Ration bandh
-
సమస్యలపై స్పందించకుంటే.. జూన్ 1 నుంచి రేషన్ బంద్
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలోనూ లబ్ధిదారులకు కష్టం కలగకుండా బియ్యం పం పిణీ చేస్తున్నామని, తమ సమస్యలపై ప్రభు త్వం తక్షణమే స్పందించకుంటే జూన్ ఒకటినుంచి సరుకుల పంపిణీ నిలిపివేస్తామని మరో మారు రేషన్ డీలర్లు పౌర సరఫరాల శాఖకు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు రేషన్ డీలర్ల సం ఘం రాష్ట్ర కమిటీ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ, కరోనాతో డీలర్లు పిట్టల్లా రాలిపోతున్నారని, ఇప్పటికే 70 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా సోకిన పలువురు డీలర్లు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేక ఇళ్లలోనే ప్రాణాలు వదులుతున్నారని చెప్పారు. బియ్యం ఇచ్చే పద్ధతిలో మార్పు చేసి కాంటాక్టు లెస్ ద్వారా సరుకులు పంపిణీ చేసే విధంగా చూడాలని, డీలర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని, గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు కమీషన్ పెంచుతూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. -
పేదల కంచంతో ‘‘పరాచకం’’
సాక్షి, రాజమండ్రి : ‘తెల్ల రేషన్ కార్డుదారులకు చౌక ధరలకే పంపిణీ చేస్తున్న బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ పథకాలను మరింత మెరుగ్గా అమలుచేస్తాం’. – 2014 ఎన్నికల సందర్భంగా చంద్ర బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోని 43వ పేజీలో పొందు పరిచిన హామీ ఇది. ‘మరింత మెరుగ్గా’ అంటే.. మరింత తక్కువ ధరకు సరుకులు పంపిణీ చేస్తారని పేదవర్గాల వారు ఆశించారు. తీరా అధికారంలోకి వచ్చాక వారి ఆశలను అడియాసలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వచ్చింది చంద్రబాబు సర్కారు. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి కోటా సరుకులకు కోత పెట్టింది. ‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ఆ పండుగల్లో బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకం సరుకులు పేదలకు అంటగట్టి కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అండ్ కో అడ్డగోలుగా దోచేసింది. నాలుగేళ్ల పాటు బియ్యం మాత్రమే పంపిణీ చేసిస సర్కారు ఎన్నికలకు ఏడాది ముందు ఓటర్లకు గేలం వేసే పనిలో పంచదార, కందిపప్పు పంపిణీని పునరుద్ధరించింది. మండపేట: పేదవర్గాల వారికి చవక ధరకే బియ్యం, పప్పు దినుసులు, నూనె, పంచదార, ఇతర నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని వీలైనంత మెరుగ్గా అమలుచేస్తూ వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ‘కోటాకు కోత.. పేదల నోటికి వాత’ అన్నట్టు వ్యవహరించింది. జిల్లాలో 51.51 లక్షల జనాభా ఉండగా దాదాపు 17,89,183 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర కేటగిరీల్లో 16,44,178 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,659 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు రూ. 200.25లకే పంచదార, పామాయిల్, కందిపప్పు, గోధుమలు, చింతపండు తదితర పది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవారు. బయటి మార్కెట్లో ధరలతో పోలిస్తే ఒక్కో కార్డుదారునికి రూ.440 నుంచి రూ.500 వరకూ లబ్ధి చేకూరేది. వీటితో పాటు రూపాయికి కిలో బియ్యాన్ని అందజేసేవారు. ఒకటొకటిగా సరుకులకు ఎసరు అయితే 2014లో అధికారం చేపట్టిన వెంటనే నిత్యావసర వస్తువుల పంపిణీలో భారీగా కోత విధించడం మొదలు పెట్టింది చంద్రబాబు సర్కారు. మొదట్లో బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమల పంపిణీ జరిగేది. గ్యాస్ కనెక్షన్లేని వారికి లీటరు రూ. 15 చొప్పున నాలుగు లీటర్లు, ఉన్న వారికి రూ. 19కు లీటరు కిరోసిన్ ఇచ్చేవారు. గద్దెనెక్కిన ఏడాదికే కందిపప్పు, గోధుమలు, పామాయిల్‌లను ఎత్తేసిన సర్కారు మూడేళ్ల క్రితం పంచదార, కిరోసిన్‌లను నిలిపివేసి బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తూ వచ్చింది. ఇలా పేదల కడుపు కొట్టడానికి నిర్దాక్షిణ్యంగా పూనుకున్న చంద్రబాబు సర్కారే.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఏడాది క్రితం సరుకుల పునరుద్దరణ ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చే ఎత్తుగడ వేసింది. గత ఏడాది జనవరి నుంచి చక్కెర పంపిణీని తిరిగి నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించింది. భయపెడుతున్న బయటి మార్కెట్ ధరలు రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయడంతో బయటి మార్కెట్లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పేదవర్గాల వారు బెంబెలెత్తుతున్నారు. రేషన్ కార్డుపై అరకేజీ పంచదార రూ.6.75కు సరఫరా చేయగా మార్కెట్లో పంచదార కిలో రూ.40 వరకూ ఉంది. అలాగే లీటరు కిరోసిన్ రూ.15కు సరఫరా చేస్తే బయట రూ.60 పలుకుతోంది. రేషన్ గోధుమ పిండి రూ.16 కాగా బయటి దుకాణాల్లో రూ.40 ఉంది. మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయి పేద వర్గాల వారికి చుక్కలు చూపిస్తున్నాయి. కానుకల్లో నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి ‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ప్రభుత్వం ఆయా పండుగల్లో నాసిరకం సరుకులను తూకం తక్కువగా ప్యాకింగ్ చేసి లబ్ధిదారులకు అంటగడుతోంది. పురుగులు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు వంటి నాసిరకం వస్తువులను అంటగట్టడం ద్వారా కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలను చంద్రబా బు, ఆయన అనుచరులు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏం తిని బతకాలి? గతంలో ఆయిల్, చింతపండు ఇతర నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల్లో చౌకగా ఇచ్చేవారు. బయటి మార్కెట్లో వాటి ధరలు మండిపోతున్నాయి. చౌక డిపోల్లో సరుకులు ఆపేస్తే పేద ప్రజలు ఏం తిని బతకాలి? రేషన్ సరుకులు ఆపేయడమంటే పేద ప్రజలను ఇబ్బందులు పాలుచేయడమే. – విత్తనాల శ్రీనివాసరావు, ఐ.పోలవరం. పేదలకు పెద్ద ఇబ్బంది గత ప్రభుత్వంలో అన్ని రకాల సరుకులు ఇచ్చేవారు. ఇద్దరు, ముగ్గురు ఉండే కుటుంబానికి 15 నుంచి 20 రోజుల వరకు సరిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు ఆపేయడం వలన పేదవర్గాల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – మనువర్తి ఏసురాజు, కేశవరం, మండపేట రూరల్ అన్నీ బయట కొనుక్కోవాల్సిందే.. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం పేదల ఇచ్చే రేషన్‌లో కోటా పెట్టింది. గతంలో రూ.200 పట్టుకుని వెళితే రేషన్‌లో పది రకాలకు పైగా సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నీ బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. – బొడ్డపాటి మంగరాజు, మండపేట -
రేషన్‌కు మిగిలింది రెండు రోజులే...!
సాక్షి,సిటీబ్యూరో: రేషన్ సరుకుల పంపిణీకి గడువు మిగిలింది ఇక రెండు రోజులే. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి రేషన్ కోటా పంపిణీ నిలిచిపోతుంది. రేషన్ షాపులు సైతం తెరవరు. మార్చి నుంచి ప్రతినెలా15 వరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ జరుగనుంది. దీనిపై గత వారం రోజులుగా పౌరసరఫరాల శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. వినియోగదారుల సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారంతో పాటు ప్రత్యేక వాహనాలతో ప్రచారం నిర్వహిస్తోంది. రేషన్ షాపులకు వారాంతపు సెలవు రోజు సైతం రద్దు చేసింది. మహా నగరం పరిధిలో సుమారు 26 శాతం కుటుంబాలు సరుకుల పంపిణీకి దూరంగానే ఉన్నారు. ప్రజా పంపి ణీ వ్యవస్ధలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రేషన్ సరుకుల పంపిణీ గడవును కుదించిన విషయం విదితమే. గత నెల జనవరిలో పక్షం రోజుల గడువు విధించి నప్పటికీ పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 25 వ తేదీవరకు పొడిగించింది. తిరిగి ఈ నెల సరుకుల పంపిణీకి 20 వరకు డెడ్‌లైన్ విధించింది. గత నెల మాదిరిగా సమస్య పునరావృతం కాకుండా గడువుపై ప్రచారం ముమ్మరం చేస్తున్న పూర్తి స్థాయి సరుకుల పంపిణీ ప్రక్రియ మాత్రం పూర్తయ్యే అవకాశాలు కానరావడం లేదు. 2.87లక్షల కుటుంబాలు హైదరాబాద్ మహా నగరం పరిధిలోని ఆహార భద్రత (రేషన్) కార్డు దారులైన సుమారు 2.87 లక్షల కుటుంబాలు రేషన్ సరుకులు డ్రా చేయనట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. మహా నగర పరిధిలో పౌరసరఫరాల శాఖకు 12 సర్కిల్స్ ఉండగా వాటి పరిధిలో సుమారు 10.94 లక్షల ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం కార్డుల్లో ఈ నెల కోటా సరుకులు డ్రా చేసి కార్డుల సంఖ్య 8.06 లక్షలకు మించలేదు. మిగిలిన కార్డులు గడువు సమీపిస్తున్నా సరుకులను మాత్రం డ్రా చేయలేదు. రేషన్ షాపులకు వారాంతపు సెలవు దినమైన శుక్రవారం కూడా పనిదినంగా మార్చి ఒకటవ తేదీ నుంచి వరసగా 20 వరకు రేషన్ షాపు తెరిచి ఉంచి సరుకులు పంపిణీ ప్రక్రియను కొనసాగించారు. అయినప్పటికీ కొన్ని కుటుంబాలు ఆర్ధిక సమస్యనో? లేక వీలుపడకనో సరుకులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నగదు బదిలీతో బహుపరాక్
తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదిలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? దానే దానేపే ఖానేవాలే నామ్ లిఖా హువా థా’ ప్రతి బియ్యపు గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుందట. ఆ మాటేమో గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థతో సమాజంలో తమ వంటి వారికి ఆకలితో అలమటించవలసిన అవసరం తప్పిందని ఇప్పటిదాకా పేదప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు. ముతకవో, సన్నవో ఏవో ఒకరకం తిండిగింజలు రేపటి రోజున రేషన్ షాపులో ఇస్తారన్న భరోసా అది. కానీ అవినీతిలో కూరుకుపోయిన సమాజాన్ని శుద్ధిచేసే సాహసం చేయలేకో, ప్రత్యామ్నాయం ఆలోచించలేకో ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీని అమలు చేసే దిశగా అడుగులు వేయడం ఇప్పుడు తెలంగాణ బిడ్డలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా కరువు కాటకాలలో, తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలకు పాలకులే కనీస ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసేవారు. తదనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ, కరువు పరిస్థితుల్లోనూ ప్రజలు ఆకలి మరణాలకు గురికాకుండా చూసేందుకు పాలకులు బియ్యం తదితర అత్యవసర సరుకులను ప్రజలకు ఉచితంగా ఇచ్చే విధానమూ ఉంది. ఆ తరువాత నక్సల్బరీ ప్రభావంతో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలు దేశంలో దళిత, ఆదివాసీలపై ఆర్థిక దోపిడీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇదే వారి అభ్యున్నతికి ఉద్యమాలు తెచ్చింది. పేదరికాన్ని తొలగించే కార్యాచరణకు మార్గం ఏర్పరిచింది. ఇందిర గరీబీ హఠావో నినాదం కూడా అందులో భాగమే. దీని ఫలితమే 1970వ దశకంలో ఇదే ప్రజాపంపిణీ వ్యవస్థ మరలా పేదవాడి ఆకలి తీర్చే కేంద్రమైంది. అప్పటినుంచి 2013 వరకు కేవలం సంక్షేమ పథకం రూపంలో ఉన్న ప్రజా పంపిణీ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు భారత ప్రజలను ఆకలి చావుల నుంచి ఓ మేరకైనా తప్పించ గలిగిందనడంలో సందేహం లేదు. సంక్షేమం పరి«ధిని దాటి, ఈ కార్యక్రమం 2013 ఆహార భద్రత చట్టంతో ప్రజల హక్కుగా మారింది. ప్రజలు ఆకలిదప్పులతో మరణించకుండా ఉండడమే ఈ పథకం లక్ష్యం. మూడు దశల్లో ఈ పథకం అమలు జరిగింది. 1939 నుంచి 1965 వరకు, 1965 నుంచి 1975 వరకు, 1975 నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందులో అనేక లొసుగులున్నమాట, అమలులో అవినీతి పేరుకుపోయిన మాట వాస్తవమే. కానీ దశాబ్దాలుగా పేదవాడి ఆకలితీరుస్తున్న ఏకైక పథకం ఇది. దీనితో ప్రధానంగా స్త్రీలు, భావిభారత పౌరులకు కనీస ఆహారం లభిస్తోంది. కేజీ ఒక్క రూపాయి లెక్కన ఒక్కొక్కరికి ఆరు కేజీలు, ఇంట్లో నలుగురుంటే 24 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సబ్సిడీతో రేషన్ ద్వారా అందిస్తోంది. కేవలం మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది 2 కోట్ల 79 లక్షల మంది. అంటే తెలంగాణ జనాభా మూడున్నర కోట్లలో ఇది 80 శాతం. నూటికి 20 శాతం మంది మాత్రమే సొంతంగా బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారని ప్రభుత్వమే తేల్చింది. మిగిలినవాళ్లంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారేనని ప్రభుత్వం అంచనావేసి, వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించి, వారికి సరిగ్గా సరుకులు అందుతున్నాయా లేదా అని పరిశీలించి, చివరకు నేరుగా లబ్ధిదారులకే రేషన్ బియ్యం తదితరాలు అందేలా, ఆధార్‌తో అనుసం«ధానం చేసి, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటువంటి తరుణంలో, ప్రభుత్వం రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఒకటి అవినీతి. మరొక ప్రధానమైన అంశం– లబ్ధిదారులు ఈ బియ్యం వినియోగించుకోకుండా అమ్ముకుంటున్నారని. ప్రజలు వెచ్చిస్తున్న ఒక్క రూపాయి సహా, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలిపి మొత్తం పాతిక రూపాయలకు పైగానే ఒక కిలో బియ్యానికి ఖర్చు అవుతున్నది. కనుక ఎవరో వ్యాపారస్తులకు కాక, ప్రజలకే నేరుగా ఇప్పుడు ఖర్చు చేస్తున్న పాతికరూపాయలకు అదనంగా కొంత కలిపి, మొత్తం 900 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలన్నది ప్రభుత్వ యోచన. అలాగే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ అండ్ హవేలీ)ఈ నగదు బదిలీ అమలవున్నది. అది సత్ఫలితాలిస్తున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం పేదల మంచి కోసమే ఆలోచించే ఈ కార్యక్రమానికి పూనుకోవచ్చుగాక. కానీ ఆచరణలో ఇది అత్యంత ప్రమాదాన్ని కొనితెస్తుంది. మధ్యాహ్న భోజనం ఒక్కపూట మినహాయిస్తే మిగిలిన రెండు పూటలూ ఈ రేషన్ బియ్యంపైనే ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు. ఈ పథకం మీద ఆధారపడి 60 శాతం మంది ప్రజలు బతుకుతున్నారని ఏ గ్రామాన్ని పరిశీలించినా అర్థం అవుతుంది. పోనీ సగం మందే ఈ పథకం ద్వారా వస్తున్న బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారనుకుందాం. అలా చూసినా తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? పురుషాధిపత్య సమాజంలో ఎంత మంది స్త్రీలకు ఆర్థికాంశాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది? అసలు స్త్రీల చేతికి ఆ డబ్బు వస్తుందా? వచ్చినా నాలుగు తన్నులు తన్ని ఏ తాగుడుకో తగులబెట్టేవారు ఈ బియ్యం అవసరమైన కుటుంబాల్లోని వారే. మహిళలపై హింస పెట్రేగి, వారిని మరిన్ని సమస్యల్లోకి తోసివేసే ప్రమాదం నగదు బదిలీ ప్రక్రియలో ఉండదని హామీ ఇవ్వగలరా? ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలను విపరీతంగా పెంచే ప్రమాదం కూడా ఉంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? డిజిటల్ యుగంలో బయోమెట్రిక్ వంటి సాధనాలతో అవినీతిని కొంత మేరకైనా తగ్గించే అవకాశం ఉంది. పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. అవినీతిని అరికట్టేందుకు పేదప్రజలపై అస్త్రాలు ప్రయోగించడం కాకుండా బడాబాబుల, వ్యాపారస్తుల మోసాలను అరికట్టడానికి, పథకం దుర్వినియోగాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేయాలి. చివరగా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్తున్న సన్న బియ్యాన్ని రేషన్ బియ్యానికి కూడా వర్తింపజేయాలి. ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో ఉన్నవి. ప్రభుత్వం చేయగలిగినవి. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
ఒకటి నుంచి రేషన్ బంద్
ఆత్మహత్య చేసుకున్న రేషన్ డీలర్ మృతదేహంతో రాస్తారోకో బోధన్ టౌన్ (బోధన్): రేషర్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోతే ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేశ్ బాబు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ దత్తు అప్పుల బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పోస్టు మార్టం అనంతరం మృతదేహంతో రేషన్ డీలర్ల సంఘం ఆందోళన నిర్వహించింది. బోధన్‌లోని రైల్వే గేట్ వద్ద డీలర్లు రాస్తారోకో చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ అప్పులు తీర్చలేక నల్లగొండకు చెందిన శ్రీనివాస్, రుద్రూర్‌కు చెందిన దత్తు, సిరిసిల్లకు చెందిన మరో రేషన్ డీలర్ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. -
ఇది పేదలపై యుద్ధమా!
♦ ఇటు కార్డుల కోత - అటు ధరల మోత ♦ నెలనెలా సరుకులు తీసుకోలేదని రేషన్ బంద్ ♦ వలస కూలీలకు సీఎం హామీ హుష్‌కాకి ♦ జన్మభూమిలో ఇచ్చిన కార్డులకూ ఎసరు ♦ తొలగించడానికి రకరకాల సాకులు ♦ టూవీలర్ ఉన్నా, ఫ్రిజ్ ఉన్నా కార్డు కట్ ♦ ఆధార్ ఉన్నా 95 వేల మందికి నో రేషన్ ♦ చౌక దుకాణాల్లో ‘మార్కెట్’ రేట్లు ♦ ఒకటి రెండు సరుకులకే చౌక ధరలు ♦ 5 నెలల్లో 9.14 లక్షల కుటుంబాలకు కార్డులు కట్.. పొట్టకూటి కోసం వలస వెళ్లిన పేదలకు నిర్దాక్షిణ్యంగా రేషన్ ఆపేస్తున్నారు. కార్డులు కట్ చేస్తున్నారు. పనులు లేకనో.. అనారోగ్యమో.. కారణాలేవైనా పొరుగూరు వెళ్లిన పేదలు నెలనెలా వచ్చి రేషన్ తీసుకోకపోతే ఇక అంతే.. రేషన్ ఉండదు.. కార్డులూ ఉండవు. పేదలకు ఇచ్చే రేషన్‌ను తగ్గించేయడానికి, కార్డులు తొలగించడానికి రాష్ర్ట ప్రభుత్వం పలు మార్గాలు వెతుకుతోంది. మార్చిలో 1.4 కోట్లు ఉన్న రేషన్ కార్డులు ఆగస్టు నాటికి 1.31 కోట్లకు తగ్గటమే అందుకు నిదర్శనం. కార్డులతోపాటు సరుకులూ తగ్గించేస్తున్నారు. గతంలో 9 రకాల సరుకులు చౌక ధరల దుకాణాలలో అందేవి. ఇపుడు బియ్యం, పంచదార తప్ప మిగిలినవి దొరకడమే లేదు. అది కూడా అరకొరగానే. కందిపప్పు లాంటివి దొరికినా ధరలు దారుణంగా షాక్ కొడుతున్నాయి. బహిరంగ మార్కెట్లోనే బెటర్ అనేలా ధరలు ఉంటున్నాయి. అయినా చెప్పిన రేటుకు కందిపప్పు కొంటేనే మిగిలిన సరుకులు ఇస్తామని డీలర్లు బెదిరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. జన్మభూమి సభల్లో మంజూరు చేసిన కార్డులకూ కోత పెట్టడానికి రాష్ర్టప్రభుత్వం రకరకాల మార్గాలు వెతుకుతోంది. టూవీలర్ ఉంటే కట్. ఫ్రిజ్ కనిపిస్తే కట్. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో చౌక ధరల దుకాణాలు, సరుకుల ధరలు, రేషన్ కార్డుల పరిస్థితిపై ఫోకస్... సాక్షి, అమరావతి: ‘‘ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పేదలు ప్రతి నెలా సరుకులు తీసుకెళ్లలేకపోతున్నారు. వారికి ఊరట కల్గించే విధంగా ఇక నుంచి మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం’’.. - గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. కానీ వాస్తవానికి జరుగుతున్నదేమంటే ఇలాంటి పేదలకు రేషన్ ఆపేస్తున్నారు. ఉన్న ఊళ్లో పూటగడవక పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ వలసలు వెళ్లే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఎగవేస్తోంది. అంటే కార్డులను కట్ చేసేస్తోందన్నమాట. ఈ-పాస్ నూతన సాంకేతిక విధానమంటూ.. రేషన్ సరుకుల పంపిణీకి ఇదో వినూత్న విధానమంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూనే పేదల కార్డులకు రాష్ర్టప్రభుత్వం కోతపెడుతోంది. ‘ఇనాక్టివ్’ సాకు చూపుతూ నెలకు 1.83 లక్షల చొప్పున ప్రభుత్వం తొలగిస్తూ వస్తోంది. స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్న వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడి నుంచి వచ్చి నెల నెలా రేషన్ తీసుకెళ్లలేక పోతున్నారు. ఇలాంటి వారు ప్రతి నెలా రేషన్ పొందలేకపోతున్నారు. వలసలు, అనారోగ్యం, ఇతర శుభ, అశుభ కార్యక్రమాల కారణంగా ప్రతినెలా క్రమం తప్పకుండా రేషన్ తీసుకోలేకపోతుండటాన్ని సాకుగా చేసుకొని ‘ఇనాక్టివ్’ పేరుతో ప్రభుత్వం రేషన్ ఎగ్గొడుతోంది. అందుకే ఈ ఏడాది మార్చిలో 1.40 కోట్ల రేషన్‌కార్డులు ఉండగా ఆగస్టు నాటికి ఆ సంఖ్య 1.31 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఐదు నెలల కాలంలో 9.14 లక్షల కార్డులు తగ్గిపోయాయి. కొత్త కార్డులు ప్రకటనలకే పరిమితం.. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొత్తగా ఇచ్చిన 10.10 లక్షల కార్డులతో కలిపి రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల 65 వేల 935 తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సాక్షిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఇంకా అర్హులైన అనేకమంది పేదలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న కార్డులను ఏవిధంగా తొలగించాలా అని ఆలోచిస్తోంది. జన్మభూమి కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కొత్తగా 10.10 లక్షల రేషన్‌కార్డులు అట్టహాసంగా పంపిణీ చేశారు. అలా దరఖాస్తు చేసుకున్న సమయంలో కొంతమంది లబ్ధిదారులు కుటుంబ వివరాలు సరిగా పొందుపర చలేదంటూ వారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలగించడానికి సవాలక్ష కారణాలు.. ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ సరకులు సరఫరా చేస్తున్నందున ప్రభుత్వంపై మోయలేని భారం పడుతోందని వాటిలో సగం భారం తగ్గిపోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో కొంత, ఈ-పాస్ విధానాన్ని అమలు చే యడం వల్ల కొంత మేరకు ఆర్థిక భారం తగ్గినా ఇది చాలదన్నట్లు మరిన్ని రేషన్ కార్డులు తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వరుసగా మూడు నెలలు సరుకులు తీసుకెళ్లని లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేషన్ కట్ చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎవ్వరికైనా ద్విచక్రవాహనం లేదా ఫ్రిజ్ ఉంటే అలాంటి వారికి కూడా భవిష్యత్తులో రేషన్‌కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినా... బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే రేషన్ షాపుల్లో విక్రయించే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉండటం సహజం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రేషన్ షాపుల్లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి ఒక్కసారిగా కందులు, మినుములు, శనగలు దిగుమతులు కావడంతో పాటు ఆన్ లైన్ వ్యాపారం, ఫార్వర్డ్ ట్రేడింగ్ వల్ల ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బహిరంగ మార్కెట్లో మొన్నటి రూ. 190 వరకు ధర పలికిన కందిపప్పు నేడు రూ. 90 నుంచి 100లకే దొరుకుతోంది. ఫార్వర్డ్ ట్రేడి ంగ్‌లో వ్యాపారి ఎవ్వరైనా చిరుధాన్యాలు కొనుగోలు చేస్తే ముందుగా పది శాతం సొమ్ము చెల్లిస్తే చాలు. ఏ ధర వద్ద ఒప్పందం జరిగిందో ఆర్డర్ ఇచ్చిన మొత్తం సరుకును అదే ధర చెల్లించి తీసుకోవచ్చు. ఎక్కువ మంది వ్యాపారులు ట్రేడింగ్ చేయడం వల్ల చిరు ధాన్యాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయని వ్యాపారులంటున్నారు. ఆధార్ ఉన్నా రేషన్ కట్ తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉన్నా 95 వేల కుటుంబాలకి రేషన్ అందడం లేదు. ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పటికీ ఈ-పాస్ మిషన్‌లో వేలి ముద్రలు సరిగా పడడం లేదన్న సాకుతో రేషన్ నిలిపేశారు. వేలిముద్రలు పడకపోవడం కారణంగా తమకు డీలర్లు రేషన్ నిలిపేశారని, న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్లకు 95,339 మంది లబ్దిదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారికి వీఆర్వోల ద్వారా రేషన్ సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందులో 16,435 మందికి మాత్రమే సరుకులు అందాయి. మిగిలిన 78,904 మంది లబ్దిదారులకు సరుకులు అందలేదు. పలుమార్లు మొరపెట్టుకున్నా... నా ఆధార్‌కార్డు నెంబరు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి రేషన్‌కార్డులో నమోదైందట. దీంతో నాకు మూడు నెలలుగా రేషన్ ఇవ్వడం లేదు. తహశీల్దారుకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు. నంద్యాలకు నాలుగైదు సార్లు తిరిగితే అక్కడ ఆధార్ నంబరును తొలగించారు. గిద్దలూరులో నా రేషన్‌కార్డులో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి రేషన్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదు. - ఎస్.వీరాంజనేయులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా వేలిముద్రలు పడడం లేదంటున్నారు.. నా వేలి ముద్రలు ఈ-పాస్ మిషన్‌లో సరిగా పడటం లేదంట. ఎందుకు పడడంలేదో చెప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకోమని చెపుతున్నారు. పరిశీలించి న్యాయం చేయాలి. - మల్లే వెంకటమ్మ,ఏఎస్‌పేట, నెల్లూరు జిల్లా సరుకులు తగ్గాయి.. రేషన్ కూడా తగ్గింది.. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరిట కిలో కందిపప్పు, కిలో గోధుమపిండి, కిలో గోధుమలు, ఒక పామాయిల్ ప్యాకెట్, అర కిలో చక్కెర, కిలో ఉప్పు ప్యాకెట్, అర కిలో చింతపండు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపును ఒక సంచిలో ఉంచి సబ్సిడీ తొమ్మిది సరుకులనూ కేవలం రూ. 85లకే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పామాయిల్ సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మొదట్లో చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు తెల్ల రేషన్ కార్డుల్లో పేర్లు నమోదైన ప్రతి ఒక్కొక్కరి (యూనిట్) పేరిట తెలంగాణలో నెలకు 6 కిలోల బియ్యం ఇస్తుంటే ఏపీలో మాత్రం ఒక్కొక్కరికి 5 కిలోలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అదిరిపోయే ధరలు... తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డులున్న లబ్ధిదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు రూ. 50లకే అందిస్తున్నారు. కానీ ఏపీలోని చౌక ధరల దుకాణాలలో సబ్సిడీ కందిపప్పు కిలో రూ. 120 చొప్పున అమ్ముతున్నారు. కందిపప్పు మాత్రమే కాదు.. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తుండడం రాష్ర్టంలో పరిపాటిగా మారింది. కందిపప్పు తక్కువ ధరకే బయట మార్కెట్లో దొరుకుతుండటంతో లబ్ధిదారులు వాటిని రేషన్ షాపుల్లో తీసుకెళ్లడం మానేశారు. దీంతో రేషన్ డీలర్లు కూడా కందిపప్పు కోటా వద్దని మొర పెట్టుకుంటున్నా గోడౌన్లలో స్టాకు ఎక్కువగా ఉందని కారణం చూపుతూ బలవంతంగా రేషన్ డీలర్లకు అంటగడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు కందిపప్పు కోసం డీడీలు తీసి పంపాలని రెవెన్యూ అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో చేసేది ఏమీలేక తలలు పట్టుకుంటున్నారు. దాంతో వారు తాము చెప్పిన రేటుకే కందిపప్పు తీసుకెళ్ళాలని, లేకపోతే మిగిలిన సరుకులు ఇవ్వబోమని లబ్ధిదారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.