ఇదీ నా లెక్క | chukka ramaiah hares his feelings on hyderabad | Sakshi
Sakshi News home page

ఇదీ నా లెక్క

Published Mon, Sep 29 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

ఇదీ నా లెక్క

ఇదీ నా లెక్క

కుర్రతనంలో పొలిటికల్ ఫార్ములాను ఫాలో అయ్యారు. తెలంగాణ పోరుబాటలో జైలుకెళ్లారు. సర్కారీ లెక్కల మాస్టార్‌గా ‘మా సార్’ అనిపించుకున్నారు. పదవీ విరమణ తర్వాత అవే లెక్కలతో నలుదిక్కులా పేరు సంపాదించుకున్నారు. ఐఐటీ  రామయ్యగా సిటీ యంగ్ తరంగ్‌లను ఎల్లలు దాటించారు. హైదరాబాద్‌తో ఈ విద్యావేత్తది 66 ఏళ్ల అనుబంధం. ఆయన విజన్‌లో ‘హైదరాబాద్’ ఓ రాజకీయ కేంద్రం.. రంగుల కలను చూపించిన వెండితెర. కాలంతో మారిన హైదరాబాద్‌తో మాస్టారి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..

నేను 1942లో మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. రాజకీయంగా సంచలనాత్మక సమయమది. నేను ఇంటర్మీడియెట్ ఫైనల్‌లో ఉన్నా. ఆంధ్రమహాసభలో కార్యకర్తగా ఉండటంతో రాజకీయ ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆంధ్ర మహాసభలో పనిచేస్తున్న ఇతర కార్యకర్తలతో కలసి హైదరాబాద్ వచ్చాను. నాంపల్లి స్టేషన్‌లో దిగి జట్కా బండి ఎక్కాం. అప్పుడు సిటీలో తిరగడానికి జట్కా బళ్లే. నలుగురికి ప్లేస్ ఉండేది. బండిలో మా బసకు వెళ్తుంటే దారిలో మనిషి లాగుతున్న రిక్షాలను చూసి ఆశ్చర్యమేసింది. సికింద్రాబాద్‌లో సైకిల్ రిక్షాలుండేవి.
 
ఈ తూరుపు.. ఆ పశ్చిమం..
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలైనా.. కల్చర్‌లో మాత్రం తూర్పు, పశ్చిమ జర్మనీలకున్నంత తేడా ఉండేది. ఆ వైవిధ్యం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. నాంపల్లి స్టేషన్లో.. ఆటోవాళ్లు ‘కిదర్ జాతే ’ అంటారు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ‘ఎక్కడికెళ్లాలి..’ అని అడుగుతారు. హైదరాబాదీలకు ‘చాయ్ ఖానా’ అడ్డా! సికింద్రాబాదీలకు ‘ఆనంద్ భవన్’ అడ్డా! అక్కడ చాయ్ తాగితే.. ఇక్కడ కాఫీ అంటారు. అప్పట్లో సిటీలో ఉర్దూ మాట్లాడితే గొప్ప. ఇప్పుడు ఇంగ్లిష్‌లో మాట్లాడితేనే చూస్తారు.
 
రోకో బస్...

ఆ రోజుల్లో రెండు అవసరాల కోసం పట్నం వచ్చేవాళ్లు. ఒకటి జబ్బు చేస్తే వైద్యం కోసం.. రెండోది చదువు కోసం! ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ చేయడానికి 1946లో రెండోసారి హైదరాబాద్ వచ్చాను. ఓయూ నుంచి కాచిగూడ వరకు అంతా అడవే. కాలేజ్‌కి శేర్వాణి వేసుకునే వెళ్లాలి. అప్పట్లో బస్‌స్టాప్‌లు ఉండేవి కావు. ఎక్కడైనా స్టూడెంట్ కనిపిస్తే.. కండక్టర్‌కు దయ కలిగితే ‘రోకో’ అనేవాడు. దీన్నే ‘రోకో బస్’ అనేవాళ్లం. బస్సంతా ఖాళీగా ఉన్నా ఫుట్‌బోర్డ్ మీద వేళ్లాడేవాళ్లం. క్లాస్‌రూమ్స్‌లో ప్రొఫెసర్లు పాఠాలు చదువుకుంటూ వెళ్లేవాళ్లు. మనిషి కొంచెం రాసుకునేవాళ్లం. క్లాస్ అయిపోయాక వరండాలో అందరం గుంపుగా కూర్చుని అన్నీ చూసి ఫైనల్ నోట్స్ తయారు చేసుకునేవాళ్లం. జఖ్రుద్దిన్, అక్తర్‌హుస్సేన్.. అని ఇద్దరు మంచి లెక్చరర్లు ఉండేవారు. రాజ్‌బహదూర్ గౌర్ వాళ్ల కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉండేది మాకు.
 
అరెస్ట్‌లో అరెస్ట్..
సినిమాలు బాగా చూసేవాణ్ని. అబిడ్స్‌లోని జమ్రుద్ మహల్ నా ఫేవరేట్ థియేటర్. హిందీ సినిమాలే చూసేది. అశోక్‌కుమార్ నా ఫేవరేట్ యాక్టర్. సినిమాలంటే నాకెంత పిచ్చి అంటే.. నేను అరెస్టయి ఔరంగాబాద్ జైల్లో ఉన్నప్పుడు కేస్ హియరింగ్ కోసం జనగామ వస్తున్నాం. హైదరాబాద్‌లో ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. మా వెంట ఉన్న పోలీసులు లోకల్ వాళ్లు కాదు.. కాందిశీకులు. ఆ రాత్రి మేం ‘సినిమా చూస్తాం’ అన్నాం. వాళ్లు సరేనని ప్యారడైజ్ థియేటర్‌కు తీసుకెళ్లారు.

 ఏ సినిమా చూసింది గుర్తులేదు కాని.. గమ్మత్తై ఇన్సిడెంట్ జరిగింది. సినిమా ఇంటర్‌వెల్‌లో జనగామకు చెందిన ఒకతను మమ్మల్ని గుర్తుపట్టాడు. జైలు నుంచి పారిపోయి వచ్చారనుకుని వెంటనే పక్కనే ఉన్న ఠాణాకెళ్లి ఇన్‌ఫామ్ చేశాడు. ఇంటర్‌వెల్ అయిపోయే లోపే లోకల్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌లో అరెస్టన్నమాట. పాపం.. ఆ కాందిశీకులను సస్పెండ్ చేశారు. నా సినిమా పిచ్చి అంత పని చేసింది (నవ్వుతూ..)!
 
గత కాలం మేలు..
హైదరాబాద్‌తో 66 ఏళ్ల అనుబంధం నాది. ఆనాడు పొలిటికల్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఎకానమీ పాయింట్‌గా మారింది. అప్పట్లో హైదరాబాద్ చూసిన వాళ్లు రెండు శాతం మంది ఉంటే.. ఇప్పుడు చూడని వాళ్లు రెండు శాతం ఉన్నారు.  అప్పుడది ఫ్యూడల్ రాజ్యమైనా యూరప్ వెళ్లి చదువుకున్న సంపన్న ముస్లింలు ఇక్కడ పారిశ్రామికీకరణ కోసం కొంత ప్రయత్నించారు. అడవుల జోలికి వెళ్లకుండా ఫ్యాక్టరీలు పెట్టారు. గొలుసు చెరువులుండేవి. వీటన్నిటి వల్ల ఎండాకాలమైనా సరే సిటీ టెంపరేచర్ 36 డిగ్రీలు దాటకపోయేది. కానీ ఇప్పుడు.. నలభై దాటేస్తుంది. పెరిగిన వలసలతో సిటీలో మురికివాడలూ పెరిగాయి. హైదరాబాద్ వాతావరణమే కాదు రూపమూ మారిపోయింది. ఆ రోజులు మళ్లీ వస్తాయన్న ఆశలు లేవు !

 ..:: సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement