.. కొంత వెనక్కి తీసుకున్నారు. ► చావు బెదిరింపులకు భయపడి.. ఇంతకాలం భయం భయంగా గడిపాను. ఇప్పుడు సాధారణంగా మారిందనే నమ్ముతున్నా.. దాడికి కొన్నివారాల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ రష్టీ చేసిన వ్యాఖ్యలు. ► ఇరాన్ మీడియా ఇండో-బ్రిటీష్ సంతతికి చెందిన సల్మాన్ రష్డీపై దాడిని హైలైట్ చేస్తూ.. సానుకూల కథనాలు ప్రసారం చేసుకుంది. ముఖ్యంగా అయతోల్ల స్థాపించిన ‘కేహన్’.. దాడికి పాల్పడిన దుండగుడిని ఆకాశానికి ఎత్తేసింది. ► ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సల్మాన్ రష్డీ.. ఒకేఒక్క నవల(ది సాటానిక్ వెర్సెస్)తో తన జీవితానికి భయంభయంగా గడిపారు. అదీ 30 ఏళ్లకు పైనే. ► ప్రాథమిక విచారణలో హాది మతార్ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ.. షియా ఎక్స్‌ట్రీమిజం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్(IRGC)సానుభూతి పరుడిగా ఉంది. ► అయితే హాది మతార్‌కు.. ఐఆర్‌జీసీకి నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ► 2020లో హత్యకు గురైన ఐఆర్జీసీ కమాండర్ ఖాసీం సోలెమని.. ఫొటోలు మాత్రం హాది మతార్ మొబైల్లో ఉన్నాయి. ► స్టేజీ మీదకు దూకి మరీ హాది మతార్ దాడికి పాల్పడ్డాడు. సల్మాన్ రష్డీని ఇంటర్వ్యూ చేయాలనుకున్న హెన్రీ రెస్సీ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. ► ఒంటరిగానే అతను ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నా.. లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు. ► హదీ మాతర్ ప్రస్తుతం న్యూజెర్సీ.. ఫెయిర్వ్యూవ్లో ఉంటున్నాడు. అతను ఏ దేశ పౌరుడు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇదీ చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి
అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తోన్న ఓ ప్రవాస భారతీయుడిపై న్యూయార్క్‌లో దాడి జరిగింది. అంతేకాదు ఎన్నారైని ఉద్దేశించి జాత్యాహాంకర వ్యాఖ్యలకు దిగాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అవగా బాధితుడికి అండగా భారతీయ సంఘాలు నిలబడ్డాయి. ఈ ఘటకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అమెరికాలో దాడికి సంబంధించిన వివరాలను హిందూ పత్రిక ప్రచురించింది. హిందూ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జనవరి 3న జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 దగ్గర తన కారును పార్క్ చేశారు. ఇంతలో కస్టమర్ రావడంతో కారును ముందుకు కదిపేందుకు ప్రయత్నించగా అక్కడ మరో ట్యాక్సీ నిలిపి ఉంది. వెంటనే కారు దిగిన సింగ్.. తన కారు వెళ్లేందుకు వీలుగా ముందున్న కారును పక్కకు తీయాలంటూ అందులో ఉన్న వ్యక్తిని కోరాడు. సింగ్ కారు దిగడం ఆలస్యం కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ముఖం, ఛాతిపై పంచ్‌లు విసిరాడు. దాడికి పాల్పడుతూనే సింగ్ తలకు ఉన్న టర్బన్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ‘ టర్బనేడ్ పీపుల్, గో బ్యాక్ టూ యువర్ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయాడు. జరిగిన ఘటనపై సింగ్ వెంటనే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న పోర్టు అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశాడు. అయితే సింగ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సిక్కు కమ్యూనిటీల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో బాధితుడికి న్యాయం జరిగేందుకు వీలుగా ఒక డిటెక్టివ్, న్యాయవాదిని నియమించారు. చదవండి: దేశమేదైనా అండగా మేమున్నాం -
అమెరికా: నిరసనకారులపై కారు బీభత్సం..
న్యూయార్క్: అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మాన్హాటన్ ముర్రే హిల్ ప్రాంతంలో శుక్రవారం నిరసన చేపట్టిన నిరసనకారుల పైకి అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 12 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌తో పాటు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే శుక్రవారం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు, వలసదారుల నిర్బంధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తును నిరసనకారులు నిరసన చేపట్టారు. నిరసనకారులపై ఒక్కసారిగా దూసుకుపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాహనదారుడు ఉద్దేశపూర్వకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డడా? లేదా ట్రాఫిక్ కారణంగా ఇలా జరిగిందా? అనే అంశంలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో నిరసనలో సుమారు 40 నుంచి 50 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
న్యూయార్క్ సిటీకి లేడీ బాస్
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్! ఎన్.వై.పి.డి. నూటా డెబ్భై ఐదేళ్ల చరిత్ర. యాభై ఐదు వేల మంది సిబ్బంది. నలభై ఐదు వేల కోట్ల రూ. బడ్జెట్. పది వేల పోలీస్ కార్లు. పదకొండు పోలీస్ బోట్లు. ఎనిమిది పోలీస్ హెలీకాప్టర్లు. నలభై ఐదు గుర్రాలు. ముప్పై ఐదు జాగిలాలు! కొత్తగా ఇప్పుడు.. హ్వానీటా హోమ్! ఎన్.వై.పి.డి.కి తొలి మహిళా చీఫ్. హ్వానీటా హోమ్స్ ఎన్.వై.పి.డి.కి చీఫ్ అవగానే న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లాసియో.. ‘హ్వానీటా ఒక చరిత్రాత్మక ఎంపిక మాత్రమే కాదు. తగిన ఎంపిక కూడా’ అని మొన్న 29న ట్వీట్ పెట్టారు. ఇప్పటికి చార్జి తీసుకునే ఉంటారు హ్వానీటా. 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆమె తొలి మహిళా చీఫ్. అంతేకాదు. తొలి ఆఫ్రికన్–అమెరికన్ మహిళా చీఫ్. ‘చీఫ్ ఆఫ్ పెట్రోల్’ ఆమె ఈ కొత్త హోదా. హ్వానీటా ముప్పై ఏళ్లకు పైగా ఎన్.వై.పి.డి.లో ఉన్నారు. తొలి పోస్టింగ్ 1987లో ‘పెట్రోల్ ఆఫీసర్’గా. తర్వాత సార్జెంట్, లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిప్యూటీ చీఫ్. 2016లో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా ‘బరో కమాండర్’! బరో అంటే సిటీ. ఇప్పుడిక.. చీఫ్ ఆఫ్ పెట్రోల్. న్యూయార్క్ సిటీలో క్రైమ్‌ని తగ్గించడం ఆమె ముఖ్య విధి. అందుకోసం ఎన్.వై.పి.డి.కి ఎన్ని బలగాలు ఉన్నాయో, అన్నీ ఆమె అధీనంలోకి వచ్చేస్తాయి. ముప్పై ఐదు జాగిలాలు సహా. హ్వానీటా కుటుంబం నుంచే 16 మంది న్యూయార్క్ సిటీ పోలీసులు ఉన్నారు! ప్రజల రక్షణకు అంకితమైన పోలీస్ కుటుంబం. అమెరికాలోనే అత్యంత శక్తిమంతమైన పోలీస్ డిపార్ట్మెంట్ను హ్వానీటా ఇప్పుడు నడిపించబోతున్నారు. తర్వాతి పొజిషన్ పోలీస్ కమిషనర్. ఇప్పటి వరకు ఉన్న ‘పెట్రోల్ చీఫ్’ ఫాటో పిచార్డో ఈ నెలలో తన పదవీ విరమణ ప్రకటించడంతో ఆ స్థానంలోకి తగిన వ్యక్తిగా డిపార్ట్మెంట్ హ్వానీటాను ఎంపిక చేసింది. ఆమె ఆ స్థానంలోకి రాగానే.. ‘‘ఎ కంప్లీట్ ప్యాకేజ్’ అని ఇప్పుడున్న కమిషనర్ ఆమెను అభినందించారు. అన్ని విధాలా పర్ఫెక్ట్ ఆఫీసర్ అని. ఆయనే.. ‘‘వాక్డ్ ది వాక్ అండ్ టాక్డ్ ద టాక్’’ అని ఆమెను ప్రశంసించారు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపించే మనిషి అని. పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ లించ్.. ‘‘మన ప్రొఫెషన్లో ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది హ్వానీటాకు మించి ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం మొత్తం డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తోంది’’ అని పూలగుచ్ఛం అందించారు. పదోన్నతి పొందిన ఒక అధికారికి మొక్కుబడిగా లభించే ప్రశంసలు కావివి. ఆమె కెరీర్లో ప్రతి దశ అత్యుత్తమ ప్రతిభ, సమర్థతలతో కూడి ఉంది. ఆమె ఎన్.వై.పి.డి. స్కూల్ సేఫ్టీ డివిజన్లో చేశారు. డొమెస్టిక్ వయెలెన్స్ యూనిట్లో చేశారు. ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రైనింగ్’ విభాగంలోనూ చేశారు. ఖండితంగా ఉంటారు హ్వానీటా. ఏది జరగాలో దానినే జరగనిస్తారు. ఒత్తిళ్లకు లోనవరు. చీఫ్ పెట్రోల్ ఆఫీసర్‌కు కావలసినవి కూడా ఈ గుణాలే. నిజాయితీ, సమానత్వం, దాపరికాలు లేకుండా ఉండటం. ‘‘ప్రజలు మనకెంతో చెప్పాలని తాపత్రయ పడుతుంటారు. వాళ్లు చెప్పింది మనం వినాలని ఆశిస్తుంటారు. నేరాలను తగ్గించి, జీవితంలోని నాణ్యతను పెంచడంలో వారి తోడ్పాటు కూడా పోలీసులకు అత్యవసరమే’’ అంటారు హ్వానీటా. -
నేరం రుజువైతే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
న్యూయార్క్ : భారతసంతతికి చెందిన అవ్నీత్ కౌర్(20) అనే యువతిపై జరిగింది విద్వేశ పూరిత దాడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో తన స్నేహితురాలితో కలిసి మాన్‌హట్టన్‌లో సబ్వే ట్రైన్లో ప్రయాణిస్తుండగా అల్లాషీద్ (54) అనే న్యూయార్క్‌కు చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కౌర్‌తో పాటూ ఆమె స్నేహితురాలిని అల్లాషీద్ అసభ్య పదజాలంతో దూషించడంతో వారు అతడికి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. వారిద్దరిని వెంబడించి మరీ అల్లాషీద్ కౌర్‌పై దాడికి దిగాడు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో నిందితుడి నేరం రుజువైతే మూడున్నరేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ తెలిపారు. -
పోలీసులకు లొంగిపోయిన సినీ దిగ్గజం
న్యూయార్క్ : ఎందరో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత, సినీ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ న్యూయార్క్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్ తెల్ల షర్ట్, డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారని అధికారులు చెప్పారు. పాత్రికేయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వెయిన్‌స్టీన్ స్పందన కోసం వేచిచూశారు. పోలీసు అధికారులు ఆయనకు ఎస్కార్ట్‌గా నిలిచారు. వెయిన్‌స్టీన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా, హాలీవుడ్ సెలబ్రిటీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వెయిన్‌స్టీన్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దశాబ్ధాలుగా వెయిన్‌స్టీన్ మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడని 70 మందికి పైగా మహిళలు ఇప్పటికే బాహాటంగా వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ లో తొలుత వెయిన్‌స్టీన్ నిర్వాకం వెలుగుచూసిన తర్వాత మీ టూ క్యాంపెయిన్ పేరిట వందలాదిగా మహిళలు సినీ, వాణిజ్య, అధికార, వినోద రంగాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. -
కారులో మహిళ బిగుసుకుపోయిందని వెళ్తే..
ఒక కారు రోడ్డు మీద పార్క్ చేసి ఉంది. అందులో మహిళ బిగుసుకుపోయి కనపడింది. బహుశా మంచు వల్ల చలి ఎక్కువై ఆమె అలా అయిపోయి ఉంటుందని పోలీసులు కంగారు పడ్డారు. హడావుడిగా వెళ్లి అద్దాలు పగలగొట్టారు. తీరా చూస్తే లోపల ఉన్నది మహిళ కాదు.. అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న బొమ్మ!! దాన్ని చూసి న్యూయార్క్ పోలీసులు కంగుతిన్నారు. హడ్సన్ నగరంలో రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న కారులో ఎవరో మహిళ చనిపోయి, బిగుసుకుపోయినట్లు కనిపిస్తోందని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడకు వెళ్లి చూడగా, మంచుతో కప్పబడిపోయి ఉన్న కారు కనిపించింది. రాత్రి దాదాపు -13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న సమయం నుంచి దాన్ని అక్కడే వదిలేసినట్లు తెలిసింది. కారు మీద దట్టంగా మంచు పేరుకుపోయింది. కారు లోపల ఆక్సిజన్ మాస్కు ధరించి, ఏమాత్రం కదలిక లేకుండా ఆ మహిళ బొమ్మ కనిపించింది. ఆ బొమ్మకు అచ్చం మనిషిలాగే దుస్తులు, బూట్లు వేసి, కళ్లజోడు పెట్టారు. చివరకు సీట్ బెల్టు కూడా బిగించి ఉంది. దాంతో లోపలున్న మహిళను రక్షించాలని అద్దాలు పగలగొట్టి చూశారు. తీరా చూస్తే బొమ్మ అని తేలింది. కానీ తన కారు అద్దాలు పగలగొట్టారంటూ పోలీసులపైనే కారు యజమాని ఫిర్యాదుచేశాడు. ఆ బొమ్మను తాను ఒక మెడికల్ ట్రైనింగ్ పరికరంగా ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. అర్ధరాత్రి 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎవరైనా కార్లను ఇలాగే వదిలేసి, అందులో అచ్చం మనిషిలాగే కనపడే బొమ్మలను ఉంచితే వాటి అద్దాలు తాము తప్పక పగలగొడతామని పోలీస్ చీఫ్ ఎల్ ఎడ్వర్డ్ మూర్ తెలిపారు.