రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి
రైతు కుటుంబాన్ని పరామర్శించిన విద్యావంతుల వేదిక నాయకులు
అండగా ఉంటామని భరోసా
ఐనాపూరు, చేర్యాలలో రైతు రక్షణ యాత్ర
చేర్యాల : అన్నం పెట్టే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్.. ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తిలు అన్నారు. శుక్రవారం తెలంగాణ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రైతుల రక్షణ యాత్రను ప్రారంభించి, వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో ఐనాపూరుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజేందర్, చేర్యాలలో సర్పంచ్ ముస్త్యాల అరుణల అధ్యక్షతన వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను పలువురు రైతులు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక దృష్టికి తీసుకొచ్చారు.
రైతులు ఆత్మగౌరవంతో బతకాలి: కోదండరాం
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మగౌరవంతో బతకాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గ్రామస్థాయి నుంచి రైతు సమస్యలపై సంఘం ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటాలు చేయాలన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు వ్యవసాయరంగం ముఖ్యమైందన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే ఇవ్వాలని, బ్యాంకర్లతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చుతామని అన్నారు. కరువు ప్రాంతంలో పంట నష్టపరిహారం కింద ఒక్క ఎకరానికి 10 వేలు అందించాలన్నారు.
సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి: రవీందర్‌రావు
రైతులు గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాటం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు రవీందర్‌రావు అన్నారు. రైతు సమస్యలపై ఒంటరిగా పోరాటం చేస్తే సాధించలేమని అన్నారు. రైతులు ఒంటరి కాదని, మీ వెంట సమాజం ఉందని, మీకు తోడుగా ఉంటామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.