సమ్మె ఆపేది లేదు: జూడాలు
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్‌లు మీడియాతో మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొన్నారు. తమ సమ్మె వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని ఆరోపించడం సరికాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
వైద్యవిద్య ప్రైవేటీకరణ వల్లే: చుక్కా రామయ్య
వైద్యం ప్రైవేటుపరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజామద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని వారికి సూచించారు. పేదరోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు.
జూడాల తల్లిదండ్రులకు నోటీసులు
గత నెలరోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డిబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. ఈ మేరకు తమ కళాశాలలో చదువుతన్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే విధులకు హాజరు కావాలని, లేకుంటే డిబార్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు తమకు నోటీసులు అందినట్లు గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థుల తల్లితండ్రులు మీడియాకు తెలిపారు.