సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని దాదాపు 11,108 మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆరునెలలుగా ఉన్న సుమారు రూ.436.27 కోట్ల డబ్బును విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున ఎన్నికలకు ముందు 1.31 లక్షల మంది దళితులతో జాబితాను నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వీరందరిలోనూ పథకం అమలుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది.
11వేలమందికి చెందిన.. రూ.436.27 కోట్లు !
పథకంలో ఎంపికైన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, వారి చేత వ్యాపారాలు ప్రారంభించే లక్ష్యంతో 2021 ఆగస్టు 16న అప్పటి సీఎం కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ఆరంభించారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని 18వేలమంది దళితులను పథకాన్ని ఎంపిక చేశారు. వీరిలో 11,315 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పు న ఇవ్వగా.. మిగిలిన వారికి రూ.10 లక్షలలోపు ఆర్థిక సాయం అందజేశారు.
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో తొలుత రెండురకాలుగా అమలు చేసింది. ఒకటి సాచురేషన్ (ఎంపిక చేసుకున్న ప్రాంతంలో) మోడ్, రెండోది టార్గెట్ మోడ్ (నియోజకవర్గాల వారీగా) విధానం. ఇందు లో టార్గెట్ మోడ్‌లో 11,387 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వారిలో 1413 మందికి రూ.126.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. సాచురేషన్ పద్ధతిలో మొత్తం 26,395 మందికి పథకాన్ని వర్తింపజేసింది. అందులో 9695 మందికి 309 కోట్లను విడుదల చేసింది. ఈ రెండు విధానాల్లో కలిపి 11,108 మంది ఖాతాల్లో మొత్తం రూ.436.27 కోట్లను ప్రభుత్వం ఖాతాల్లో వేసినా.. వారికి విత్‌డ్రా చేసుకునే వీలు మాత్రం ఇవ్వలేదు.
రెండో జాబితాలో దయనీయం..
టార్గెట్ మోడల్‌లో పథకం ప్రారంభించిన ప్రభుత్వం మొత్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గాల్లో 1,31,500 మంది లబ్ధిదారులను రెండోదశలో ఎంపిక చేసింది. వారికి పథకం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చింది. లబ్ధిదారులకు జారీ చేసేందుకు హార్డ్ కాపీలు కూడా సిద్ధం చేసింది. వీరి కోసం రూ.749 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఎంపికైన 1,31,500 మంది లబ్ధిదారులకు ఆఖరునిమిషంలో డబ్బులు రాకుండా నిలిచిపోయాయి. దాంతో ఈ పథకం అమలుపై కలవరం నెలకొంది.
సలహాదారులకు రాజభోగాలు
వివిధ విభాగాలలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను, నాయకులను రాజీనామా చేయిస్తోన్న కొత్త ప్రభుత్వం దళితబంధులో నామినేటెడ్ పోస్టుల వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దళిత బంధు కోసం ఇద్దరిని నామినేటెడ్ విధానంలో నెలకు రూ.2.50లక్షల చొప్పున వేతనాలు, వారికి ఐదుగురు సెర్ఫ్ సిబ్బందిని రిసోర్స్ పర్సన్ల (ఆరీ్ప)లుగా నియమించింది.
వీరికి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వీరు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు తీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఆరునెలలుగా దళితబంధు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా వీరిని కొత్త ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తోంది. వీరు జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో.. ఆయా జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఖర్చుల పేరిట చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి కారు, డ్రైవర్, ఆఫీస్ బాయ్, ట్రావెల్ అలవెన్సు తదితరాలు అదనం కావడం కొసమెరుపు.
వెంటనే జమ చేయాలి
మొదటి విడతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నాం. ఏడాదిన్నర అవుతున్నా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండో విడుత నిధులను విడుదల చేసి మా ఖాతాల్లో జమ చేయాలి. – పర్లపల్లి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, హుజూరాబాద్
నిధుల కోసం ఎదురుచూస్తున్నాం
దళితబంధు పథకంలో మొదటి విడతలో వచి్చన నిధులతో మినీ సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాం. రెండో విడుత నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి దుకాణాన్ని నడిపించాల్సి వస్తోంది. రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మలి విడత డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి. – గజ్జల అంజయ్య, లబ్దిదారుడు, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment