ఇందిరాపార్కు వద్ద టీపీఎఫ్ ధర్నాలో మాట్లాడుతున్న చుక్కా రామయ్య
హైదరాబాద్: పైసలు ఇచ్చే వాడికి ఓటు వేయను, సమస్యలపై పోరాడే వారికే ఓటేస్తామని చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఓటర్ల్లకు విజ్ఞప్తిచేశారు.ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలను నిలదీద్దాం, ప్రజాస్వామిక తెలంగాణను సాధిద్దాం అంటూ నవంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజాఫ్రంట్ చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర ముగింపు నేపథ్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ప్రజా అసెంబ్లీ, ధర్నా జరిపింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడారు.సీఎం కేసీఆర్‌కు ఉద్యమాలను నేర్పి, అధికార కుర్చీలో కూర్చోబెట్టిన ధర్నాచౌక్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత హైకోర్టు సడలింపుతో తిరిగి ఆందోళనలు సాగుతున్నాయని అన్నారు.ఎన్నికల వేళ ఓటుకు రూ.4 వందలు ఇస్తా అని ఒకరంటే రూ.15 వందలు అంటూ ఇంకొకరు వస్తున్నారని, డబ్బు ఉన్నవారే పోటీ చేయాలా? వారే అసెంబ్లీకి పోవాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు చదువుకు, భూమికి నోచుకోవడంలేదని, ఓటుకు డబ్బు ఇచ్చి గెలిచే నేతలు ఆ తర్వాత మూడు రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారు తప్పా, సేవ చేయరని అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు ఏ దేశాన్నీ ప్రగతి పథంలోకి తీసుకురాలేదని, స్వతహాగా బతికే విధానాలు తేవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాలపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో వాటిని తీర్చక పోవడం వల్లే ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రైతులు అప్పులపాలు కాని విధానం కావాలంటే రైతు బంధు అంటున్నారని, ఉద్యోగాలు వచ్చే శిక్షణ, నైపుణ్యం, ప్రమాణాలతో కూడిన చదువు కావాలంటే నిరుద్యోగభృతి అని మభ్యపెడుతున్నారన్నారు. కొత్తగా దాదాపు 20శాతం మంది యువకులు మద్యానికి అలవాటయ్యారని తెలిపారు. మద్యాన్ని నియంత్రిస్తామని ఏ పార్టీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలు గ్రామ, అసెంబ్లీ స్థాయిలో సమస్యల వారీగా మేనిఫెస్టోలను ప్రకటించాలన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటుల్లో నిబంధనల ప్రకారం సమావేశాలు జరగడం లేదని అన్నారు.
అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్లూ నియంత పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని సీఎం కేసీఆర్ నాశనం చేశారన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు నల్లమాస కృష్ణ మాట్లాడుతూ జైళ్లలో ఉండాల్సిన వారు ప్రజల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రజల్లో ఉండాల్సిన ప్రజాస్వామికవాదులను జైళ్లలో పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రజా అసెంబ్లీని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఖాసిం, పాశం యాదగిరి, ప్రొఫెసర్ లాల్‌టూ, వీక్షణం వేణుగోపాల్, లతీఫ్‌ఖాన్, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment