ఇది పేదలపై యుద్ధమా! | Ration bandh due to ration shortage, no ration cards | Sakshi
Sakshi News home page

ఇది పేదలపై యుద్ధమా!

Published Sun, Oct 9 2016 4:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

ఇది పేదలపై యుద్ధమా!

ఇది పేదలపై యుద్ధమా!

ఇటు కార్డుల కోత - అటు ధరల మోత
నెలనెలా సరుకులు తీసుకోలేదని రేషన్ బంద్
వలస కూలీలకు సీఎం హామీ హుష్‌కాకి
జన్మభూమిలో ఇచ్చిన కార్డులకూ ఎసరు
తొలగించడానికి రకరకాల సాకులు
టూవీలర్ ఉన్నా, ఫ్రిజ్ ఉన్నా కార్డు కట్
ఆధార్ ఉన్నా 95 వేల మందికి నో రేషన్
చౌక దుకాణాల్లో ‘మార్కెట్’ రేట్లు
ఒకటి రెండు సరుకులకే చౌక ధరలు
5 నెలల్లో 9.14 లక్షల కుటుంబాలకు కార్డులు కట్..

 
పొట్టకూటి కోసం వలస వెళ్లిన పేదలకు నిర్దాక్షిణ్యంగా రేషన్ ఆపేస్తున్నారు. కార్డులు కట్ చేస్తున్నారు. పనులు లేకనో.. అనారోగ్యమో.. కారణాలేవైనా పొరుగూరు వెళ్లిన పేదలు నెలనెలా వచ్చి రేషన్ తీసుకోకపోతే ఇక అంతే.. రేషన్ ఉండదు.. కార్డులూ ఉండవు. పేదలకు ఇచ్చే రేషన్‌ను తగ్గించేయడానికి, కార్డులు తొలగించడానికి రాష్ర్ట ప్రభుత్వం పలు మార్గాలు వెతుకుతోంది. మార్చిలో 1.4 కోట్లు ఉన్న రేషన్ కార్డులు ఆగస్టు నాటికి 1.31 కోట్లకు తగ్గటమే అందుకు నిదర్శనం. కార్డులతోపాటు సరుకులూ తగ్గించేస్తున్నారు. గతంలో 9 రకాల సరుకులు చౌక ధరల దుకాణాలలో అందేవి.
 
 ఇపుడు బియ్యం, పంచదార తప్ప మిగిలినవి దొరకడమే లేదు. అది కూడా అరకొరగానే. కందిపప్పు లాంటివి దొరికినా ధరలు దారుణంగా షాక్ కొడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లోనే బెటర్ అనేలా ధరలు ఉంటున్నాయి. అయినా చెప్పిన రేటుకు కందిపప్పు కొంటేనే మిగిలిన సరుకులు ఇస్తామని డీలర్లు బెదిరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. జన్మభూమి సభల్లో మంజూరు చేసిన కార్డులకూ కోత పెట్టడానికి రాష్ర్టప్రభుత్వం రకరకాల మార్గాలు వెతుకుతోంది. టూవీలర్ ఉంటే కట్. ఫ్రిజ్ కనిపిస్తే కట్. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో చౌక ధరల దుకాణాలు, సరుకుల ధరలు, రేషన్ కార్డుల పరిస్థితిపై ఫోకస్...
 
సాక్షి, అమరావతి:  ‘‘ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పేదలు ప్రతి నెలా సరుకులు తీసుకెళ్లలేకపోతున్నారు. వారికి ఊరట కల్గించే విధంగా ఇక నుంచి మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం’’..
 - గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.  
 
కానీ వాస్తవానికి జరుగుతున్నదేమంటే ఇలాంటి పేదలకు రేషన్ ఆపేస్తున్నారు. ఉన్న ఊళ్లో పూటగడవక పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ వలసలు వెళ్లే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఎగవేస్తోంది. అంటే కార్డులను కట్ చేసేస్తోందన్నమాట. ఈ-పాస్ నూతన సాంకేతిక విధానమంటూ..  రేషన్ సరుకుల పంపిణీకి ఇదో వినూత్న విధానమంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూనే పేదల కార్డులకు రాష్ర్టప్రభుత్వం కోతపెడుతోంది. ‘ఇనాక్టివ్’ సాకు చూపుతూ నెలకు 1.83 లక్షల చొప్పున ప్రభుత్వం తొలగిస్తూ వస్తోంది. 

స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్న వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడి నుంచి వచ్చి నెల నెలా రేషన్ తీసుకెళ్లలేక పోతున్నారు. ఇలాంటి వారు ప్రతి నెలా రేషన్ పొందలేకపోతున్నారు. వలసలు, అనారోగ్యం, ఇతర శుభ, అశుభ కార్యక్రమాల కారణంగా ప్రతినెలా క్రమం తప్పకుండా రేషన్ తీసుకోలేకపోతుండటాన్ని సాకుగా చేసుకొని ‘ఇనాక్టివ్’ పేరుతో ప్రభుత్వం రేషన్ ఎగ్గొడుతోంది. అందుకే ఈ ఏడాది మార్చిలో 1.40 కోట్ల రేషన్‌కార్డులు ఉండగా ఆగస్టు  నాటికి ఆ సంఖ్య 1.31 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఐదు నెలల కాలంలో 9.14 లక్షల కార్డులు తగ్గిపోయాయి.
 
కొత్త కార్డులు ప్రకటనలకే పరిమితం..
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొత్తగా ఇచ్చిన 10.10 లక్షల కార్డులతో కలిపి రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల 65 వేల 935 తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సాక్షిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఇంకా అర్హులైన అనేకమంది పేదలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న కార్డులను ఏవిధంగా తొలగించాలా అని ఆలోచిస్తోంది. జన్మభూమి కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కొత్తగా 10.10 లక్షల రేషన్‌కార్డులు అట్టహాసంగా పంపిణీ చేశారు. అలా దరఖాస్తు చేసుకున్న సమయంలో కొంతమంది లబ్ధిదారులు కుటుంబ వివరాలు సరిగా పొందుపర చలేదంటూ వారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
 
తొలగించడానికి సవాలక్ష కారణాలు..
ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ సరకులు సరఫరా చేస్తున్నందున ప్రభుత్వంపై మోయలేని భారం పడుతోందని వాటిలో సగం భారం తగ్గిపోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో కొంత, ఈ-పాస్ విధానాన్ని అమలు చే యడం వల్ల కొంత మేరకు ఆర్థిక భారం తగ్గినా ఇది చాలదన్నట్లు మరిన్ని రేషన్ కార్డులు తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వరుసగా మూడు నెలలు సరుకులు తీసుకెళ్లని లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేషన్ కట్ చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎవ్వరికైనా ద్విచక్రవాహనం లేదా ఫ్రిజ్ ఉంటే అలాంటి వారికి కూడా భవిష్యత్తులో రేషన్‌కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గినా...
బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే రేషన్ షాపుల్లో విక్రయించే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉండటం సహజం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రేషన్ షాపుల్లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి ఒక్కసారిగా కందులు, మినుములు, శనగలు దిగుమతులు కావడంతో పాటు ఆన్ లైన్ వ్యాపారం, ఫార్వర్డ్ ట్రేడింగ్ వల్ల ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బహిరంగ మార్కెట్లో మొన్నటి రూ. 190 వరకు ధర పలికిన కందిపప్పు నేడు రూ. 90 నుంచి 100లకే దొరుకుతోంది. ఫార్వర్డ్ ట్రేడి ంగ్‌లో వ్యాపారి ఎవ్వరైనా చిరుధాన్యాలు కొనుగోలు చేస్తే ముందుగా పది శాతం సొమ్ము చెల్లిస్తే చాలు. ఏ ధర వద్ద ఒప్పందం జరిగిందో ఆర్డర్ ఇచ్చిన మొత్తం సరుకును అదే ధర చెల్లించి తీసుకోవచ్చు. ఎక్కువ మంది వ్యాపారులు ట్రేడింగ్ చేయడం వల్ల చిరు ధాన్యాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయని వ్యాపారులంటున్నారు.
 
ఆధార్ ఉన్నా రేషన్ కట్
తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉన్నా 95 వేల కుటుంబాలకి రేషన్ అందడం లేదు. ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పటికీ ఈ-పాస్ మిషన్‌లో వేలి ముద్రలు సరిగా పడడం లేదన్న సాకుతో రేషన్ నిలిపేశారు. వేలిముద్రలు పడకపోవడం కారణంగా తమకు డీలర్లు రేషన్ నిలిపేశారని, న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్లకు 95,339 మంది లబ్దిదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారికి వీఆర్వోల ద్వారా రేషన్ సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందులో 16,435 మందికి మాత్రమే సరుకులు అందాయి. మిగిలిన 78,904 మంది లబ్దిదారులకు సరుకులు అందలేదు.
 
పలుమార్లు మొరపెట్టుకున్నా...
నా ఆధార్‌కార్డు నెంబరు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి రేషన్‌కార్డులో నమోదైందట. దీంతో నాకు మూడు నెలలుగా రేషన్ ఇవ్వడం లేదు. తహశీల్దారుకు పలుమార్లు  మొరపెట్టుకున్నా స్పందన లేదు. నంద్యాలకు నాలుగైదు సార్లు తిరిగితే అక్కడ ఆధార్ నంబరును తొలగించారు. గిద్దలూరులో నా రేషన్‌కార్డులో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి రేషన్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదు.
 - ఎస్.వీరాంజనేయులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
 
వేలిముద్రలు పడడం లేదంటున్నారు..
నా వేలి ముద్రలు ఈ-పాస్ మిషన్‌లో సరిగా పడటం లేదంట. ఎందుకు పడడంలేదో చెప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకోమని చెపుతున్నారు. పరిశీలించి న్యాయం చేయాలి.
 - మల్లే వెంకటమ్మ,ఏఎస్‌పేట, నెల్లూరు జిల్లా
 
సరుకులు తగ్గాయి.. రేషన్ కూడా తగ్గింది..
గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరిట కిలో కందిపప్పు, కిలో గోధుమపిండి, కిలో గోధుమలు, ఒక పామాయిల్ ప్యాకెట్, అర కిలో చక్కెర, కిలో ఉప్పు ప్యాకెట్, అర కిలో చింతపండు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపును ఒక సంచిలో ఉంచి సబ్సిడీ తొమ్మిది సరుకులనూ కేవలం రూ. 85లకే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పామాయిల్ సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మొదట్లో చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు తెల్ల రేషన్ కార్డుల్లో పేర్లు నమోదైన ప్రతి ఒక్కొక్కరి (యూనిట్) పేరిట తెలంగాణలో నెలకు 6 కిలోల బియ్యం ఇస్తుంటే ఏపీలో మాత్రం ఒక్కొక్కరికి 5 కిలోలు మాత్రమే  సరఫరా చేస్తున్నారు.
 
 అదిరిపోయే ధరలు...
 
తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డులున్న లబ్ధిదారులకు  సబ్సిడీపై కిలో కందిపప్పు రూ. 50లకే అందిస్తున్నారు. కానీ ఏపీలోని చౌక ధరల దుకాణాలలో సబ్సిడీ కందిపప్పు కిలో రూ. 120 చొప్పున అమ్ముతున్నారు. కందిపప్పు మాత్రమే కాదు.. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తుండడం రాష్ర్టంలో పరిపాటిగా మారింది. కందిపప్పు తక్కువ ధరకే బయట మార్కెట్లో దొరుకుతుండటంతో లబ్ధిదారులు వాటిని రేషన్ షాపుల్లో తీసుకెళ్లడం మానేశారు.

దీంతో రేషన్ డీలర్లు కూడా కందిపప్పు కోటా వద్దని మొర పెట్టుకుంటున్నా గోడౌన్లలో స్టాకు ఎక్కువగా ఉందని కారణం చూపుతూ బలవంతంగా రేషన్ డీలర్లకు అంటగడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు కందిపప్పు కోసం డీడీలు తీసి పంపాలని రెవెన్యూ అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో చేసేది ఏమీలేక తలలు పట్టుకుంటున్నారు. దాంతో వారు తాము చెప్పిన రేటుకే కందిపప్పు తీసుకెళ్ళాలని, లేకపోతే మిగిలిన సరుకులు ఇవ్వబోమని లబ్ధిదారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement