విద్యాహక్కును హరించే విధానం | Chukka Ramaiah Writes opinion for education system | Sakshi
Sakshi News home page

విద్యాహక్కును హరించే విధానం

Published Thu, Aug 24 2017 1:52 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

విద్యాహక్కును హరించే విధానం

విద్యాహక్కును హరించే విధానం

విద్యార్థులను చదువు అనే ఏకైక మూసలోనుంచి చూడటం మానేయాలి. చదువుతోపాటు వారిలో ఉన్న ఇతర ప్రావీణ్యాలను వెలికి తీసే విద్యా విధానం కావాలి. సమాజానికి అన్ని రకాల అవసరాలు ఉంటాయి. వివిధ రంగాల్లో వారి నైపుణ్యానికి సానబట్టే వ్యవస్థలుండాలి. అతను ఏ విద్యలో ప్రావీణ్యుడో గ్రహించే సామర్థ్యం మన విద్యా విధానంలో ఉండాలి, తీసుకురావాలి. జీడీపీ రేట్‌ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి శ్రమ చేసేలా విద్య అందుబాటులో ఉండాలి.

మధ్యలోనే చదువు మానేసి వెళుతున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లోనేనంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది నిజం. ప్రభుత్వం విద్యా పరిరక్షణకు చేపడుతున్న చర్యలను ఈ సంఖ్య ప్రశ్నార్థకం చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం గణనీయంగా ఏర్పాటు చేస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలొకపక్క ఆశను రేకెత్తిస్తోంటే మరోవైపు గత పదేళ్లలో కనీసం 50 శాతం కూడా తగ్గని డ్రాపౌట్స్‌ శాతం ఆందోళనకి గురిచేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన సోషియో ఎకనమిక్‌ సర్వే ఖరారు చేస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా వివిధ కారణాలతో ఇప్పటికే చదువుకి దూరం అవుతోన్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ప్రభుత్వం తలపెడుతోన్న డిటెన్షన్‌ విధానం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఏ వర్గాలకోసం ఈ చదువులు...
ఇరవయ్యవ శతాబ్దంలో చదువు లక్ష్యం వేరు. ఆ లక్ష్యాన్ని బట్టి అక్కడున్నటువంటి పదాల అర్థం సైతం మారిపోతుంది. ఆరోజుల్లో సమర్థవంతమైన (విధేయత కలిగిన) యంత్రాంగాన్ని సృష్టించడమే లక్ష్యంగా విద్యావిధానం ఉండేది. అది బ్రిటిష్‌ వారి ఎత్తుగడ. కేవలం వారి వర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే విద్యగరిపేవారు. ఏ వర్గాలైతే ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారో వారికే చదువు అందుబాటులో ఉంచడం, ఎవరైతే పాలకులను శంకిస్తారో వారిని దూరంగా, చదువుకి ఆమడ దూరంలో ఉంచడం జరిగేది. ఆనాడు చదువు ఒక ప్రివిలేజ్‌.

కాబట్టి తాము అనుకున్న ప్రమాణాలు రాకపోతే నిర్బంధంగా అదే తరగతిలో కొనసాగించడం పరిపాటి. ఆనాడు విద్య హక్కు కాదు. పాలనావర్గం ప్రజలకిచ్చిన ప్రివిలేజ్‌గా మాత్రమే భావించేవారు. నేను అనుకున్న ప్రయోజనం రాలేదు కనుక నిన్ను నిర్బం ధించే అధికారం, అదే చదువు అర్థం అయ్యేవరకు అదే తరగతిలో ఉంచి కొనసాగించే అధికారం నాకుంది అన్నారు. నిర్బంధించడం(డిటైన్‌) అని వాడారు. కానీ ఇప్పుడు విద్య మనకొక హక్కుగా సంక్రమించాక సైతం ప్రభుత్వాలు  డిటెన్షన్‌ విధానం అని మాట్లాడటం బాధాకరం.
నిజానికి ఇప్పుడు ఓ విద్యార్థికి చదువు రాకపోవడానికి కారణం ఏమిటో? కారకులెవ్వరో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సమాజమా? తల్లిదండ్రులా? ఉపాధ్యాయులా? ప్రభుత్వ వ్యవస్థా? అనేది పరిశీలించాలి. ఎవరు ఓ విద్యార్థి పాస్‌కాకపోవడానికి కారణం అనేది తేల్చకుండా పిల్లవాణ్ణి దోషిగా నిలిపి అతడిని శిక్షించడం విద్యని హక్కుగా భావిస్తున్న తరుణంలో ఎంతవరకు సమంజసమో అర్థం కావడంలేదు.

గ్రామీణ ప్రాంతాల్లో హైస్కూలు స్థాయిలో బాలికల చదువుకి ఎదురవుతున్న ఆటంకాలకి అనేక కారణాలున్నాయి. పిల్లల సంరక్షణా బాధ్యత ఆడపిల్లలను బడికి దూరం చేస్తోందని సోషియో ఎకనమిక్‌ సర్వే తేల్చింది. అలాగే బతుకుదెరువుకోసం వలసలెళ్లాల్సి రావడం కూడా ఆయా కుటుంబాల్లో బాలబాలికలిద్దరూ బడిమానేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయని ఈ సర్వే భావించింది. అలాగే అమ్మాయిల్లో శారీరక మార్పుల వల్ల ఏర్పడే అసౌకర్యాలు, ప్రకృతి వైపరీత్యాలు (కరువు తదితరాలు) కూడా డ్రాపౌట్స్‌కి కారణాలుగా సర్వే భావించింది. ఐసిడిఎస్‌లను 8 గంటలపాటు పనిచేయించడం వల్ల కూలినాలికి వెళ్లే తల్లులు లేనిసమయంలో చిన్న పిల్లల సంరక్షణ బాధ్యత బడి ఈడు పిల్లలపై పడకుండా జాగ్రత్తపడవచ్చని ఈ సర్వే భావించింది.

పరీక్షా విధానంలో లోపం లేదా?
మన విద్యావ్యవస్థలో పరీక్షా విధానం ఎలా ఉంది? మనం కేవలం సమాచారాన్నే పరీక్షిస్తున్నామా? లేక విద్యార్థి అవగాహనాస్థాయిని పరీక్షిస్తున్నామా? ఏడాదంతా చదివిన చదువుని మూడు గంటల్లో కక్కేయడానికి అతనేమీ మిషన్‌ కాదు. అలాగే మన పరీక్షలన్నీ అతడి జ్ఞాపక శక్తిని అంచనా వేయడానికే తప్ప, అతని పరిజ్ఞానాన్ని కాదు. కేవలం అతను బట్టీకొట్టిన విషయాలను రాబట్టడానికే ఈ పరీక్షలు సరిపోతున్నాయి. అయితే ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు తారీఖులు, దస్తావేజుల సమాచారాన్నంతా బుర్రలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు.

మొబైల్‌ కావచ్చు, ల్యాప్‌టాప్‌ కావచ్చు, కంప్యూటర్‌ కావచ్చు. మీట నొక్కితే సమాచారం మీ ముంగిట్లో ఉంటుంది. కానీ విద్యార్థికి విషయం పట్ల అవగాహన అవసరం. ఆ సమస్యని పరిష్కరించే మేధ విద్యార్థికి ఉన్నదా లేదా అనేది పరీక్షించాలి. కావాల్సింది సమాచారం కాదు, వివేచన, వేగవంతమైన ఆలోచనాశక్తి. దాన్ని పరీక్షించే నైపుణ్యం మనకు కావాలి. అటువంటి విధానం కావాలి. అటువైపుగా విద్యావ్యవస్థ పురోగమించాలి. అంతేకానీ అదేతరగతిలో ఉంచి మరింత అగమ్యగోచరంగా తయారు చేయడం కాదు.

చదువు ఎందుకు రాదు... కారణాలేమిటి?
ఒక విద్యార్థికి విషయం అర్థం కాకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి, అతని సామాజిక పరిస్థితి, అతని కుటుంబ వ్యవస్థ కారణాలే. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పరిస్థితుల నుంచి వచ్చాడు? అతని కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులేమిటి అనేవి అతని అవగాహనా శక్తి మీద ప్రభావం చూపుతాయి. చిన్నప్పటినుంచి అన్ని సదుపాయాలతో, అన్ని అవకాశాలనూ అందుకుంటూ ఉన్న పిల్లవాడు అయితే అతని అవగాహనా శక్తి కూడా అందుకనుగుణంగా ఉంటుంది. కానీ తినడానికి తిండి లేక, కనీసం పౌష్టికాహారం కూడా లేని స్థితి నుంచి వచ్చే విద్యార్థులు తరగతి గదిలో విషయాలను అర్థం చేసుకునే పరిస్థితికీ మిగిలిన విద్యార్థుల పరిస్థితికీ చాలా తేడా ఉంటుంది.

దళిత, ఆదివాసీ సామాజిక వర్గాల నుంచి వచ్చే పిల్లలు, బాలికలు ఇప్పుడిప్పుడే బడిమెట్లను ఎక్కగలుగుతున్నారు. ప్రధానంగా ఈ వర్గాల నుంచి వచ్చేవారు తొలితరం విద్యార్హతనొందిన వారు. వారిని పాఠశాల స్థాయిలోనే డిటెన్షన్‌ పేరుతో నిలిపివేస్తే వారి విద్యాహక్కుని కాలరాసినట్టే అవుతుందనడంలో సందేహం లేదు. వీరికి యూనివర్సిటీ స్థాయిలో సైతం ప్రత్యేక తరగతులు అవసరమని థోరట్‌ కమిషన్‌ లాంటివి సిఫార్సు చేస్తే ఇప్పటికీ అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. అటువంటప్పుడు ప్రాథమిక దశలోనే వారిని తరగతి దాటకుండా డిటెయిన్‌ చేయడం వల్ల వారి ఉపాధి హక్కుని, ప్రధానంగా రిజర్వేషన్లను పొందే పరిస్థితిని సైతం అడ్డుకుంటున్నట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు.

అవమాన భారంతో బడికే దూరం...
తెలుగు పద్యం రానందుకు పదే పదే వేస్తున్న శిక్షను భరించలేక మూడవ తరగతి విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనకు తాజా ఉదాహరణ. అంత సున్నితమైన చిన్నారుల మనసెరిగి వారికి మరింత ప్రోత్సాహకంగా విద్యనందించే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సింది పోయి డిటెయిన్‌ చేయడం వల్ల ఒరిగేదేముంటుంది? తన తోటి విద్యార్థులంతా పై తరగతులకు వెళ్తుంటే తాను మాత్రం అదే తరగతిలో కొనసాగడం వల్ల అవమానభారంతో అసలు చదువుకే స్వస్తి పలికి బడిమానేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే పైన చెప్పుకున్న ఘటనలు పునరావృతం అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలు, బాలికల ఇంటి వాతావరణాన్ని, పరిస్థితులను మెరుగుపర్చకుండా విద్యా వ్యవస్థలో మార్పును ఆశించడం సరి కాదు. సమాజం నిర్లక్ష్యం కారణంగానే చదువు రావడం లేదు తప్ప, విద్యార్థి అందుకు కారణం కానేకాదు. విద్యార్థి చేయని తప్పుకి అతడిని బలిచేయడం సమంజసం కాదు. అతని దారిద్య్రం, తరతరాలుగా వారి కుటుం బాలు చదువుకి దూరంగా ఉండడం, ప్రత్యేక శిక్షణ లేకపోవడం అతని వైఫల్యానికి కారణాలు, దానికితోడు మన విద్యావ్యవస్థ కూడా అందుకు దోహదం చేసేదిగానే ఉంది.

విదేశాల్లో డిటెన్షన్‌ విధానం లేదు....
అన్నింటికీ విదేశాలను ఉదాహరణగా తీసుకునే మనం డిటెన్షన్‌లో మాత్రం మనదైన ప్రత్యేక పరిస్థితిని విదేశీయులు వదిలివెళ్లిన పద్ధతినే మోస్తున్నాం. విదేశాల్లో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించారు. అక్కడ విద్య అంటే ఆలోచనా విధానం అని అంటారు. థింకింగ్‌ కెపాసిటీని పెంపొందించడానికి అనేక కార్యకలాపాలను ప్రవేశపెట్టి, అన్నింటికీ మార్కులు వేస్తారు. చదువుకి మాత్రమే కాదు. అతని పరిశోధనాశక్తికి, ఆలోచనాశక్తికి మార్కులు ఉంటాయక్కడ. సృజనను వెలికితీయడమే ధ్యేయంగా చదువులుంటాయి.

విద్యార్థులను చదువు అనే ఏకైక మూసలోనుంచి చూడటం మానేయాలి. చదువుతోపాటు వారిలో ఉన్న ఇతర ప్రావీణ్యాలను వెలికి తీసే విద్యా విధానం కావాలి. సమాజానికి అన్ని రకాల అవసరాలు ఉంటాయి. వివిధ రంగాల్లో వారి నైపుణ్యానికి సానబట్టే వ్యవస్థలుండాలి. అతను ఏ విద్యలో ప్రావీణ్యుడో గ్రహించే సామర్థ్యం మన విద్యా విధానంలో ఉండాలి. జీడీపీ రేట్‌ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి శ్రమ చేసేలా విద్య అందుబాటులో ఉండాలి. అందులో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలల్లో ఆ ప్రగతి కనిపిస్తోంది. అదే అందరికీ వర్తింప చేయడానికి కృషి జరగాలి. ప్రత్యామ్నాయాలను శోధిం చాలి. ప్రత్యామ్నాయాలను ఆలోచించడానికి బదులు శిక్షించడం నెగటివ్‌ థింకింగ్‌ అవుతుంది.

మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం అవకాశాలను పెంచే విషయంపై ఆలోచించాలి. బోధనా పద్ధతులు మార్చాలి. సంపన్న వర్గాల కోసం తయారుచేసిన విద్యా వ్యవస్థకు స్వస్తి పలకాలి. అదే చదువు అందరికీ కుదరదు. తొలితరం విద్యావకాశాలను అందిపుచ్చుకుంటున్న వారికి విద్యా బోధనలో మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. మార్పు కోసం ఇతర దేశాల్లో కొత్త విధానాలను వెతుకుతున్నారు. ఆఫ్రికా ఖండ దేశాలలో డిటెన్షన్‌ అనే విధానమే లేదు.

బోధనా పద్ధతుల్లో రీసెర్చ్‌ చేయాలి. సమర్థవంతంగా బోధించండి. ఒక మూసలో ఒదగనప్పుడు ప్రత్యామ్నాయాలను ఆలోచించండి. ప్రతి వ్యక్తిలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయండి. మానసిక వికలాంగులకు, అంధులకు చదువుచెప్పే ప్రత్యేక పద్ధతులు ఉన్నప్పుడు ఈ రోజు వరకు బడిబాటనే ఎరుగని వర్గాల వారికి డిటెన్షన్‌ విధానం తీరని చేటు చేస్తుందనడంలో సందేహంలేదు. ఈ సాంకేతిక యుగంలో మావనవనరుల నిర్వహణ అనేది చాలా క్లిష్టమైన సమస్య. ఆ దృష్టితో పరిశీలించాలనేది నా మనవి.

చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement