సాక్షి,సిటీబ్యూరో: రేషన్ సరుకుల పంపిణీకి గడువు మిగిలింది ఇక రెండు రోజులే. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి రేషన్ కోటా పంపిణీ నిలిచిపోతుంది. రేషన్ షాపులు సైతం తెరవరు. మార్చి నుంచి ప్రతినెలా15 వరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ జరుగనుంది. దీనిపై గత వారం రోజులుగా పౌరసరఫరాల శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. వినియోగదారుల సెల్‌ఫోన్‌లకు సంక్షిప్త సమాచారంతో పాటు ప్రత్యేక వాహనాలతో ప్రచారం నిర్వహిస్తోంది. రేషన్ షాపులకు వారాంతపు సెలవు రోజు సైతం రద్దు చేసింది. మహా నగరం పరిధిలో సుమారు 26 శాతం కుటుంబాలు సరుకుల పంపిణీకి దూరంగానే ఉన్నారు. ప్రజా పంపి ణీ వ్యవస్ధలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రేషన్ సరుకుల పంపిణీ గడవును కుదించిన విషయం విదితమే. గత నెల జనవరిలో పక్షం రోజుల గడువు విధించి నప్పటికీ పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 25 వ తేదీవరకు పొడిగించింది. తిరిగి ఈ నెల సరుకుల పంపిణీకి 20 వరకు డెడ్‌లైన్ విధించింది. గత నెల మాదిరిగా సమస్య పునరావృతం కాకుండా గడువుపై ప్రచారం ముమ్మరం చేస్తున్న పూర్తి స్థాయి సరుకుల పంపిణీ ప్రక్రియ మాత్రం పూర్తయ్యే అవకాశాలు కానరావడం లేదు.
2.87లక్షల కుటుంబాలు
హైదరాబాద్ మహా నగరం పరిధిలోని ఆహార భద్రత (రేషన్) కార్డు దారులైన సుమారు 2.87 లక్షల కుటుంబాలు రేషన్ సరుకులు డ్రా చేయనట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. మహా నగర పరిధిలో పౌరసరఫరాల శాఖకు 12 సర్కిల్స్ ఉండగా వాటి పరిధిలో సుమారు 10.94 లక్షల ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం కార్డుల్లో ఈ నెల కోటా సరుకులు డ్రా చేసి కార్డుల సంఖ్య 8.06 లక్షలకు మించలేదు. మిగిలిన కార్డులు గడువు సమీపిస్తున్నా సరుకులను మాత్రం డ్రా చేయలేదు. రేషన్ షాపులకు వారాంతపు సెలవు దినమైన శుక్రవారం కూడా పనిదినంగా మార్చి ఒకటవ తేదీ నుంచి వరసగా 20 వరకు రేషన్ షాపు తెరిచి ఉంచి సరుకులు పంపిణీ ప్రక్రియను కొనసాగించారు. అయినప్పటికీ కొన్ని కుటుంబాలు ఆర్ధిక సమస్యనో? లేక వీలుపడకనో సరుకులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment