కాడి వదిలేసిన చోటినుంచే దున్నాలి | Caste and Religion | Sakshi
Sakshi News home page

కాడి వదిలేసిన చోటినుంచే దున్నాలి

Published Fri, Jan 23 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

చుక్కా రామయ్య

చుక్కా రామయ్య

 సందర్భం
 తెలంగాణలో కులం కొంద రికి యావజ్జీవశిక్ష. మరికొం దరికి కులం సాధనం. వృత్తి విభజన మాత్రమే కులం కాదు. పునాదులను పెకిలిస్తే తప్ప కులం అసలు మూలాలు అర్థం కావు. కులం మర కలు మలపడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. దానికి అకుంఠిత దీక్ష అవసరం. తెలంగాణ ఊరి నిర్మాణంలోనే కులం ఉంది. ఊరి మధ్యలో పాలనా యంత్రాంగ కేంద్రమైన గడీ, దాని తర్వాత పాలనా యంత్రాంగానికి దగ్గరగా ఉండే వర్గం, దాని చుట్టూ కుల వృత్తి చేసుకునే వర్గం ఉంటాయి. వారి ఇళ్లు దాటిన తర్వాత రైతులుం టారు. వీటిలో ఏ వర్గానికీ చెందని వర్గం కూడా ఉంది. అదే దళిత వర్గం. ఊరికి ఒక మూల మాలలు, మరో మూల మాదిగలు ఉంటారు. వీటిలో ఒక కులాన్ని వ్యవ సాయానికి, మరో కులాన్ని వెట్టికి ఉపయోగించుకుం టారు. ఆంధ్ర మహాసభతో కలసి పనిచేసేటప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలంటే, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యంతోనే అది సాధ్యం అని భావించాం.

 ఉద్యమ కార్యకర్తను అయినప్పటికీ కులానికి బ్రాహ్మణుడిని కావడంతో దళితులు నన్ను తమ ఇళ్లలోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. వారిళ్లలోకి బలవంతంగా చొచ్చుకుపోవల్సి వచ్చినప్పుడు వారిలోని బానిసత్వం, దుర్భర దారిద్య్రం మరింతగా అర్థమైంది. చివరికి  వారి అసలు పేరును కూడా కుల దురహంకారం మింగివేసి మల్లయ్యను మల్లిగాడు, మల్లమ్మను మల్లి అని పిలుస్తూ పుట్టుకతోనే బానిసలుగా భావించే వారు. ఆ బానిస త్వాన్ని అడుగడుగునా గుర్తుచేయడానికి భూస్వాములు మల్లిగా అని పిలిచిన ప్రతిసారీ ‘బాంచెన్ దొర, నీ కాల్మొ క్కుతా’ అని పలకడం అలవాటు చేశారు. ఆ అణచివేతే, ఈ వెలివేతే తిరుగుబాటుకు కారణమైంది. అదే సాయు ధపోరుకు దారితీసింది. ఇది 1940-47 నాటి సంగతి. ఆ కాలంలోనే కొలనుపాక లాంటి చోట్ల జాగీర్దారు ముస్లిం. దీంతో ఆ ప్రాంతంలో అస్పృశ్యత నుంచి విముక్తి కోసం దళితులు జాగీర్దారు మతంలోకి చేరిపోయారు. దీన్ని అడ్డుకోవడానికి భూస్వాములు ఆర్యసమాజ్ వారిని తీసుకొచ్చారు. వారు దళితుల ఇళ్లలోకి వచ్చి హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారని అడిగితే దళి తులు ఒకే సమాధానమిచ్చారు. మతం మార్చుకుంటేనే మా వెట్టిచాకిరీ పోయింది. హిందూమతంలో ఉంటే వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగిస్తామని, వెట్టి చేయిం చమని చెప్పండి. అప్పుడు మేం హిందూ మతం వీడం అని చెప్పారు. ఇది రెండో దశ.

 స్వాతంత్య్రానంతరం అంటే 1947 తర్వాత పైకి అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమాలు వచ్చినా వారి పట్ల జాలి పెరిగింది తప్పితే వారి జీవితాల్లో మార్పులేదు. అస్పృశ్యతా మూలాలు కదల్లేదు. దళితులకు ఇళ్లు కట్టిం చారు కానీ అవి ఊరి చివరే ఉండేవి. ఆస్పృశ్యత, అణచి వేతకు వ్యతిరేకంగా సాగిన కమ్యూనిస్టుల ఉద్యమం భూపోరాటానికి దారితీసింది. దీని ప్రభావంతోటే నక్స ల్బరీ ఉద్యమం వచ్చింది. 1980ల నాటికి దళిత ఉద్య మం స్వయంగా అస్తిత్వ ఉద్యమంగా రూపొందింది. కమ్యూనిస్టు ఉద్యమంతో కులం అంతరిస్తుందని భావిం చినా అదీ జరగలేదు. గుడిసెల స్థానంలో బిల్డింగులు కట్టించినా వివక్ష పోలేదు. బాంచెన్ దొర అనే భాష పోయింది కానీ బానిసత్వం కొనసాగుతూనే ఉంది. దళి తులను ఓటు బ్యాంకు స్థాయిలోనే ఉంచారు. వారిని అలాగే ఉపయోగించుకున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే దళితులు అందరితో సమానం. మిగిలిన సందర్భాల్లో దళితులు అస్పృశ్యులే. భూ సంస్కరణలు అమలు జరగకుండా, భూమిపైన హక్కు రాకుండా దళి తుల జీవితాల్లో మార్పు రాదు. వృత్తి మారలేదు. వెట్టిచా కిరీ మారలేదు. సమాజంలో భాగం కాలేకపోయారు.

 అందుకే ఇప్పుడు కావలసింది మతమార్పిడీ నిరోధకచట్టం కాదు. ఆనాడు వెట్టిచాకిరీ పోవడానికి ముస్లింలుగా మారిన వారే తర్వాత వైద్య సాయం కోసం క్రిస్టియన్లుగా మారారు. అందుకే కులంతో సంబంధం లేని వృత్తి నైపుణ్యం కావాలి. అప్పుడే అన్ని కులాలు సమాజంలో భాగం అవుతాయి. లేదంటే కొన్ని కులాలు శాశ్వతంగా అస్పృశ్యులుగానే ఉంటాయి. అందుకే వామ పక్షాలు ఎక్కడ కాడిని వదిలేశాయో అక్కడినుంచి తిరిగి దున్నడం ప్రారంభించాలి. ఆర్థికసమస్యతోపాటు, సా మాజిక సమస్యని సైతం తీవ్రంగా పరిగణించాలి. వారి తోపాటు ప్రజాస్వామికశక్తులు, దళిత సంఘాలు, సం స్థలు సమష్టిగా ఆశయసాధనలో భాగం కావాలి.
 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement