ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే! | today, national education day | Sakshi
Sakshi News home page

ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!

Published Mon, Nov 10 2014 11:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే! - Sakshi

ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!

విశ్లేషణ
 
మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకే వెలుగునిచ్చాయి. సామాజిక జీవనం మారకుండా పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబా లాంటి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.
 
విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయి. కానీ ఆ మార్పులన్నీ ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయన్నది కీ లకమైనది. విద్యలో మా ర్పులు, సాంకేతిక సమాచార రంగంలోని విప్లవా లు నేటికీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకు మరింత వెలుగునిచ్చాయి. అదే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ వర్గాలలో రావాల్సినంత మార్పు జరగలేదు. 20 శాతం మంది పేద వర్గాల విద్యార్థులకు ఈ విద్యా వెలుగులు అందకపోతే దేశాభివృద్ధి కుంటుపడిపోతుంది.
 
చరిత్రాత్మకమైన కొఠారి కమిషన్ మొట్టమొదటిసారి కామన్ స్కూల్ విధానాన్ని (సీఎస్‌ఎస్) ప్రవేశపెట్టింది. ఈ విధానంవల్ల సమాజంలోని ఆర్థిక అంతస్తులను తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కొఠారి కమిషన్ నిర్దేశించింది. జాతీయ సమగ్రతకు దోహదపడటం కోసం ఒక రాష్ట్రం విద్యార్థులను మరొక రాష్ట్ర విద్యార్థులతో కలపటం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రాథమిక దశలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బీసీ కులాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు, ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్నది కొఠారి కమిషన్ సూచనలలో కీలకమైనది. కానీ దీన్ని ఏవిధంగా అమలు జరపాలో చెప్పకపోవటం వలన అది కాగితాలకే పరిమితమైంది. 1986లో మానవ వనరులశాఖ ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు పూనుకున్నది. దీంతోనే 1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992లో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పునర్ విమర్శన చేసింది.

వెనుకబడిన వర్గాల పిల్లల నుంచి డిమాం డ్ లేనందున జాతీయ విద్యావిధానం (ఎన్‌పీఈ) అంతగా అమలుజరగలేదు. బీద పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పించటం వరకే అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. దీనివలన విద్యలో సమత్వం రా దని 1992లో ప్లానింగ్ కమిషన్ పునర్ సమీక్ష చేసిం ది. ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాల పిల్లలు బడికి వ చ్చేందుకై కొన్ని రాయితీలివ్వాలని తీర్మానించింది.
 
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రత్యేక హాస్టల్స్ తెరవాలని, గిరిజన ప్రాంతంలో ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలోనే బడులు ఏర్పాటు చేయాలని ఎన్‌పీఈ కమిషన్ సూచించింది. నవోదయ బడులలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజ ర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇవి అంతగా అమలు జరగలేదు. కారణాలు ఎన్నో.
 
ఎస్సీ, ఎస్టీ స్కూళ్ల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించకపోగా హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నా రు. ఎన్‌పీఈ సిఫార్సులు విద్యారంగంలో మరొక అంతస్తును సృష్టించాయి. ఆశ్రమ స్కూళ్లకు, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యత్యాసమే ఇంకో అగాధాన్ని సృష్టించింది. జనరల్ స్కూళ్లలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా వారి స్థితిగతులను మార్చకుం డా పాఠశాలల్లో చేర్పించినా వారిని నిలబెట్టుకోవటమే కష్టమైపోయింది. మొదటి తరగతిలో చేరిన వాళ్లు రెండో తరగతి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2013-14 విద్యాసంవత్సరంలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులలో 22.23 శాతం, 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 32.56 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన విద్యార్థుల సంఖ్య 38.21 శాతంగా ఉన్నాయని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పేర్కొంది. ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా డ్రాప్ అవుట్ల సంఖ్య కనిపిస్తుంది.
 
ఆ డ్రాప్ అవుట్ విద్యార్థులను పట్టించుకోకపోవటం వలన వారు చదువులో వెనుకబడిపోయారు. ఎన్‌పీఈ వలన 20 శాతం వర్గాల ఆడపిల్లల చదువులో మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల ఆడపిల్లల చదువులో అంతగా మార్పు రాలేదు.
 
సామాజిక జీవనం మారకుండా ఆ పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబాలాం టి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. అట్టడుగు వర్గాలలో చైతన్యం కలిగించి వారిని విద్య వైపు మళ్లిం చాలి. భారతదేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడికిరాని పిల్లల పైన ప్రత్యేకంగా విచారించే యంత్రాంగం కావాలి. డ్రాప్ అవుట్స్‌కు విరుగుళ్లు వెతకాలి.
 
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement