నగదు బదిలీతో బహుపరాక్‌ | Chukka Ramaiah writes opinion for PDS reforms in Telangana | Sakshi
Sakshi News home page

నగదు బదిలీతో బహుపరాక్‌

Published Sat, Oct 28 2017 1:33 AM | Last Updated on Sat, Oct 28 2017 1:33 AM

Chukka Ramaiah writes opinion for PDS reforms in Telangana

తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదిలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది?

దానే దానేపే ఖానేవాలే నామ్‌ లిఖా హువా థా’ ప్రతి బియ్యపు గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుందట. ఆ మాటేమో గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థతో సమాజంలో తమ వంటి వారికి ఆకలితో అలమటించవలసిన అవసరం తప్పిందని ఇప్పటిదాకా పేదప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు. ముతకవో, సన్నవో ఏవో ఒకరకం తిండిగింజలు రేపటి రోజున రేషన్‌ షాపులో ఇస్తారన్న భరోసా అది. కానీ అవినీతిలో కూరుకుపోయిన సమాజాన్ని శుద్ధిచేసే సాహసం చేయలేకో, ప్రత్యామ్నాయం ఆలోచించలేకో ప్రభుత్వం రేషన్‌ బియ్యం స్థానంలో నగదు బదిలీని అమలు చేసే దిశగా అడుగులు వేయడం ఇప్పుడు తెలంగాణ బిడ్డలను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా కరువు కాటకాలలో, తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలకు పాలకులే కనీస ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసేవారు. తదనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ, కరువు పరిస్థితుల్లోనూ ప్రజలు ఆకలి మరణాలకు గురికాకుండా చూసేందుకు పాలకులు బియ్యం తదితర అత్యవసర సరుకులను ప్రజలకు ఉచితంగా ఇచ్చే విధానమూ ఉంది. 

ఆ తరువాత నక్సల్బరీ ప్రభావంతో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలు దేశంలో దళిత, ఆదివాసీలపై ఆర్థిక దోపిడీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇదే వారి అభ్యున్నతికి ఉద్యమాలు తెచ్చింది. పేదరికాన్ని తొలగించే కార్యాచరణకు మార్గం ఏర్పరిచింది. ఇందిర గరీబీ హఠావో నినాదం కూడా అందులో భాగమే. దీని ఫలితమే 1970వ దశకంలో ఇదే ప్రజాపంపిణీ వ్యవస్థ మరలా పేదవాడి ఆకలి తీర్చే కేంద్రమైంది. అప్పటినుంచి 2013 వరకు కేవలం సంక్షేమ పథకం రూపంలో ఉన్న ప్రజా పంపిణీ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు భారత ప్రజలను ఆకలి చావుల నుంచి ఓ మేరకైనా తప్పించ గలిగిందనడంలో సందేహం లేదు.

సంక్షేమం పరి«ధిని దాటి, ఈ కార్యక్రమం 2013 ఆహార భద్రత చట్టంతో ప్రజల హక్కుగా మారింది. ప్రజలు ఆకలిదప్పులతో మరణించకుండా ఉండడమే ఈ పథకం లక్ష్యం. మూడు దశల్లో ఈ పథకం అమలు జరిగింది. 1939 నుంచి 1965 వరకు, 1965 నుంచి 1975 వరకు, 1975 నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ నిరంతరాయంగా కొనసాగుతోంది. 

ఇందులో అనేక లొసుగులున్నమాట, అమలులో అవినీతి పేరుకుపోయిన మాట వాస్తవమే. కానీ దశాబ్దాలుగా పేదవాడి ఆకలితీరుస్తున్న ఏకైక పథకం ఇది. దీనితో ప్రధానంగా స్త్రీలు, భావిభారత పౌరులకు కనీస ఆహారం లభిస్తోంది. కేజీ ఒక్క రూపాయి లెక్కన ఒక్కొక్కరికి ఆరు కేజీలు, ఇంట్లో నలుగురుంటే 24 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సబ్సిడీతో రేషన్‌ ద్వారా అందిస్తోంది. కేవలం మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది 2 కోట్ల 79 లక్షల మంది. అంటే తెలంగాణ జనాభా మూడున్నర కోట్లలో ఇది 80 శాతం. నూటికి 20 శాతం మంది మాత్రమే సొంతంగా బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారని ప్రభుత్వమే తేల్చింది.

మిగిలినవాళ్లంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారేనని ప్రభుత్వం అంచనావేసి, వారికి రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. రేషన్‌ కార్డుల తనిఖీలు నిర్వహించి, వారికి సరిగ్గా సరుకులు అందుతున్నాయా లేదా అని పరిశీలించి, చివరకు నేరుగా లబ్ధిదారులకే రేషన్‌ బియ్యం తదితరాలు అందేలా, ఆధార్‌తో అనుసం«ధానం చేసి, బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటువంటి తరుణంలో, ప్రభుత్వం రేషన్‌ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు, హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 

దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఒకటి అవినీతి. మరొక ప్రధానమైన అంశం– లబ్ధిదారులు ఈ బియ్యం వినియోగించుకోకుండా అమ్ముకుంటున్నారని. ప్రజలు వెచ్చిస్తున్న ఒక్క రూపాయి సహా, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలిపి మొత్తం పాతిక రూపాయలకు పైగానే ఒక కిలో బియ్యానికి ఖర్చు అవుతున్నది. కనుక ఎవరో వ్యాపారస్తులకు కాక, ప్రజలకే నేరుగా ఇప్పుడు ఖర్చు చేస్తున్న పాతికరూపాయలకు అదనంగా కొంత కలిపి, మొత్తం 900 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలన్నది ప్రభుత్వ యోచన. అలాగే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్‌ అండ్‌ హవేలీ)ఈ నగదు బదిలీ అమలవున్నది. అది సత్ఫలితాలిస్తున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం పేదల మంచి కోసమే ఆలోచించే ఈ కార్యక్రమానికి పూనుకోవచ్చుగాక. కానీ ఆచరణలో ఇది అత్యంత ప్రమాదాన్ని కొనితెస్తుంది. 

మధ్యాహ్న భోజనం ఒక్కపూట మినహాయిస్తే మిగిలిన రెండు పూటలూ ఈ రేషన్‌ బియ్యంపైనే ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు. ఈ పథకం మీద ఆధారపడి 60 శాతం మంది ప్రజలు బతుకుతున్నారని ఏ గ్రామాన్ని పరిశీలించినా అర్థం అవుతుంది. పోనీ సగం మందే ఈ పథకం ద్వారా వస్తున్న బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారనుకుందాం. అలా చూసినా తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది.

రేపు నగదు బదలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? పురుషాధిపత్య సమాజంలో ఎంత మంది స్త్రీలకు ఆర్థికాంశాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది? అసలు స్త్రీల చేతికి ఆ డబ్బు వస్తుందా? వచ్చినా నాలుగు తన్నులు తన్ని ఏ తాగుడుకో తగులబెట్టేవారు ఈ బియ్యం అవసరమైన కుటుంబాల్లోని వారే. మహిళలపై హింస పెట్రేగి, వారిని మరిన్ని సమస్యల్లోకి తోసివేసే ప్రమాదం నగదు బదిలీ ప్రక్రియలో ఉండదని హామీ ఇవ్వగలరా? ఓపెన్‌ మార్కెట్‌లో బియ్యం ధరలను విపరీతంగా పెంచే ప్రమాదం కూడా ఉంది. 

మరి ప్రత్యామ్నాయం ఏమిటి? డిజిటల్‌ యుగంలో బయోమెట్రిక్‌ వంటి సాధనాలతో అవినీతిని కొంత మేరకైనా తగ్గించే అవకాశం ఉంది. పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. అవినీతిని అరికట్టేందుకు పేదప్రజలపై అస్త్రాలు ప్రయోగించడం కాకుండా బడాబాబుల, వ్యాపారస్తుల మోసాలను అరికట్టడానికి, పథకం దుర్వినియోగాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేయాలి. చివరగా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్తున్న సన్న బియ్యాన్ని రేషన్‌ బియ్యానికి కూడా వర్తింపజేయాలి. ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో ఉన్నవి. ప్రభుత్వం చేయగలిగినవి.

చుక్కారామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement