వాణిజ్యం సంకెళ్లలో జ్ఞానం
విద్యను వినియోగ వస్తువుగా మార్చడం వలన బలౌతోంది ఎవరు? వర్సిటీలు జ్ఞాన సముపార్జనా కేంద్రాలుగా ఉండాల్సినది పోయి విద్య, పరిశోధన వాణిజ్యాన్ని వృద్ధి చేయాలా? జ్ఞానం మార్కెట్లో అమ్ముడు పోయే వినియోగవస్తువా?
తార్కిక శక్తి అణచివేతకు గురయ్యే దేశాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. తార్కిక శక్తి సామాజిక ఉద్యమాలకు తోడ్పటమే కాదు, పరిశోధ నల ద్వారా సమాజ పురోభి వృద్ధికి ఎనలేని ఉపకారం చేయగలుగుతుంది. శాస్త్ర పరిశోధనలు ముందు కలుగ బోయే ప్రయోజనాలనో, లాభాలనో దృష్టిలో పెట్టుకొని లేదా ఫలితాలను ముందుగానే ఊహించి జరిపేవి కావు. ఒక అంశంపై పరిశోధన చేస్తుండగా అనుకున్నదాన్నిగాక మరెన్నో విషయాలను ఆవిష్కరించిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఆ పరిశోధనల ఫలితాలు సమాజా నికి ఉపయోగపడుతున్నాయా లేక ఒక వర్గానికే ఉపకరిస్తున్నాయా? అన్నదే నేటి చర్చ.
19వ శతాబ్దం వరకు యూరప్‌లో అద్భుతమైన పరిశోధనలు జరిగి, ఖండాంతరాల మధ్య దూరాలు తగ్గిపోయాయి, కలసిపోయాయి. 20వ శతాబ్దం చివరి కల్లా వనరుల కొరత, యూనివర్సిటీలపై పాలకుల, పాలనాయంత్రాంగం ఒత్తిడి పెరిగాయి. పరిశోధనలపై మార్కెట్ శక్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం మొదలైంది. క్రమంగా విశ్వవిద్యాలయాలు మార్కెట్ శక్తుల అధీనంలోకి పోయి, వాటికి తోడ్పడే కొత్త ఆలోచనా విధానం ప్రవేశించింది. పరిశోధనల ఫలితంగా వెలువడే జ్ఞానానికి స్వార్థాన్ని జోడించాలనే కొత్త 'నీతి' పుట్టింది. జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలంటే లాభాపేక్ష, స్వార్థపరత్వం అవసరమన్నారు. తగిన ధర ఉంటేనే దేనికైనా గౌరవం, విలువన్నారు. వర్సిటీల్లో, పరిశోధనా కేంద్రాల్లో జరిగే ఏ పరిశోధనైనా ఏదో ప్రతిఫలాన్ని ఆశించి జరగాల్సిందేననడం మొదలైంది.
విశ్వవిద్యాల యాల పరిశోధనలకు ధర కట్టడం ఇలాగే ప్రారంభమైం ది. దానికి తగ్గ భాష, సంస్కృతి కూడా పుట్టుకొచ్చాయి. విద్యార్థిని వినియోగదారుడనడం ప్రారంభించారు. దీంతో విద్యాబోధనకు, పరిశోధనకు లాభార్జన లక్ష్యం సమంజసమైనదిగా మారిపోయింది. పరిశోధనల్లో వెల్లడైన జ్ఞానాన్ని ఉత్పత్తి అన్నారు. కాబట్టి ఆ ఉత్పత్తికి యజమాని, యాజమాన్యపు హక్కు, అధికారం లేదా పేటెంట్ ఉండటం సహజమైంది. ఉంటే అందులో శ్రమ ఉంటుంది. ఇలా సామాజికాభివృద్ధి ఫలితంగా, సామా జిక సంపదగా ఉన్న జ్ఞానంపై గుత్తాధికారం నెలకొనడం పుంజుకుంది.
విద్యార్థిని వినియోగదారునిగా మార్చడంతోనే విద్య వినియోగ వస్తువుగా మారింది. ఈ విద్యా వ్యాపారంలో పరిశోధకుడు కూడా ఒక భాగస్వామి. ఇక్కడే అసలు సమస్య ఆరంభం అవుతుంది. పరిశోధనలు సాగించిన విద్యార్థి, నేను తయారుచేసిన పరిశోధనా ప్రాజెక్ట్ నివేదికల వల్లే ఫలితం వచ్చింది. కనుక నేనూ భాగస్వామినే అని కోర్టులో దావా వేశాడు. దీంతో విద్యార్థిని కూడా భాగస్వామిగా ఒప్పుకున్నారు. పరిశోధనకు అవకాశాలను, పరిస్థితులను సమకూర్చిన యూనివర్సిటీ తాను ఆ ప్రత్యేక జ్ఞానం ఉత్పత్తికి కారణం కనుక తనకూ అందులో వాటా దక్కాలని వర్సిటీ పట్టుబట్టింది. జ్ఞానం యాజమాన్యంలో వర్సిటీ, ప్రొఫెసర్లు, విద్యార్థులు అంతా భాగస్వాములయ్యారు. విశాలమైన జ్ఞానం విస్తృతిని కుదించారు. అపారమైన విజ్ఞానానికి సంకెళ్లు వేశారు.
మన ప్రభుత్వాలు, పాలకుల ప్రధాన ధోరణి మార్కెటీకరణే కనుక అవి ఈ జ్ఞానం మార్కెట్‌ని ప్రోత్స హించాయి. విశ్వవిద్యాలయాలు తమకు తామే నిధు లను సమకూర్చుకోవాలనే భావన ఇలాగే ఉత్పన్న మైంది. ప్రభుత్వం ఆ బాధ్యతను వదుల్చుకుని విద్యా విపణిలో లాభాలు తెచ్చిపెట్టే ప్రొఫెసర్లనే నియమి స్తోంది. విద్యార్థికి నాణ్యమైన విద్యను, జ్ఞానాన్ని అందించే గీటురాయికి కాలదోషం పట్టింది. విశ్వవిద్యా లయాలకు ఆదాయం సమకూర్చడమే ప్రొఫెసర్ల జ్ఞానా నికి, బోధనా నైపుణ్యానికి గీటురాయిగా మారింది. పరిశోధనకు, విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. ఏ పరిశోధనలైతే లాభదా యకమో అటువంటివే జరుగుతున్నాయి. ఏ సబ్జెక్ట్ వాణిజ్యపరంగా లాభదాయకమైతే దానికే ప్రాధాన్యత నివ్వడం మొదలైంది. వృత్తిపరమైన జ్ఞాన సాధనే పరమావధిగా మారింది. తరగతి గది బోధన ప్రాధాన్యం కోల్పోయింది. బోధనలో అనుభవం లేని వారికి ఆ బాధ్యతలు అప్పగించేస్తున్నారు. ప్రొఫెసర్లను పరిశోధనా వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవడం పెరిగింది. డబ్బు సంపాదనను బట్టి యూనివర్సిటీల ర్యాంకింగ్ మొదలైంది. విద్యార్థిని గాలికి వదిలేశారు. అసలు పరిశోధనే జరగకున్నా ఆదాయం వస్తే చాలనుకుంటున్నారు.
ఒకప్పుడు నిస్వార్థంగా విద్యాదానం కోసం స్థాపించిన ప్రైవేటు కళాశాలలు లాభాలనిచ్చే పాడి గేదెలయ్యాయి. ఏ మెడికల్ కాలేజీలోనైనా నేడు 30 నుంచి 40 శాతం మేనేజ్‌మెంట్ సీట్లుంటాయి. అవి యాజమాన్యాలకు ఆదాయ వనరుగా మారాయి. అభి వృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలను అమ్ముకుంటుంటే, వెనుకబడిన దేశాల్లో సీట్లు అమ్ముకుంటున్నారు. ఎక్కడైనా బలైంది విద్యార్థులే. పరిశోధనలు ప్రైవేట్ పరం కావడంతో బోధన దెబ్బతిన్నది. సీట్లు అమ్ముకో వడంతో కాలేజీల సంస్కృతి మారిపోయింది. విద్యను వినియోగ వస్తువుగా మార్చడం వలన బలౌతోంది ఎవరు? విశ్వవిద్యాలయాలు జ్ఞాన సముపార్జనా కేంద్రాలుగా ఉండి, మానవతావాదాన్ని పెంపొందిప జేయాల్సింది పోయి విద్య, పరిశోధన వాణిజ్యాన్ని వృద్ధి చేయాలా? జ్ఞానం మార్కెట్లో అమ్ముడు పోయే వినియోగవస్తువా? అదే నిజమైతే రేపు గాలి, నీరు సైతం మార్కెట్లో కొనుక్కోవాల్సిన వస్తువులయ్యే ప్రమాదం ఉంది. ఆ రెండు సరుకులపై పేటెంట్ హక్కు ఎవరిదంటారో?
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)