చుక్కా వెంకటయ్య
సికింద్రాబాదు నుంచి రైలులో ఔరంగాబాద్ వెళ్లాలంటే రెండు రూపాయలు పెట్టి టిక్కెట్టు కొనాలి. కానీ ఆ తల్లీబిడ్డల దగ్గరున్నది మొత్తం రెండే రూపాయలు. అందుకే ఆ ఒక్క టిక్కెట్టు కొని దానితోనే ముగ్గురూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు. ఔరంగాబాద్ జైలులో ఉన్న తెలంగాణ బిడ్డ చుక్కా రామయ్యని చూసేందుకు తల్లి నర్సమ్మ, చెల్లి రామాబాయి, తమ్ముడు వెంకటయ్య సికింద్రాబాదు నుంచి బయలుదేరారు. టిక్కెట్టు లేదన్న భయం కంటే, నిండా 20 యేళ్లు లేని బిడ్డ జైలులో ఎలా ఉన్నాడోనని, ఏం తింటున్నాడోననే ఆందోళనే ఎక్కువ ఆ తల్లికి. ఇదే టిక్కెట్టులేకుండా ప్రయాణించేలా చేసింది. ఔరంగాబాదులో రైలు ఆగగానే ఇద్దరు పిల్లలు పక్కనున్న గూడ్సు రైలు కింద నుంచి దూరి వెనక నుంచి స్టేషన్ బయటకెళ్తే, టిక్కెట్టుతో బయటకొచ్చి బిడ్డలను కలుసుకుంది ఆ తల్లి.
తెలంగాణ రైతాంగ పోరాటంతో ఉత్తేజితమై, ఉరకలు వేసిన ఉడుకునెత్తురది. దానితో జైల్లో బందీ అయిన అన్న చుక్కా రామయ్య కోసం టిక్కెట్టు లేకుండా ప్రయాణించిన ఆ ఎనిమిదేళ్ల పిల్లవాడే ఆ తరువాత అంతరిక్షానికి బాటలు వేసే స్పేస్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా ఎదిగాడు. స్వప్నాలను సాకారం చేసుకోవాలంటే ముందుగా ‘కలలు కనాలని’ చెప్పిన అబ్దుల్ కలాంతో కలసి నడిచే స్థాయికి ఎదిగిన ఆ తెలంగాణ బిడ్డ రామయ్యగారి తమ్ముడు చుక్కా వెంకటయ్య. తెలంగాణ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో పుట్టి, తెలుగునేల గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగిన వెంకటయ్య గత నెల 28న బెంగళూరులో కన్నుమూశారు.
తెలంగాణ బిడ్డలను దేశం గర్వించదగ్గ మనుషులుగా మలిచేం దుకు విద్యే కీలకంగా భావించి, అహరహం శ్రమించిన చుక్కా రామయ్య చెమర్చే కళ్లతో తమ్ముడి జ్ఞాపకాలను ‘సాక్షి’ ప్రతినిధి అత్తలూరి అరుణకు వివరించారు. అన్నదమ్ముల మధ్య 12 ఏళ్లు తేడా ఉంది. రామయ్య ఇంటికి పెద్ద. వెంకటయ్య చిన్నవారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం, గూడూరులో, నిరుపేద కుటుంబంలో 1940లో పుట్టారు వెంకటయ్య. భువనగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనూ, నారాయణ్‌పేట, సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలల్లోనూ చదువుకున్నారు. తరువాత ముంబై ఐఐటీలో చేరారు. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్‌లో ఫిజికల్ రీసెర్ ల్యాబ్‌లో అవకాశం వచ్చింది. దీనితో బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చేరారు. పరిశోధన కోసం సోవియట్ యూనియన్‌కు, తరువాత జర్మనీ వెళ్లారు. ‘దగాపడ్డ తెలంగాణలోని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరిన వెంకటయ్య నా సోదరుడు కావడం యాదృచ్ఛికమే. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతలు మోయా ల్సివచ్చింది. జైలు నుంచి వచ్చాక మా ఆర్థిక పరిస్థితిని చూసి, కమ్యూనిస్టు పార్టీ చదువు కొనసాగించమని సూచించింది. హైదరాబాద్ లోనే కమ్యూనిస్టు నాయకుడు రాజ్‌బహద్దూర్ గౌర్ ఇంట్లో ఉండి బీఎస్సీ పూర్తి చేశాను. వెంటనే కుటుంబ పోషణ కోసం అన్ ట్రైన్డ్ టీచర్‌గా చేరాను. బాధ్యతలు ఎక్కువ, జీతం తక్కువ. నాకొక్కడికే సన్నబియ్యం. అమ్మ నర్సమ్మ, పెద్ద చెల్లెలు రామాబాయి, చిన్న చెల్లె లలిత, తమ్ముడు వెంకటయ్య సజ్జగడక తినేవారు. నాతో ఆకలినీ, దారిద్య్రాన్నీ పంచుకున్న వెంకటయ్య నా ప్యాంట్లు కత్తిరించుకొని నిక్కర్లుగా తొడుక్కునేవాడు. కటిక పేదరికం మమ్మల్ని అతలాకుతలం చేసింది. అందుకే విద్యకీ, ఆకలికీ సంబంధం ఉందంటాను. కడుపు నిండినప్పుడే విద్య గురించి ఆలోచిస్తాడు విద్యార్థి. పేద విద్యార్థి మీద వెచ్చించే ప్రతిపైసా ఈ సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం. అంత దారిద్య్రంలోనూ ర్యాంక్ సాధించిన వెంకటయ్యను చూసి ఓ తండ్రిలా గర్వపడ్డాను. కానీ ఐఐటీలో చేరేందుకు ఫీజు కట్టడానికి నా దగ్గర పైసా లేదు. నాతోటి ఉపాధ్యాయుడు పూర్వాషాఢగారు తన కుమార్తెలు అశ్లేష, మృగశిరలకు చెప్పి ఫీజు కట్టించారు. వెంకటయ్య ఐఐటీ ద్వారా స్పేస్ ఇంజనీర్‌గా ఎదిగాడు. చదువంటే అమితంగా ఇష్టపడే నా సోదరుడు ఉద్యోగంలో చేరగానే ‘నేను ఇంటి బాధ్యతలు తీసుకుంటాను. నువ్వు ఎమ్మెస్సీ పూర్తి చెయ్యి’ అన్నాడు. నేను వాడిని ఆదుకున్నానా, వాడు నన్ను ఆదుకున్నాడా? అర్థం కాదు’ అంటూ కుటుంబంలో తమ్ముడి పాత్రను గుర్తు చేసుకున్నారు రామయ్య.
బెంగళూరులో తెలుగు ప్రొఫెసర్‌గా చేస్తున్న దివాకర్ల వెంకటావధానిగారి రెండవ కూతురు రాజేశ్వరి. ఆమె కూడా ప్రొఫెసరే. మంచి సాహితీవేత్త. కన్నడ, తెలుగు భాషలలో ప్రావీణ్యం కలవారామె. ఆమెను వివాహం చేసుకున్నారు వెంకటయ్య. పిల్లాపాపలతో జీవితం అన్యోన్యంగా సాగింది. కష్టజీవి అయిన వెంకటయ్య మనవలు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సమయంలో అల్జీమర్స్ బారిన పడి ఈ బాహ్య ప్రపంచం నుంచి వేరుపడ్డారు. ఆ స్థితిలో కూడా భారత అంతరిక్ష కేంద్రం సాధించిన విజయం వెంకటయ్యను కదిపింది. ‘అల్జీమర్స్ ఎనిమిదేళ్లు నా తమ్ముడిని బాధిం చింది. చివరి నాలుగేళ్లు మంచానికి పరిమితం చేసింది. అతని భార్య రాజేశ్వరి ఉద్యోగాన్ని కూడా వదిలి సేవలు చేశారు. రోజురోజుకీ క్షీణిస్తోన్న అతని ఆరోగ్యం కలచివేస్తున్నా, భర్తే లోకంగా బతికింది. ఈ ఎనిమిదేళ్లలో నేను నెలకోసారైనా వెళ్లి నన్ను గుర్తు కూడా పట్టలేని తమ్ముడిని చూసి వచ్చేవాడిని. నేనొచ్చినట్టూ, వెళ్లినట్టూ కూడా అతనికి తెలియదు. కానీ ఆ మధ్య వెళ్లినప్పుడు భారతదేశం అంతరిక్షంలోనికి 20 ఉపగ్రహాలను ఒకేసారి ప్రవేశపెట్టిందన్న విషయాన్ని అతని ముందు ప్రస్తావించగానే నా తమ్ముడి కళ్ల నుంచి నీళ్లు టపటపా రాలాయి’. ఆపై రామయ్యగారికి మాటలురాలేదు. సజల నయనాలతో ఒకమాట చెప్పారు, ‘వాడు నాకే కాదు, నాలాంటి వారికెందరికో ప్రేరణ’.
(నేడు బెంగళూరులో వెంకటయ్య ద్వాదశ దిన కర్మ)