అవగాహన పెంచేదే అసలు చదువు | learn history, save history program like collaborative teaching | Sakshi
Sakshi News home page

అవగాహన పెంచేదే అసలు చదువు

Published Wed, Dec 23 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

అవగాహన పెంచేదే అసలు చదువు

అవగాహన పెంచేదే అసలు చదువు

విశ్లేషణ
 ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపాడుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిదర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుందన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం చేయించింది.
 
 ఉపాధ్యాయుడు బోధిం చడం, విద్యార్థులు శ్రద్ధగా వినడం - ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న బోధనా పద్ధతి ఇదే. సామాజిక పరిస్థితులు మారాయి. బడిపిల్లల అల వాట్లు, అభిరుచులు, ఆలో చనా ధోరణి కూడా మారాయి. అందుకే సంప్రదా యక ‘చాక్ అండ్ టాక్’ పద్ధతికి స్వస్తి పలకవలసిన సమయం వచ్చింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యారంగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు పాఠశాల స్థాయిలోనే పరిశోధనాత్మక విద్యా విధానానికి శ్రీకా రం చుట్టాయి. బోధన, అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే విధానంతో విద్యను మలచుకో వడానికి అక్కడ వేగంగా ప్రయత్నం జరుగుతోంది. నిజానికి పాఠ్యాంశాన్ని యథాతథంగా బోధించడం కంటే, సామాజిక పరిస్థితులకు అన్వయించి చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా విషయం అర్థమవుతుంది.  

 ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ కొయ్యబొమ్మలకే కాదు, విద్యార్థులలో చక్కని సృజనను పెంచడానికి కృషి చేస్తున్న స్థలంగా చెప్పుకోవచ్చునని ఈ మధ్య రుజువు చేసుకుంది. ఆ పట్టణంలోని ఒక పాఠశాల ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపా డుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిద ర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుం దన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం ఏర్పాటు చేసి, చూడడానికి రావలసిందని నన్ను ఆహ్వానించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఖిలాగుట్ట, శ్యామ్‌గఢ్, బత్తిస్‌గఢ్, ఇతర ప్రాంతాలకు పంపారు. అక్కడకు వెళ్లివచ్చిన పిల్లలు తాము తెలుసుకుని వచ్చిన కొత్త విషయాలను, ఆసక్తికరమైన అంశాలను సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సాటి విద్యార్థులకు వివరించారు. నిర్మల్‌లోనే ఉన్న శ్యామ్‌గఢ్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో నిర్మించిన ఖిల్లాగుట్ట ప్రత్యేకత ఏమిటి? ఎవరు నిర్మించారు? వేయి ఉరుల మర్రి ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాంజీ గోండు ఎవరు? ఆయనను ఎవరు ఉరి తీశారు? రాంజీతో మరో వేయి మందిని ఆ మర్రికే  ఎందుకు ఉరి తీశారు? నాటి పరిస్థితులు ఏమిటి? వంటి పుస్తకాలలో లేని పలు అంశాలను క్షేత్రస్థాయి పర్యటనలో పరిశోధన ద్వారా వారు స్వయంగా తెలుసుకుని వచ్చారు.

 పరిసరాలతో మమేకం చేయకుండా విద్య గరిపితే అది అసహజంగా ఉంటుంది. అన్నం ఎలా వస్తుందని అడిగితే, సూపర్‌మార్కెట్‌లో తెచ్చిన బియ్యం వండితే వస్తుందని చెప్పారంటే, అది పిల్లల తప్పుకాదు. రైతు కష్టిస్తేనే వరి చేలు పండుతాయనీ, ఫలితంగానే బియ్యం వస్తుందనీ వారికి తెలియ కుండా చేయడం ఆందోళన కలిగించే అంశమే. మన ప్రధాన పంటను గురించే విద్యార్థులకు సరైన అవగా హన కలిగించలేకపోతున్నాం. కాబట్టి వైట్‌హౌస్, పారిస్ ఫ్యాషన్ టెక్నాలజీల కంటే ముందు విద్యార్థు లకు పరిసరాలు, వాటి ప్రాముఖ్యం గురించి చెప్పాలి. సామాజిక అవగాహన పెంచాలి.

 డిజిటల్ పాఠశాలల్లో బోధనా పద్ధతులలో కొన్ని మార్పులు వచ్చినా అవి ఇంకా బడుగు బలహీన వర్గాల  పిల్లల దాకా రాలేదు. సర్కారీ బడులలో కూడా దానిని ప్రవేశపెడితే మంచి ఫలితాలు వస్తాయి. చాక్ అండ్ బోర్డ్ పద్ధతి నుంచి ప్రొజెక్టర్ అండ్ టేబుల్ బోధనా విధానానికి మారామని అనుకున్నా అది కూడా అధిక సంఖ్యలో పిల్లలకు అందుబాటులో లేదు. దీనితో అంతరాలు పెరుగు తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉన్నప్పటికీ బోధన ఆంగ్లంలోనే జరుగుతూ ఉండడంతో ఆకళింపు చేసుకోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. కాబట్టి మాతృభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే, ఆంగ్లంలో తర్ఫీదునివ్వడం మేలు. నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించిన తరువాత అనారోగ్యకర పోటీ ఏర్పడి చదువు స్వరూపమే మారింది. విద్యార్థులను జ్ఞానం చుట్టూ కాకుండా, మార్కుల చుట్టూ తిప్పుతున్నారు. అవగాహనను బట్టి కాకుండా మార్కులను బట్టి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే విపరీత ధోరణులు ప్రవేశించాయి. దీనితో మార్కులు సాధించాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఈ పరిస్థితి మారాలి. పిల్లలను స్వతహాగా ఆలోచించేటట్టు చేయాలి. అప్పుడే వారి సామర్థ్యం తెలుస్తుంది తప్ప, గైడ్లను ఆశ్రయించి భట్టీయం వేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

 పిల్లలు చాలామంది ఇప్పటికీ భాష, భావ వ్యక్తీకరణల విషయంలో వెనుకబడి, పెద్ద చదువులు ఉన్నా నైపుణ్యాలు లేక అరకొర వేతనాలకే పని చేస్తున్నారు. కొలాబిరేటివ్ టీచింగ్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల స్థాయిలోనే పరిశోధనాత్మకత మీద అవగాహన పెంచాలి.

http://img.sakshi.net/images/cms/2015-03/41426188468_295x200.jpg
(వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు: చుక్కా రామయ్య)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement