న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజెంటర్ రష్దీని సభికులకు పరిచయడం చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి వేదికపైకి దూసుకొచ్చి వెనక నుంచి దాడికి తెగబడ్డాడు. కనీసం 10 సెకన్ల పాటు కత్తితో ఆయనను పదేపదే పొడిచాడు.
మెడ తదితర చోట్ల పది నుంచి పదిహేను దాకా కత్తిపోట్లు దిగినట్టు తెలుస్తోంది. దాంతో రష్దీ రెయిలింగ్‌ను ఊతంగా పట్టుకుని అలాగే కిందికి ఒరిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘రష్దీ చుట్టూ రక్తం మడుగులు కట్టింది. అయన కళ్ల చుట్టూ, చెంపల గుండా రక్తం కారింది. వెనకనున్న గోడ, సమీపంలోని కుర్చీతో పాటు పరిసరాలు కూడా రక్తసిక్తంగా మారాయి’’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ హఠాత్సంఘటనతో సభికులంతా బిత్తరపోయారు. సహాయకులు, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి కింద పడిపోయిన రష్దీని పైకి లేపారు. ప్రథమ చికిత్స తర్వాత హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో రష్దీ మెడపై గాయమైనట్టు న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు.
‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు దాడి జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి మాకెలాంటి సమాచారం లేదు’’ అని వెల్లడించారు. రష్దీని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి కూడా దాడిలో స్వల్ప గాయాలైనట్టు చెప్పారు. రష్దీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. దాడి అనంతరం అంతా రష్దీ చుట్టూ మూగగా దుండగుడు దర్జాగా వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక సభికులు, భద్రతా సిబ్బంది అతన్ని నిర్బంధించారు. దాడిపై సాహితీ ప్రపంచం నుంచి విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. జరిగింది మాటలకందని దారుణమని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ అన్నారు. రష్దీ ప్రాణాలతోనే ఉన్నారని ధ్రువీకరించారు. కడపటి సమాచారం అందేసరికి ఆయనకు ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం.
బెదిరింపులే ప్రసంగాంశం...
శుక్రవారం రష్దీపై జరిగిన దాడికి పశ్చిమ న్యూయార్క్ శివార్లలోని చౌటౌకా ఇన్‌స్టిట్యూషన్ వేదికైంది. అక్కడ రష్దీ ప్రసంగ అంశం కూడా బెదిరింపుల కారణంగా ప్రవాసులుగా మారిన రచయితలకు సంబంధించిందే కావడం విశేషం. వారి రక్షణకు కృషి చేస్తున్న పిట్స్‌బర్గ్ నాన్‌ప్రాఫిట్ సిటీ ఆఫ్ అసైలం అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ సభలో ‘మోర్ దాన్ షెల్టర్ (ఆశ్రయానికి మించి...)’ అనే అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉంది. అందులో భాగంగా బెదిరింపులు ఎదుర్కొంటున్న రచయితలకు అమెరికా ఆశ్రయంగా మారుతున్న వైనంపై కూడా చర్చ జరగాల్సి ఉంది.
‘‘రష్దీపై దాడి జరిగిందని తెలిసి షాకయ్యా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పాశ్చాత్య దేశాల్లో అత్యంత సురక్షిత పరిస్థితుల్లో నడుమ ఉన్న ఆయనపైనే దాడి జరిగిందంటే ఇస్లాంపై విమర్శనాత్మక ధోరణి కనబరిచే వారందరిపైనా దాడులు తప్పవు. చాలా ఆందోళనగా ఉంది’’
– తస్లీమా నస్రీన్
ఫత్వా పడగ నీడలో..
వివాదాస్పద రచయితగా పేరుపడ్డ రష్దీ 1947 జూన్ 19న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. రచయితగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చారిత్రక విషయాలతో పాటు వర్తమాన అంశాలకు ఆత్మాశ్రయ శైలిలో మనసుకు హత్తుకునేలా అక్షర రూపమివ్వడం ఆయన ప్రత్యేకత. 14 నవలలు, ఓ కథా సంకలనంతో పాటు పలు కాల్పనికేతర రచనలు చేశారు. ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం, దేశ విభజన దాకా సాగిన పరిణామాలను చిత్రించిన నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌కు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే మతాన్ని కించపరిచే రాతలు రాస్తున్నారంటూ 1980ల నుంచే రష్దీని వివాదాలు చుట్టుముట్టాయి. బెదిరింపులు మొదలయ్యాయి.
మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా 1988లో రాసిన నాలుగో నవల సటానిక్ వర్సెస్ పెను దుమారానికే దారితీసింది. పాకిస్తాన్ సహా పలు దేశాలు దాన్ని నిషేధించాయి. రష్దీని చంపుతామంటూ లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయి. ఫత్వాలు జారీ అయ్యాయి. రష్దీని ఉరి తీయాలంటూ ఇరాన్ ఆధ్యాత్మిక నేత అయతుల్లా ఖొమైనీ 1989లో ఫత్వా జారీ చేశారు. ఆయన్ను చంపిన వారికి 30 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామంటూ ఇరాన్ తదితర దేశాల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి! దాంతో 1989లో రష్దీ భారత్ వీడారు. జోసెఫ్ ఆంటొన్ అనే మారుపేరుతో తొమ్మిదేళ్లకు పైగా రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అందుకే తన జ్ఞాపకాలకు జోసెఫ్ ఆంటొన్ పేరుతోనే పుస్తక రూపమిచ్చారు. ఎప్పటికైనా చంపి తీరతామంటూ ఇరాన్ నుంచి తనకు ఏటా క్రమం తప్పకుండా ‘ప్రేమలేఖలు’ వచ్చేవని రష్దీ ఒక సందర్భంలో చెప్పారు.
బెదిరింపుల నేపథ్యంలో 1989 నుంచి 2002 దాకా బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నిరంతర భద్రత కల్పించింది. సాహిత్యానికి చేసిన సేవకు గాను 2007లో నైట్‌హుడ్ ఇచ్చి గౌరవించింది. ఈ అనుభవాలకు కూడా ‘ఫత్వా జ్ఞాపకాలు’గా రష్దీ పుస్తక రూపమిచ్చారు! 2000 అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అంతర్జాతీయ రచయితల సంఘానికి సారథ్యం వహించారు. బెదిరింపుల కారణంగా ప్రవాసంలో గడుపుతున్న రచయితల సంక్షేమం కోసం నడుం బిగించారు. రష్దీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. 30 ఏళ్లకు పైగా రష్దీ ఫత్వా పడగ నీడలోనే గడుపుతున్నారు. ఇటీవల భారత్ వచ్చేందుకు కేంద్రం వీసా నిరాకరించడం తననెంతగానో బాధించిందని చెప్పారాయన.
అనువాదకుల హత్య
సటానిక్ వర్సెస్‌ను అనువదించినందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు రచయితలు ప్రాణాలు కోల్పోయారు! జపనీస్‌లోకి అనువదించిన హిటోషీ ఇగరాషీని యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పొడిచి చంపారు. టర్కిష్‌లోకి అనువదించిన అజీజ్ నెసిన్‌పై జరిగిన బాంబు దాడి ఆయనతో పాటు మరో 36 మందిని కూడా బలి తీసుకుంది. ఇటాలియన్‌లోకి అనువదించిన ఎటోర్ కాప్రియోలో కత్తి పోట్ల బారిన పడ్డారు. నార్వే భాషలో ప్రచురించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. నిరంతరం భారీ భద్రత నడుమ బతకాల్సి వస్తోందంటూ రష్దీ పలుమార్లు ఆవేదన వెలిబుచ్చారు. కానీ ఆయనపై తాజాగా దాడికి భద్రతా లోపాలే ప్రధాన కారణమంటూ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన సాహితీ అభిమానులు వాపోవడం విషాదం.
Comments
Please login to add a commentAdd a comment