‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం | weight will never happen on basic education of kids | Sakshi
Sakshi News home page

‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం

Published Wed, Jun 24 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం

‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం

పసి పిల్లలకు తరగతి గదుల్లో అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా చెబుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆ పట్టింపే లేకుండా పసివాళ్లకు కేజీ తరగతులను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొల గించేలా దాన్ని సంస్కరించాలి. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ రంగంలోని కేజీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.  
 
 ఇప్పుడు అమల్లో ఉన్న తర గతి గది బోధనా పద్ధతుల్ని పటిష్టం చేసి, విద్యను సామా జికీకరణ చేయాలనే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఓ కొత్త ప్రయోగాన్ని తెలంగాణ విద్యారంగంలో  మొదలుపె ట్టారు. ఇప్పటి వరకూ మన శ్రద్ధంతా సెకండరీ విద్యపైనే కేంద్రీకరించడం జరిగింది. మారిన పరిస్థితులకు అను గుణంగా కేజీ విద్యపైకి తెలంగాణ ప్రభుత్వం దృష్టి మరల్చింది. పరీక్షా విధానంలో సైతం దేశంలో మరె క్కడా చేపట్టని పలు సంస్కరణలను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇంతవరకు ఒకే లోపభూయిష్ట విద్యా విధానం అమలవుతూ వచ్చిన తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రా లకు సైతం ఈ నూతన వైఖరి అనుసరణీయమైనది. ప్రత్యేకించి నేటి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీ చదువులను ప్రభుత్వ విద్యారంగం పరి ధిలోకి తేవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగంలో విజయం సాధిస్తే తెలంగాణ దేశానికే ఆదర్శ నమూనా అవుతుంది.
 
 మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లల కోసం ప్రత్యే కంగా పిల్లలను కేజీ స్కూళ్లలో చేర్చే దేశవ్యాప్త సంప్రదా యానికి మధ్యతరగతి లేక సంపన్న వర్గాలు శ్రీకారం చుట్టాయి. అలా తరగతి గదుల్లో అంత చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా ఎప్ప టి నుంచో చెబుతున్నారు. కానీ ప్రైవేట్ యాజమా న్యాలు ఆ పట్టింపే లేకుండా పసి పిల్లలకు కేజీ తరగతు లను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పైగా వారికి ఇంచుమించు ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాలనే బోధి స్తున్నారు. 3 నుండి 6 ఏళ్ల వయసు పిల్లలకు అక్షరం నేర్ప డం కన్నా ఇంద్రియాల శిక్షణే అవసరం. ‘సర్వేంద్రి యానాం నయనం ప్రధానం’ అంటాం. కాబట్టి ఇంద్రి యాలకు శిక్షణనివ్వాలి. దృష్టి సరిగా ఉంటే వస్తువుల లోని తేడాలను గుర్తించగలుగుతారు. అంటే ఆ వయసు పిల్లలు వస్తువుల రంగు, ఆకారం, విస్తీర్ణం, పరిధుల లోని తేడాలను గుర్తించగలిగేటట్లు చేస్తే సరిపోతుందా? ఇదంతా దృష్టి చేసే పరిశీలన మీదనే ఆధారపడినది. అనగా ‘నేను చూస్తున్నాను’, ‘నేను పరిశీలిస్తున్నాను’, ‘నేను అధ్యయనం చేస్తున్నాను’ అన్నవి మూడూ కంటికి సంబంధించినవి. కంటి శిక్షణపై ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. అదే మాదిరిగా ‘నేను వింటున్నాను’, ‘నేను ఆలకిస్తున్నాను’. ఈ రెండింటి లోనూ వస్తువుల మధ్య తేడాను గుర్తించడం కన్ను, కంటి చూపులపై ఆధారపడి ఉంటాయి. ఇదే మాదిరిగా నాలుకకు శిక్షణ ఇవ్వటాన్ని ఎంతగా సంస్కరిస్తే విద్యా ర్థుల ఆలోచన అంతగా పదునెక్కుతుంది. కాబట్టి అన్ని దేశాల్లోనూ కేజీ స్కూళ్లపై దృష్టిని కేంద్రీకరించారు.
 అందుకు భిన్నంగా మన పట్టణాల్లోని మార్కెట్ శక్తులు లాభాపేక్షే లక్ష్యంగా కేజీ స్కూళ్లను పెట్టాయి. నిపుణుల సూచనలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా స్కూళ్లను నడిపి డబ్బు రాబట్టే వ్యవస్థగా ప్రైవేట్ స్కూళ్ల వ్యవస్థ మారింది. ఈనాడు కేజీ స్కూళ్ల ఫీజు లక్ష రూపాయల దాకా పోయింది. దానికి కూడా రికమండేషన్ లేకపోతే సీటు దొరకని దశను తీసుకొచ్చారు. పసిపిల్లల మనోవికా సాన్ని దెబ్బతీసేలా అక్షరాలు నేర్పడానికి తోడు ఉపా ధ్యాయులకు సరైన అర్హతలు, శిక్షణ కొరవడుతున్నాయి. దీంతో ఇప్పుడున్న కేజీ స్కూళ్లు విదేశాల్లోలాగా వాటి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నాయి.  
 
 మొత్తంగా చూస్తే నేడు విద్యారంగంలో కేజీ స్కూళ్ల ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్య కేవలం రాజకీయ నినాదం కాదు. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా విద్యారం గంలో తీసుకురావాల్సిన సంస్కరణగా ప్రభుత్వం రం గంలోని కేజీ విద్యను గుర్తించాలి. కేజీ నుంచే నాణ్యమైన విద్యను సామాన్యుల పిల్లలకు అందుబాటులోకి తీసుకు రావాలనే కోరికను ప్రత్యేకమైనదిగా చూడాలి. మారు మూల గ్రామాల్లోని నిరుపేదల పిల్లలకు సైతం దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కేజీ విద్య ప్రైవేటు యాజమాన్యంలో ఉండటం వలన ఫీజులు విపరీతంగా పెరిగాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం గుర్తించ టం వల్ల విద్యారంగానికి గొప్ప మేలు జరుగుతుంది. కేజీ విద్యను పేదవానికి అందుబాటులోకి తేవడం మాత్రమే కాదు, ప్రమాణాలను కాపాడాలి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొలగించేలా దాన్ని సంస్క రించాలి. ఆ లక్ష్యానికి తగినట్లు శిక్షణ పొందిన ఉపా ధ్యాయులను నియమించాలి. కేజీ విద్యావ్యవస్థను పూర్తి ప్రభుత్వ అజమాయిషీలో ఉంచాలి. కామన్ స్కూల్ సిస్టంను తీసుకురావాలి. దాని వల్ల శ్రీమంతుల పిల్లలైనా, పేదల పిల్లలైనా పసితనం నుంచే వివక్షతకు గురికాకుండేలా చూసి, అందరిలో సమానత్వ భావనను కల్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక సమానత్వానికి బీజం పడే అవకాశం ఏర్పడుతుంది.
 
 కేజీ స్కూళ్లను ప్రభుత్వపరంగానే నెలకొల్పి, ప్రతి వారూ నిర్బంధంగా ఈ ప్రభుత్వ బడులకే పిల్లలను పం పేలా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని గ్రామ పంచాయతీలకే అప్పగించాలి. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలోని స్కూళ్లకు ఎంత మంది పిల్లలు వస్తు న్నారో నమోదు చేయాలి. కేజీ స్కూల్‌పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడు కేజీ విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక విద్యలో భాగమైన కేజీ చదువులో అంతరాలకు తావు లేకుండా పోతుంది.
 (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement