ఎంసెట్ కొనసాగించాలా? | Intermediate syllabus.. EAMCET | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కొనసాగించాలా?

Published Mon, Feb 9 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

ఎంసెట్ కొనసాగించాలా?

ఎంసెట్ కొనసాగించాలా?

 ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువును కొనసాగిస్తే మరింతగా మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.
 
 రెండు రాష్ట్రాలు ఏర్పడి, ప్రజలు తమ స్థితిగతులు మారుతాయని ఆశిస్తున్న తరు ణంలో ప్రతి చిన్న విషయానికి వివాదాలలోకి వెళ్లటం రాజ కీయ నాయకులకు సరైన పద్ధతి కాదు. ఇద్దరు చంద్రు లైన నాయకులు రెండు ప్రాం తాల ప్రజల హృదయాలపై అన్నివిధాలుగా ముద్ర వేసినవారు. వీరిద్దరూ రెండు ప్రాంతాల ప్రగతిని కోరు కునేవారనే భావన కూడా ఉంది. పాలనా యంత్రాం గంలో చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. వాటిని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పత్రికలకు ఎక్కకుండా పరిష్కరించుకుంటే తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా హర్షిస్తారు. దేశాలకు దేశాలు విడిపోయిన ఘటన లున్నాయి. ఆ దేశాల మధ్య తిరిగి వచ్చే సమస్యలను రచ్చకెక్కకుండా పరిష్కరించుకున్న ఉదంతాలు లేవా?
 
 తెలుగు ప్రజలు ఉద్రిక్త వాతావరణాలను కోరుకోవటం లేదు. ఉభయులు కూడా కలిసి ఇరు రాష్ట్రాలను ప్రగతిపథం పైకి నడిపిస్తే వారికి స్టేట్స్‌మెన్ లన్న పేరు వస్తుంది. విడిపోకముందు ధీరులుగా పోరాడటం, విడిపోయిన తర్వాత అంకిత స్వభావంతో ప్రజలను అభివృద్ధి పథంపైన నడిపించడం రాజనీ తిజ్ఞుల లక్షణం. ప్రతి చిన్న విషయానికి పత్రికలకెక్కటం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు సంబంధించిన ఎంసెట్ పరీక్షపై కూడా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉన్నదా? రాష్ట్రాలు విడిపోయాయి. తమ ప్రాంత నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్‌ను ఎలా నిర్వహించుకోవాల్నో ఈ రెండు ప్రభుత్వాలు నిర్ణయిం చుకోలేవా? ఈ చిన్న విషయానికి కూడా కేంద్రంతో, గవర్నర్‌తో అక్షింతలు వేయించుకోవాలా?
 
 ముఖ్యంగా 21వ శతాబ్దాన్ని కేవలం యువకులకు ఉపాధి కలిగించేదే కాక సంపదను సృష్టించేదిగా కూడా పరిగణిస్తున్నారు.యువకుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను, మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా ఆ నైపుణ్యాలను నిత్యం పదును పెట్టుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రవేశానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి. ఎంసెట్ పరీక్ష ఇంటర్మీడియెట్ పూర్తి అయిన విద్యార్థులకే నిర్వహించాలా? ఈ రెండేళ్ల విద్యార్థులు 12వ తరగతికి రాకముందే వారికి ఎంసెట్-శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కదా! అదే మాదిరిగా ఎంసెట్ పరీక్షను ఇంటర్మీడియెట్ పరీక్షతో ముడిపెట్టవలసిన పని లేదు. ఇంటర్ పరీక్ష లక్ష్యం వేరు. ఇంటర్మీడియెట్ పరీక్షలో పాఠ్యాంశాలను పరీక్షిస్తారు. ఎంసెట్ పరీక్షలో ఇంజనీరింగ్‌కు కావల్సిన నైపుణ్యాలను పరీక్షించాలి. అంటే విద్యార్థులకు తార్కికమైన నైపుణ్యం ఏ మేరకు వచ్చింది? లేదా గణితశాస్త్రపరమైన విశ్లేషణ వచ్చిందా? లేదా సామాజిక దృక్పథం వచ్చిందా? ఇలాంటి ఎన్నో నైపుణ్యాలను విద్యార్థుల 11ఏళ్ల నేపథ్యాన్ని గమనంలోకి తీసుకుని ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకోలేమా?
 
 ఎంసెట్ పరీక్ష అంటే సీట్లు నింపుకోవడానికి కాదు. విద్యార్థికి ఇంజనీరింగ్ విద్యపై ఏ మేరకు ఆసక్తి ఉన్నదో, కనీస నైపుణ్యం ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ఈ ఎంసెట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో 20 ఇంజనీరింగ్ కాలే జీలు మాత్రమే యోగ్యత కలవని ఉన్నత విద్యామండలి  చెప్పడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ముందుకు వస్తున్నారు. క్లర్క్ ఉద్యోగం నుంచి కండక్టర్ ఉద్యోగం వరకు ఎంతో మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షను రద్దు చేస్తే ఇంటర్మీడియెట్ వ్యవస్థపైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతి తల్లీతండ్రీ ఈ 20 కాలేజీల అడ్మిషన్ల కోసమే తమ పిల్లలకు మంచి ర్యాంకు కావాలని కోరుకుంటారు. ఇంటర్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్ పరీక్ష కూడా కొన్ని వందల కేంద్రాల్లో మారు మూల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షా విధానం గత కొన్ని దశాబ్దాల నుంచి కార్పొరేట్ రంగం చేతుల్లోకి పోవటం వలన ఎన్నో అవకతవకలకు దారితీసింది.
 
 ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తే మరింత మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. మద్రాసులో ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేశారు. తెలంగాణ  రాష్ట్రంలో కూడా మొదట  విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ కాదు. ఈ మధ్యకాలంలో ఎంసెట్ పరీక్షను కొనసాగిస్తేనే అటు ఇంటర్ విద్యను ఇటు ఇంజనీరింగ్ విద్యను బాగు చేసు కునే అవకాశం దొరుకుతుంది. అన్ని రంగాల మాదిరి గానే విద్యారంగాన్ని కూడా గత ప్రభుత్వాలు అతలా కుతలం చేశాయి. ఫీజురీయింబర్స్‌మెంట్ పేదలకు ఉపయోగపడుతుందనుకుంటే అది కార్పొరేట్ రంగాల కు సంజీవనిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వానికి ఇంటర్ విద్యను, ఇంజనీరింగ్ విద్యను బాగుపరుచుకోవాలంటే ఎంసెట్‌ను కొంతకాలం సమర్థ వంతంగా కొనసాగించవలసే ఉంటుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.
 
 సందర్భం: చుక్కా రామయ్య, (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
     శాసన మండలి మాజీ సభ్యులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement