సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద మంజూరు చేసిన యూనిట్ల ప్రారంభంపై ఎస్సీ అభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఈ పథకం కింద అర్హుల ఎంపిక, నిధుల విడుదలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం.. నిర్దిష్ట గడువు విధించడం ద్వారా మంజూరు చేసిన యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభించి ఆయా ఎస్సీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపర్చాలని స్పష్టం చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం యూనిట్ల ప్రారంభానికి డెడ్‌లైన్ నిర్దేశించుకుంది. డిసెంబర్ 31 కల్లా ఇప్పటివరకు యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా కసరత్తు మొదలుపెట్టింది.
వివిధ దశల్లో యూనిట్లు
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా నాలుగో విడతకు కూడా శ్రీకారం చుట్టింది. అయితే మూడు విడతల్లో 38,476 కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు జమ చేసింది. ఇప్పటివరకు కేవలం 15,650 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ కాగా.. మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని యూనిట్ల ప్రారంభానికి ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు వేగవంతం చేస్తోంది.
జిల్లాల వారీ సమీక్షకు ఆదేశం
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల దళితబంధు పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంజూరు చేసిన యూనిట్లు.. ప్రారంభించిన యూనిట్ల మధ్య భారీ అంతరం ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభం కాని యూనిట్లపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షల తర్వాత యూనిట్ల ప్రారంభానికి ఏయే చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు లాభసాటిగా ఉన్న వ్యాపార యూనిట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని భావిస్తున్నారు.
చదవండి: జాతీయ బరిలో బీఆర్‌ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment