సాక్షి, రాజమండ్రి : ‘తెల్ల రేషన్ కార్డుదారులకు చౌక ధరలకే పంపిణీ చేస్తున్న బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ పథకాలను మరింత మెరుగ్గా అమలుచేస్తాం’.
– 2014 ఎన్నికల సందర్భంగా చంద్ర బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోని 43వ పేజీలో పొందు పరిచిన హామీ ఇది.
‘మరింత మెరుగ్గా’ అంటే.. మరింత తక్కువ ధరకు సరుకులు పంపిణీ చేస్తారని పేదవర్గాల వారు ఆశించారు. తీరా అధికారంలోకి వచ్చాక వారి ఆశలను అడియాసలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వచ్చింది చంద్రబాబు సర్కారు. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి కోటా సరుకులకు కోత పెట్టింది. ‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ఆ పండుగల్లో బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకం సరుకులు పేదలకు అంటగట్టి కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అండ్ కో అడ్డగోలుగా దోచేసింది. నాలుగేళ్ల పాటు బియ్యం మాత్రమే పంపిణీ చేసిస సర్కారు ఎన్నికలకు ఏడాది ముందు ఓటర్లకు గేలం వేసే పనిలో పంచదార, కందిపప్పు పంపిణీని పునరుద్ధరించింది.
మండపేట: పేదవర్గాల వారికి చవక ధరకే బియ్యం, పప్పు దినుసులు, నూనె, పంచదార, ఇతర నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని వీలైనంత మెరుగ్గా అమలుచేస్తూ వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ‘కోటాకు కోత.. పేదల నోటికి వాత’ అన్నట్టు వ్యవహరించింది.
జిల్లాలో 51.51 లక్షల జనాభా ఉండగా దాదాపు 17,89,183 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయి.
తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర కేటగిరీల్లో 16,44,178 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,659 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు రూ. 200.25లకే పంచదార, పామాయిల్, కందిపప్పు, గోధుమలు, చింతపండు తదితర పది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవారు. బయటి మార్కెట్‌లో ధరలతో పోలిస్తే ఒక్కో కార్డుదారునికి రూ.440 నుంచి రూ.500 వరకూ లబ్ధి చేకూరేది. వీటితో పాటు రూపాయికి కిలో బియ్యాన్ని అందజేసేవారు.
ఒకటొకటిగా సరుకులకు ఎసరు
అయితే 2014లో అధికారం చేపట్టిన వెంటనే నిత్యావసర వస్తువుల పంపిణీలో భారీగా కోత విధించడం మొదలు పెట్టింది చంద్రబాబు సర్కారు. మొదట్లో బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమల పంపిణీ జరిగేది. గ్యాస్ కనెక్షన్‌లేని వారికి లీటరు రూ. 15 చొప్పున నాలుగు లీటర్లు, ఉన్న వారికి రూ. 19కు లీటరు కిరోసిన్ ఇచ్చేవారు. గద్దెనెక్కిన ఏడాదికే కందిపప్పు, గోధుమలు, పామాయిల్‌లను ఎత్తేసిన సర్కారు మూడేళ్ల క్రితం పంచదార, కిరోసిన్‌లను నిలిపివేసి బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తూ వచ్చింది.
ఇలా పేదల కడుపు కొట్టడానికి నిర్దాక్షిణ్యంగా పూనుకున్న చంద్రబాబు సర్కారే.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఏడాది క్రితం సరుకుల పునరుద్దరణ ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చే ఎత్తుగడ వేసింది. గత ఏడాది జనవరి నుంచి చక్కెర పంపిణీని తిరిగి నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించింది.
భయపెడుతున్న బయటి మార్కెట్ ధరలు
రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయడంతో బయటి మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పేదవర్గాల వారు బెంబెలెత్తుతున్నారు. రేషన్ కార్డుపై అరకేజీ పంచదార రూ.6.75కు సరఫరా చేయగా మార్కెట్‌లో పంచదార కిలో రూ.40 వరకూ ఉంది. అలాగే లీటరు కిరోసిన్ రూ.15కు సరఫరా చేస్తే బయట రూ.60 పలుకుతోంది. రేషన్ గోధుమ పిండి రూ.16 కాగా బయటి దుకాణాల్లో రూ.40 ఉంది. మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయి పేద వర్గాల వారికి చుక్కలు చూపిస్తున్నాయి.
కానుకల్లో నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి
‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ప్రభుత్వం ఆయా పండుగల్లో నాసిరకం సరుకులను తూకం తక్కువగా ప్యాకింగ్ చేసి లబ్ధిదారులకు అంటగడుతోంది. పురుగులు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు వంటి నాసిరకం వస్తువులను అంటగట్టడం ద్వారా కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలను చంద్రబా బు, ఆయన అనుచరులు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏం తిని బతకాలి?
గతంలో ఆయిల్, చింతపండు ఇతర నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల్లో చౌకగా ఇచ్చేవారు. బయటి మార్కెట్‌లో వాటి ధరలు మండిపోతున్నాయి. చౌక డిపోల్లో సరుకులు ఆపేస్తే పేద ప్రజలు ఏం తిని బతకాలి? రేషన్ సరుకులు ఆపేయడమంటే పేద ప్రజలను ఇబ్బందులు
పాలుచేయడమే.
– విత్తనాల శ్రీనివాసరావు, ఐ.పోలవరం.
పేదలకు పెద్ద ఇబ్బంది
గత ప్రభుత్వంలో అన్ని రకాల సరుకులు ఇచ్చేవారు. ఇద్దరు, ముగ్గురు ఉండే కుటుంబానికి 15 నుంచి 20 రోజుల వరకు సరిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు ఆపేయడం వలన పేదవర్గాల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– మనువర్తి ఏసురాజు, కేశవరం, మండపేట రూరల్
అన్నీ బయట కొనుక్కోవాల్సిందే..
నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం పేదల ఇచ్చే రేషన్‌లో కోటా పెట్టింది. గతంలో రూ.200 పట్టుకుని వెళితే రేషన్‌లో పది రకాలకు పైగా సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నీ బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.
– బొడ్డపాటి మంగరాజు, మండపేట
Comments
Please login to add a commentAdd a comment