అభిప్రాయం
సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ విద్యార్జనలో అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఆశించిన ఫలితాలు వస్తాయి.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు సామాన్య ప్రజల, అణగారిన వర్గాల అభివృద్ధికి సంపూర్ణ సంక్షేమం అందించాలని ఆకాంక్ష. అందులో భాగంగానే ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ ప్రభుత్వాలు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చాయి. అయితే కేవలం విద్యాలయాలు ఏర్పాటు చేయగానే ప్రజలకు సంక్షేమం పరిగెత్తుకు రాదనీ, దానితో పాటు సామాజిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఫలితాలు అందకుండా ఉండేందుకు చాలా అడ్డంకులు ఉంటాయనీ ప్రభుత్వాలు గుర్తించాయి. కనుకనే ఈ అవరోధాలు అధిగమించే సదుద్దేశంతో గురుకుల విద్యాసంస్థల వ్యవస్థ ముందుకు తేవడం అనేది ఆయా వర్గాలకు విద్యాసంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు ఊతమిచ్చింది. కేవలం అణగారిన వర్గాలకు చదువు చెప్పడమే కాదు. ఆ చెప్పిన చదువు వారి జీవితాలను మార్చాలనే సంకల్పంతో ఈనాడు అనేక పథకాలను ప్రవేశ పెట్టడం కూడా జరిగింది. కానీ టెక్నాలజీని వారికి అందేలా చేయడం ఒక చాలెంజ్‌గా తయారయ్యింది.
టెక్నాలజీ మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయి వుంది. కాబట్టి సంక్షేమ లబ్ధిదారులకే కాకుండా ప్రతిభ పేరుతోనైనా మార్జినల్ సెక్షన్స్‌కి ఈ అవకాశాలు అందుబాటులోనికి వస్తాయో రావోననే అనుమానం కూడా వున్నది. కాబట్టి అణగారిన వర్గాల్లో ప్రతిభను వెలికితీసి, దానికి సాంకేతికతను జోడించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పేద, అణగారిన వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకులాలను బలోపేతం చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని నేను అభినందిస్తున్నాను.
సమత్వమూ, ప్రతిభ.. రెండింటికీ మధ్య సంబంధం ఉన్నది. సమానత్వ భావనని పక్కన పెట్టి ప్రతిభను కొలవలేం. సమానత్వం లేకుండా ప్రతి భకు అర్థం లేదు. సమానత్వం లేకుండా పేద, అణగారిన వర్గాల ప్రతిభను వెలికితీయలేం. ఎవరైతే సమాజంలో అణచివేతకూ, అన్యాయానికీ గురవుతున్నారో ఆయా వర్గాల వారికి టెక్నాలజీ అనే ఖరీదైన వ్యవహారం అందుబాటులోనికి రాదు. కాబట్టి రెసిడెన్షియల్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే బయట ఉన్న విద్యావ్యవస్థను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి.
గురుకుల వ్యవస్థలో విద్యార్థులు సర్కారీ స్కూళ్ళ నుంచి వచ్చిన వారే. ఆ సర్కారీ స్కూళ్ళ నుంచి కనీసం గురుకులాలను అందుకోగలగాలంటే కూడా వారికి కనీసం ప్రాథమిక పునాది గట్టిగా ఉండాలి. ఆ వ్యవస్థలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ విద్యాబోధనలో సమత్వం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే గురుకులాలను పటిష్టం చేస్తున్నదో, ఇంకా ఇంకా చేయాలనుకుంటున్నదో దానికి అనుబంధంగా సర్కారీ స్కూళ్లలో కూడా టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి.
విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించి, విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు లెర్నింగ్ ఎఫెక్టివ్‌గా చేయగలిగితే ఆశించిన ఫలితాలొస్తాయి. సమాజంలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ ఈ విద్యార్జనలోనూ, విషయసంగ్రహంలోనూ అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఉన్నత విద్యాభ్యాసం చేస్తోన్న అణగారిన, దళిత, ఆది వాసీ బలహీన వర్గాల పిల్లలకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక శిక్షణనివ్వాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. అదేవిధంగా కొంత ప్రత్యేక శిక్షణ ద్వారా, కొన్ని మినహాయింపుల ద్వారా ఆయా వర్గాల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనను అందించేందుకు సైతం ప్రత్యేక శిక్షణ అవసరం. దానికోసం ప్రత్యేక ప్రణాళిక కూడా ప్రభుత్వాలకు ఉండాలి. పిల్లల్లో ఉన్న శూన్యతని తొలగించాలి.
అయితే ఇది చాలా కష్టతరమైనది మాత్రమే కాకుండా తక్షణ ఫలితాలనివ్వకపోవచ్చు. ఈ ప్రక్రియని సుదీర్ఘకాలం అమలు చేస్తే దీర్ఘకాలంలోనైనా ఇది అణగారిన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను తద్వారా ఉన్నతమైన జీవితాలను సుసాధ్యం చేయగలుగుతుంది. కేవలం బోధన ద్వారానో, లేదా వారికి విషయగ్రహణలో ఎదురౌతోన్న సమస్యలను అధిగమించేందుకు ఇచ్చే మనోబలం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదు. ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో సైతం ఎప్పటికప్పుడు మార్పులను అంచనావేసి మెరుగైన ప్రమాణాల కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతను వారు అందిపుచ్చుకునే ప్రత్యేక శిక్షణలు మిగిలిన సమాజానికి వారిని దూరం కాకుండా చూస్తాయి.
వివిధ ఉపాధి అవకాశాలను సైతం వారు కోల్పోకుండా చూస్తాయి. కాబట్టి సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయి. వారి ప్రగతికి పాఠశాల విద్య ఒక బలమైన పునాదిగా మారుతుంది. సర్కారీ స్కూళ్ళను మెరుగుపర్చకుండా, సమర్థులైన ఉపాధ్యాయవ్యవస్థను సద్విని యోగం చేసుకోకుండా మార్పు రాదు. రాష్ట్రం ఎదుర్కొం టోన్న ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్‌గారు వజ్రసంకల్పంతో పరిష్కరిస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే ఈ స్వప్నం సంపూర్ణం అవుతుం దని నా అభిలాష.
- చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment