‘ముప్పు’నకు పరిష్కారం | Chukka Ramaiah writes on America visas issue | Sakshi
Sakshi News home page

‘ముప్పు’నకు పరిష్కారం

Published Tue, Feb 7 2017 12:30 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

‘ముప్పు’నకు పరిష్కారం - Sakshi

‘ముప్పు’నకు పరిష్కారం

విశ్లేషణ
నేటిలా మన సేవారంగం అనిశ్చితిని ఎదుర్కోకుండా ఉండాలంటే దేశీయ అవసరాలపై దృష్టి పెట్టి, సర్కారీ విద్యాలయాలలోని మానవ వనరులను అభివృద్ధిపరస్తే దేశీయ సేవారంగానికి గట్టి పునాదులు పడతాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి ఆధు నిక అతివాదుల దూకుడుకు కళ్లెం వేయగల మూలాలు మన విద్యా వ్యవస్థలో ఉన్నాయి. వేల కోట్ల డాలర్ల ఎగుమతులతో పెనవేసు కున్న మన సేవా రంగంలో ట్రంప్‌ విధానాల కారణంగా కుదుపులొస్తున్నాయని ఆందోళన పడుతున్నారు. అయితే మన విద్యా వ్యవస్థ మూలాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుంటే మన సేవా, ఉత్పత్తి రంగాలు ట్రంప్‌ వంటి అతివాదులకు జవాబు చెప్పగలవు.

మనం జ్ఞాన యుగంలో ఉన్నాం. ఇలా శాస్త్ర, సాంకేతిక రంగాలలో జరుగుతున్న అన్వేషణ, పరిశో ధన కారణంగా మానవ ప్రగతికి దోహదం చేసే ఆవిష్కరణలను మనం చూస్తున్నాం. మానవ మేధస్సు, శ్రమ, సంపదగా మారితేనే దేశ ప్రగతికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయ  దేశ ఆదాయంలో సింహభాగం వ్యవసాయరంగానిదే. సేవా రంగం అప్పుడు నామ మాత్రమే. అయితే క్రమంగా మానవ అవసరాలు పెరగడం, విజ్ఞాన మథనం జరగడంతో పారిశ్రామిక రంగం వృద్ధి మొదలైంది. ప్రపంచంలో పారిశ్రామికంగా పరుగులు పెడుతుండటంతో మనమూ ఆ ఫలాలను అందు కోవాలనే ప్రయత్నం చేశాం. దీనితో వ్యవసాయ రంగం ఆదాయం పారిశ్రామిక రంగం అధిగమిం చింది.

అయితే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తికి అపారంగా మానవ వనరులు. శ్రామిక శక్తిని తగ్గించి వ్యయ నియంత్రణ ద్వారా అధిక లాభాలని ఆర్జించాలన్న ఆలోచనతో ‘ఆటోమేషన్‌’ ప్రక్రియ మొదలైంది. ఆటోమేషన్‌ ద్వారా శ్రామికుల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. అదే సమయంలో మన జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాన్ని సాధించే ప్రయత్నాలు ఊపందు కోవడంతో 20వ శతాబ్దంలో సేవా రంగం పుంజుకున్నది. దీనికి తోడు సేవా రంగ వ్యాప్తికి ఎల్లలు లేకపోవడంతో వాణిజ్య అవకాశాలు ఖండాలు, సము ద్రాలు దాటిపోయి విస్తృతమయ్యాయి. ప్రపంచంలోని మారుమూల అవకాశాన్నయినా ఆదుకునేందుకు ప్రపంచీకరణ వీలు కల్పించింది. మన సేవా రంగ వృద్ధి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఎప్పుడో దాటి పోయింది. కానీ అమెరికా గద్దెపై ట్రంప్‌ వంటి వారున్నప్పుడు సేవా రంగం తల్లడిల్లే ప్రమాదం ఉంది. దీనికి పరిష్కారం మనం వెకతవలసి ఉంది.

ఇటువంటి సవాళ్లకు మన ప్రభుత్వ పాఠశాలల్లో సమాధానం ఉంది. గతంలో చదువులకు సంపన్న వర్గాల పిల్లలు వచ్చేవారు. అప్పుడు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేది. కాబట్టి సర్కారీ స్కూల్స్‌ లోనే చేరేవారు. పాఠ్య పుస్తకాలల్లోని విజ్ఞనాన్ని తెలుసుకుని అవే ఆధారంగా ముందుకు వెళ్లేవారు. పాఠ్య పుస్తకాలలో పేదరికం గురించి చదువుకుని చలిం చి పేదరిక నిర్మూలనకు మార్గాల అన్వేషణ జరిగేది. అలాగే రైతాంగం వ్యవసాయంలో ఎంత దిగుబడి చేస్తుందో తెలుసుకుని దానిని పెంచే మార్గాలు ఆలో చించేవారు. ఇక్కడ ఒక పరిమితి ఉంది. సంపన్న వర్గాల పిల్లలకు స్వీయ అనుభవం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు నేందుకు వస్తున్న పిల్లల నేపథ్యాలు వేరు, ఆర్థిక, సామాజిక పూర్వ రంగం వేరు. నేటి పిల్లలు శ్రామికవర్గం నుంచి, సామాజికంగా వెనుకబడిన తరగతుల నుంచి, అట్టడుగు శ్రేణి నుంచి వచ్చారు. నిర్బంధ ఉచిత విద్య హక్కు కారణంగా ఈ వర్గాల పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది.  

ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు శ్రామిక వర్గం నుంచి వచ్చినందు వల్ల వారికి  పేదరికం,  వ్యవసాయ రంగంలోని సమస్యలు తెలుసు. శ్రామిక, అల్పాదాయ వర్గాల సమస్యలు తెలుసు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం పట్ల వారిలో ఆర్తి ఉంటుంది. వాటి పరిష్కారం పట్ల అంకిత భావం ఉంటుంది. దీనిని పాఠ్య పుస్తకాలకు మించిన జ్ఞానంగా మనం ఎందుకు పరిగణించకూడదు?  ఈ వర్గం పిల్లలకు ఇప్పుడు చదువుకునే అవకాశం లభించి ఆలోచించే శక్తి, అభ్యసించే సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం ఏర్పడతాయి. ఈ వర్గాలను గొప్ప మానవ వనరులుగా పరిగణించి పాఠ్య పుస్తక రచనలు, బోధనా వ్యూహాలు, పరిశోధనావకాశాలు కల్పిస్తే అద్భుత అవిష్కరణలు వెలుగుచూస్తాయి.  తెల్లవారు జామున వెళ్ళి చీకటిలో కరెంట్‌ లేదనుకుని పైపును తాకి మరణించిన తండ్రి దుస్థితి మరో  రైతుకు రాకూడదని కరెంట్‌ వస్తే వెలిగే లైటు, అలారం మోగే విధానాన్ని ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి రూపకల్పన చేశాడు. ఇలా స్థానిక పరిస్థితులు, వనరులు, అవసరాల రీత్యా ఎన్నో ఆవిష్కరణలకు అవకాశం ఉంది. ప్రస్తుతం మనం పరాయి దేశాల సమ స్యలకు పరిష్కారం చూపగల నైపుణ్యం గల యువత ను తయారు చేసే పనిలో ఉన్నాం. కానీ నేటిలా అనిశ్చితిని ఎదుర్కోకుండా దేశీయ అవసరాలపై దృష్టి పెట్టి, సర్కారీ పాఠశాలలు, కళాశాలల్లోని మానవ వనరులను ఇందుకు కార్యస్థలిగా పరిగణిస్తే మన సేవారంగానికి గట్టి పునాదులు పడతాయి. దీని ఆధారంగా పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగాలకు పూర్వ వైభవం వస్తుంది.

- చుక్కా రామయ్య
–వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement